ఎటుచూసినా మురుగే.. | Sakshi
Sakshi News home page

ఎటుచూసినా మురుగే..

Published Mon, Jan 20 2014 2:59 AM

The growing waste in Colonies

చీమకుర్తి, న్యూస్‌లైన్:  ఇంటి ముందే దుర్గంధం వెదజల్లుతూ పారుతున్న మురుగు నీరు.. డ్రైనేజీల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు.. దోమల గోల.. అంటు రోగాల తంటా.. ప్రతి వీధీ ఇంతే.. ప్రతి రహదారీ అంతే.. ఇదెక్కడో మారుమూల పల్లెలో కనిపించే దృశ్యం కాదు. నగర పంచాయతీగా ఆవిర్భవించి గ్రానైట్ ఖిల్లాగా పేరుగాంచి.. కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుకొనే చీమకుర్తి పట్టణంలోనిది.

ముఖ్యంగా ఎంపీడీఓ కార్యాలయానికి 150 అడుగుల దూరంలో ఉన్న వెంకటేశ్వరనగర్, గాంధీనగర్, రామ్‌రాజీవ్ నగర్ పరిసరాలు రోగాల ఖండాలుగా మారాయి. పట్టణంలోని ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన మురుగు నీరంతా ఈ కాలనీల్లోకి చేరి.. ఇళ్ల మధ్యే మురుగు చెరువులు, వాగుల్లా రూపుదిద్దుకున్నాయి.  డ్రైనేజీలు లేకపోవడంతో చిన్నచిన్న రాళ్లనే కాలువలుగా మలచుకొని వ్యర్థ నీరు వెళ్లేలా స్థానికులే ఏర్పాటు చేసుకున్నారు.

 అపార నిధులు వస్తున్నా..
 గ్రానైట్ సీనరేజీ రూపంలో చీమకుర్తి నగర పంచాయతీకి ఏటా రూ 5 కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తుంది. ఈ లెక్కన 12 సంవత్సరాల్లో కనీసం రూ 60 కోట్ల నిధులు మండల పరిషత్ ద్వారా వివిధ అభివృద్ధి పనులకోసం ఖర్చుచేశారు. అదే విధంగా గత పదేళ్లలో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పాలనా కాలంలో చీమకుర్తి మండలంలో రూ 200 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. కానీ ఇప్పటికీ మున్సిపాలిటీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం శోచనీయమని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 వర్షాకాలం వస్తే వర్షపు నీటితో పాటు అంతకు ముందు పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలన్నీ ఏకంగా ఇళ్లలోకే వచ్చేస్తుంటాయి. వెంకటేశ్వరనగర్ పరిసరాల్లో అయితే కనీసం రాకపోకలు సాగించేందుకు కూడా వీలుండదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఈ కాలనీలను ఇంతవరకు ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించిన సందర్భాలు లేవంటే ప్రజల పట్ల వారి చిత్తశుద్ధి తేటతెల్లం అవుతోంది. చీమకుర్తి నడిబొడ్డు ప్రాంతం గురించి చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయం. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం దెబ్బకు కొత్తకొత్త రోగాలన్నీ చీమకుర్తిని చుట్టుముడుతున్నాయి. ఎన్ని కోట్లు ఖర్చయినా వెంటనే భూగర్భ డ్రేనేజీ వ్యవస్థ రూపొందిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినట్లవుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement