చదివింది 9వ తరగతి.. చేపట్టింది వైద్య వృత్తి | Sakshi
Sakshi News home page

చదివింది 9వ తరగతి.. చేపట్టింది వైద్య వృత్తి

Published Sat, May 30 2015 1:18 AM

The medical profession has been studied in 9th class

వీళ్లు వేర్వేరు వ్యక్తులనుకునేరు. రెండో ఫొటోల్లో ఉన్నది ఒకడే. ఇతగాడి అసలు పేరు వాసపల్లి నల్లయ్య అలియాస్ నరేంద్రకుమార్. కేవలం తొమ్మిదో తరగతి చదివాడు. డాక్టర్ బొల్లినేని శ్రీకాంత్‌గా అవతారమెత్తి ప్రముఖ వైద్యుడిగా చలామణి అయ్యాడు. తణుకులో సుమ క్లినిక్ పేరిట ఆసుపత్రి నడిపాడు. పదేళ్లపాటు ప్రజలను, వైద్యులను, జిల్లా అధికారులను మోసగించాడు. అసలు రంగు బయటపడటంతో 20 రోజుల క్రితం పరారయ్యాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
 
 తణుకు : అతను చదివింది తొమ్మిదో తరగతి అయితేనేం ప్రముఖ వైద్యుడిగా పేరు సంపాదించి సుమ క్లినిక్ పేరుతో ఆసుపత్రిని నిర్వహించాడు.  దాదాపు పదేళ్ల పాటు అటు అధికారులను ఇటు ప్రజలను బురిడీ కొట్టించిన నకిలీ డాక్టర్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. డాక్టర్ బొల్లినేని శ్రీకాంత్‌గా చలామణి అవుతున్న వాసపల్లి నల్లయ్య అలియాస్ నరేంద్రకుమార్ 20 రోజులుగా పరారీలో ఉన్న విషయం విదితమే.. ఈనెల 9న ఆయన నిర్వహిస్తున్న క్లినిక్‌ను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. తణుకు పోలీసులు శుక్రవారం నకిలీ డాక్టర్ శ్రీకాంత్‌ను, అతనికి సహకరించిన గాదె వెంకటరామఫణి, ర్యాలి శ్రీనివాస సీతారామచక్రవర్తిని అరెస్ట్ చేసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, సీఐ ఆర్.అంకబాబు, ఎస్సై జి.శ్రీనివాసరావు, పాల్గొన్నారు.  
 
 ఇదీ నేపథ్యం..
 పోలీసులకు పట్టుబడిన నకిలీ డాక్టర్ శ్రీకాంత్ వ్యవహారంలో భిన్న కోణాలు బయట పడుతున్నాయి. విశాఖపట్నం రెల్లిపేటకు చెందిన వాసపల్లి నల్లయ్య తొమ్మిదో తరగతి చదువుతుండగా తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. చిలకలూరిపేట మిషనరీ ఆసుపత్రిలో అనాథగా ఉంటూ అక్కడి వైద్యులు, సిబ్బంది వద్ద సహాయకునిగా పనిచేశాడు. అక్కడి నుంచి హైదరాబాదులోని మరో మిషనరీ ఆసుపత్రిలో చేరి కొంతకాలం అక్కడా పనిచేశాడు. దీంతో వైద్య వృత్తిలో కొంత అనుభవం సంపాదించాడు.
 
 ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం గుంటూరు బస్టాండ్‌లో నల్లయ్యకు బళ్లాని శ్రీకాంత్ అనే ఎండీ డాక్టర్ సరిఫికెట్లు దొరికారుు. వీటి ద్వారా బొల్లినేని శ్రీకాంత్ పేరుతో నకిలీ సరిఫికెట్లను సృష్టించి తణుకులో డాక్టర్ అవతారమెత్తాడు. తనను బొల్లినేని శ్రీకాంత్‌గా పరిచయం చేసుకుని విశాఖలోని కేజీహెచ్‌లో వైద్యుడిగా పనిచేశానని తణుకులో మెడికల్ షాపు నిర్వహిస్తున్న గాదె వెంకటరామఫణి, ల్యాబ్ యజమాని ర్యాలి శ్రీనివాస సీతారామచక్రవర్తిని నమ్మించాడు. వారి సాయంతో 2006లో తణుకు ప్రభుత్వాసుపత్రి ఎదురుగా సుమ క్లినిక్‌ను  ప్రారంభించాడు.
 
 బయటపడిందిలా..
 తణుకులో క్లినిక్ నిర్వహిస్తూ ప్రముఖ వైద్యుల జాబితాలో చోటు సంపాదించిన నల్లయ్య అలియాస్ శ్రీకాంత్ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. తన  తండ్రి గుంటూరుకు చెందిన పోలీసు ఉన్నతాధికారి అని ప్రచారం చేసుకుని గత నెలలో తణుకుకు చెందిన ఓ యువతిని వివాహమాడాడు. ఈ సమయంలో పెళ్లి శుభలేఖపై తన తండ్రి పోలీస్ ఉన్నతాధికారి అని ముద్రించడం అనుమానాలకు తావిచ్చింది. అయితే అప్పటికే నల్లయ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), జిల్లా వైద్యాశాఖ అధికారులకు తన సర్టిఫికెట్లను అందజేయకపోవడం అనుమనాలకు మరింత బలాన్ని చేకూర్చారుు. దీంతో సుమ క్లినిక్‌లో ఈనెల 9వ తేదీన డీఎంహెచ్‌వో సునంద  తనిఖీలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న నల్లయ్య పరారయ్యూడు. ఆసుపత్రిలో ఉన్న జిరాక్సు సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు అవి నకిలీవని గుర్తించారు. దీనిపై అదేరోజు డీఎంహెచ్‌వో సునంద పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నల్లయ్యను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నల్లయ్యను అరెస్టు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. ఇదిలా ఉంటే బొల్లినేని శ్రీకాంత్ పేరుతో ఉన్న పాస్‌పోర్టు ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. నకిలీ వైద్యుడ్ని అరెస్టు చేయడంలో సహకరించిన సీఐ అంకబాబు, ఎస్సైలు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, బెన్నీరాజు, హెడ్ కానిస్టేబుళ్లు రామకృష్ణ, సంగీతరావు, దొంగ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు మల్లిపూడి సత్యనారాయణ, గుల్లపూడి శ్రీనివాసు, రమేష్, రవికుమార్, మూర్తిను డీఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement