కూతురు పుట్టిందని గెంటేశారు | Sakshi
Sakshi News home page

కూతురు పుట్టిందని గెంటేశారు

Published Sun, Apr 3 2016 11:54 PM

కూతురు పుట్టిందని గెంటేశారు - Sakshi

ఎనిమిదేళ్లవుతున్నా కాపురానికి పిలవని భర్త
అత్తింటి వద్ద ధర్నాకు దిగిన బాధిత మహిళ
తనకు, కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్

 
గాజువాక : కూతురు పుట్టిందనే కారణంతో భార్యను వదిలించుకున్నాడొక ప్రబుద్ధుడు. వివాహ సమయంలో రూ.5 లక్షల కట్నం, 15 తులాల బంగారం తీసుకొని ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులకు దిగాడు. దఫదఫాలుగా మరో రూ.1.40లక్షలను కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత కుమార్తె పుట్టిందని తన రక్త సంబంధీకులతో కలిసి కుమార్తెను, భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. ఎనిమిదేళ్లవుతున్నా కాపురానికి పిలవకుండా తాత్సారం చేస్తున్నాడు. తన కుమార్తె పెద్దదవుతుండడంతో భవిష్యత్‌పై ఆందోళన చెందిన బాధితురాలు అత్తింటి వద్ద ఆదివారం ధర్నాకు దిగింది. తనను కాపురానికి పిలవాలని, ఆస్తిలో వాటా ఇచ్చి కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. స్థానిక నాయకులు, స్థానిక మహిళా సంఘం ప్రతినిధులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

ఈ సంఘటన వడ్లపూడి నిర్వాసిత కాలనీ కణితిలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలం బొడ్డవరం గ్రామానికి చెందిన కృష్ణవేణికి కణితి కాలనీకి చెందిన రాడ్ బెండర్ సూరిశెట్టి సురేష్‌తో 2007 జూన్‌లో వివాహం చేశారు. పది రోజుల కాపురం తర్వాత అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్త అప్పలనర్సమ్మ, ఆడపడుచు కలిసి కృష్ణవేణిని వేధించడం మొదలుపెట్టారు. కుమార్తె కాపురం కోసం ఆమె తల్లిదండ్రులు దఫదఫాలుగా అదనపు కట్నం చెల్లించారు. ఏడాది తర్వాత ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన కృష్ణవేణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు ఆమెను చూడటానికి కూడా వెళ్లలేదు. పెద్దలు జోక్యంతో నెల రోజుల తర్వాత వెళ్లి పేరు (సాయి లిఖిత) పెట్టి వచ్చేశారు.

ఆ తర్వాత తల్లీ, బిడ్డలను ఇక్కడికి తీసుకురావడం కోసం కూడా పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన నెల రోజుల తర్వాత పాపకు పుట్టిన రోజు వేడుకలు చేశారు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఒక రోజు భర్త సురేష్ బాగా తాగి వచ్చి కృష్ణవేణిని చావబాదడంతో స్థానికులు ఆమెను గాజువాకలోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకున్న ఆమె ఇంటికి రావడం కోసం బయల్దేరగా అప్పటికే ఆమెను పంపేయాలని కుట్రతో ఉన్న అత్త కొద్దిరోజులు పుట్టింటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. అత్త, గ్రామ పెద్దల సూచన మేరకు పుట్టింటికి వెళ్లిన కృష్ణవేణిని నేటికీ కాపురానికి పిలవ లేదు. ఆ తర్వాత రకరకాల గొడవలు చోటు చేసుకున్నాయి.

తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ వారిపై ఆమె గతంలో కేసు పెట్టింది. ప్రస్తుతం దానిపై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ పరిస్థితిపై దిగులతో తన తల్లిదండ్రులు మంచం పట్టి మృతి చెందారని కృష్ణవేణి కన్నీరుమున్నీరైంది. తల్లిదండ్రుల మరణంతో సోదరులు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో కుమార్తెను తీసుకొని బతుకుదెరువు కోసం ఆరు నెలల క్రితం గాజువాక వచ్చేసింది. కూలి పనులు చేసుకుంటూ శ్రామికనగర్‌లో నివశిస్తోంది. అయినప్పటికీ అత్తింటి నుంచి పిలుపు రాకపోవడంతో ఆదివారం స్థానిక పెద్దలతో కలిసి అత్తింటి వద్ద ధర్నాకు దిగింది.

మెకు కణితి కాలనీలోని పెద్దలతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు మారిశెట్టి గంగాభాయి, ఎం.పి.మల్లెపూలు మద్దతుగా నిలిచారు. ఆమె ధర్నాకు దిగడంతో భర్తతోపాటు అత్త, ఆడపడుచు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. దువ్వాడ జోన్ పోలీసులు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. ధర్నా విరమించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. తనకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించబోనని బాధితురాలు స్పష్టం చేయడంతో వారు వెనుదిరిగారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement