విలీన గ్రామాల్లో ‘ఉపాధి’కి గండి | Sakshi
Sakshi News home page

విలీన గ్రామాల్లో ‘ఉపాధి’కి గండి

Published Sat, Jul 12 2014 12:39 AM

The merger of the villages had to break to

  •    పనులు నిలిపివేయాలంటూ తాజాగా ఉత్తర్వులు
  •      రెండు పురపాలకాల్లో 10 వేల మందికి అశనిపాతం
  •      ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో యంత్రాంగం విఫలం
  • నర్సీపట్నం రూరల్  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం... గ్రామీణ కూలీలకు ఇదొక వరం... కానీ పురపాలకాల్లో విలీనమైన గ్రామాలకు చెందినవారికి మాత్రం దూరమైపోతోంది. పట్టణాల్లో ‘ఉపాధి’ పనులు నిలిపేయాలన్న ఆదేశాలు ఇప్పుడు వారికి అశనిపాతం అయ్యాయి. అలా ఉపాధి కోల్పోతున్నవారికి ప్రత్యామ్నాయం చూపించాలని గతంలో ఆదేశాలిచ్చినా ఆచరణలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా విలీన గ్రామాల్లోని ఉపాధి కూలీలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    జిల్లాలో రెండున్నర ఏళ్ల క్రితం ఏర్పాటైన నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల్లోని దాదాపు పది వేల మంది కూలీల జీవనంపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి నగర పంచాయతీలను రెండున్నర ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది. వీటిలో విలీనమైన 15 గ్రామాల్లోని పేద కుటుంబాలన్నీ అప్పటికే ఏటా రూ. 2 కోట్ల మేర మంజూరవుతున్న ఉపాధి హామీ పథకం పనులపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలకు ఈ పథకం వర్తించదు.

    ఈ విషయమై ఈ రెండు మున్సిపాలిటీల్లోని పేదలు అప్పట్లో అందోళనలు చేపట్టారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం... ఆయా పేదల పేదల ఉపాధికి రెండేళ్లలోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అంతవరకు వారందరికీ విలీన గ్రామాలను గతంలాగే గ్రామీణ ప్రాంతాల్లా గుర్తించి ఉపాధి పనులు కల్పించాలని స్పష్టం చేసింది. ఈమేరకు ఈ రెండున్నరేళ్లగా అక్కడ ఉపాధి పనులు కల్పించారు.

    ఇక ఆ రెండు మున్సిపాలిటీల్లో కొత్తగా ఉపాధి పనులు చేపట్టవద్దని ఆదేశిస్తూ ప్రభుత్వం వారం రోజుల క్రితం నంబర్ 321 ఉత్తర్వులను జారీ చేయడంతో మళ్లీ కూలీల కష్టాలు మొదటికొచ్చాయి. అలాగే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎటువంటి పనుల ప్రతిపాదనలూ పంపవద్దని ప్రభుత్వం సిబ్బందిని ఆదేశించింది. ప్రస్తుతం మిగిలి ఉన్న పనులను మాత్రమే పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

    ఈ ప్రకారం రెండు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న పనులు మరో నెల రోజుల వరకే సరిపోతాయి. ఇవి పూర్తయిన తర్వాత అక్కడి కూలీలంతా ‘ఉపాధి’కి దూరం కావాల్సిందే. ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అరకొర నిర్మాణ పనులు మినహా వేరే దిక్కులేదు. ఇకపై తమ జీవనోపాధి ఎలా అంటూ వారంతా ఆందోళన చెందుతున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, ఉపాధి హామీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్థానికుడే కావడంతో ఈ సమస్యను ఆయనే పరిష్కరిస్తారని ఎదురుచూస్తున్నారు.
     

Advertisement
Advertisement