అనధికార లేఅవుట్లతో అప్రమత్తం | Sakshi
Sakshi News home page

అనధికార లేఅవుట్లతో అప్రమత్తం

Published Sat, Sep 13 2014 2:06 AM

అనధికార లేఅవుట్లతో అప్రమత్తం - Sakshi

  •  పెరిగిన భూ మోసాలు
  •  ఉడా పరిధిలో 476 లేఅవుట్లకే అనుమతి
  •  అనధికార లేఅవుట్ల నియంత్రణకు హెల్ప్‌లైన్ సెంటర్
  •  ఇకపై ప్రతి సోమవారం ‘గ్రీవెన్స్ సెల్’
  •  సేవల కోసం : 0866-2571271
  •  వీజీటీఎం ఉడా వైస్ చైర్‌పర్సన్ పి.ఉషాకుమారి
  • సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలోని అనధికార లేఅవుట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉడా వైస్ చైర్‌పర్సన్ పి.ఉషాకుమారి సూచించారు. ఇటీవల కాలంలో అనధికార లేఅవుట్లు భారీగా వెలిశాయని, ఉడా అనుమతులు ఉన్నాయని ప్రచారం చేసుకుని మోసాలు చేస్తున్నారని చెప్పారు. ఉడా పరిధిలో భూములు కొనేవారు సమగ్ర వివరాలు తెలుసుకుని, పూర్తి సమాచారంతో ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు.

    నగరంలోని ఉడా కార్యాలయంలో శుక్రవారం ఉషాకుమారి విలేకరులతో మాట్లాడారు. రాజధాని అయిన క్రమంలో నగరానికి ప్రాధాన్యత పెరిగిందని, దీంతో పలువురు బ్రోకర్లు అనుమతి లేని స్థలాలను, భవనాలను ఉడా అనుమతులు ఉన్నాయని చెప్పి విక్రరుుస్తున్నారని చెప్పారు. ఇలాంటి మోసాల బారిన ప్రజలు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు.

    ఇందుకు ఉడా కార్యాలయంలో ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటుచేశామని, విక్రయాలకు అవసరమైన సమాచారాన్ని ఈ కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చని ఆమె చెప్పారు. ఇప్పటివరకు ఉడా ద్వారా అనుమతులు పొందిన లేఅవుట్ల సమాచారాన్ని, వాటి ప్లాన్‌ను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2008 నుంచి 2014 సంవత్సరం జూన్ వరకు 476 లేఅవుట్లకు అప్రూవల్ ఇచ్చామని వీసీ ఉషాకుమారి తెలిపారు. వీటిలో ల్యాండ్ కన్వర్షన్ సమయంలో చెల్లించే నాళాఫీజును అనేక వెంచర్లు చెల్లించలేదని చెప్పారు. 476 లేఅవుట్లకు గానూ 226 లేఅవుట్లు నాళాఫీజు చెల్లించాయని, కృష్ణాజిల్లాలో 166, గుంటూరు జిల్లాలో 36 లేఅవుట్లు ఫీజులు చెల్లించలేదని తాము నిర్ధారించినట్లు తెలిపారు.

    ఉడా నిబంధనల ప్రకారం ప్లాన్ సిద్ధంచేసిన 476 లే అవుట్లకు ఇప్పటివరకు అనుమతులు ఇచ్చామని, లే అవుట్ అనుమతుల సమయంలో ఉడా మార్టగేజ్ విధానం ఉంటుందని, ప్లాన్‌లో చూపిన విధంగానే నిర్మాణాలు చేస్తే అప్పుడు మార్టగేజ్‌ను విడుదల చేస్తామని, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి వీలు కల్పిస్తామని చెప్పారు. అక్రమ లేఅవుట్ల విషయంపై సమాచారం తమకు రాగానే వాటిని పరిశీలించి కూల్చివేస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు.
     
    గ్రామాల్లో పంచాయతీలదే బాధ్యత


    వీజీటీఎం ఉడా పరిధిలోని గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు ఉంటే.. వాటిని తొలగించే బాధ్యత ఆయా గ్రామ పంచాయితీ కార్యదర్శులదేనని ఉషాకుమారి సృష్టంచేశారు. గ్రామ పరిధిలోని లేఅవుట్‌ను పంచాయితీ కార్యదర్శులు వ్యక్తిగతంగా తనిఖీలు చేశాకే.. అనుమతులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పంచాయితీ కార్యదర్శులు అక్రమార్కులకు కొమ్ముకాస్తే సహించబోమని, వారిపై జిల్లా పంచాయతీ అధికారి చర్యలు తీసుకుంటారని చెప్పారు.

    గ్రామ పంచాయతీ, మండల తహశీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికార లేఅవుట్ల వివరాలను, ఉడా ప్లాన్‌ను డిస్‌ప్లే ఉంచుతామని చెప్పారు. అలాగే, ఉడా సేవలు, ఇతర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించటానికి కరప్రతాలతో పంపిణీ చేస్తామన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ‘గ్రివెన్స్ సెల్’ నిర్వహిస్తామని ఆమె చెప్పారు.

    మధ్యాహ్నం వరకు తాను అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తానని, మధ్యాహ్నం నుంచి ఉడా కార్యదర్శి నేతృత్వంలో ఫిర్యాదుల స్వీకరణ జరుగుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా వచ్చి ఫిర్యాదులు అందజేస్తే తక్షణమే పరిష్కరిస్తామన్నారు. అలాగే, ఉడా సేవలకు సంబంధించి 0866-2571271 నంబరులో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఉడా కార్యదర్శి డీవీ రమణారెడ్డి, ముఖ్య ప్రణాళికాధికారి టి.రామచంద్రరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డీఎస్ శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement