కేజీహెచ్‌ను సందర్శించిన మంత్రి | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌ను సందర్శించిన మంత్రి

Published Tue, Aug 5 2014 12:30 AM

కేజీహెచ్‌ను సందర్శించిన మంత్రి

విశాఖపట్నం, మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం ఉదయం కేజీహెచ్, ఆంధ్ర వైద్యకళాశాలను సందర్శించారు. ఆస్పత్రిలోని ప్రవేశిస్తుండగా ప్రధాన ద్వారం వద్ద ధర్నాచేస్తున్న ట్రామాకేర్ సిబ్బంది మంత్రికారును అడ్డగించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  కార్డియాలజీ ఐసీయూను సందర్శించి సేవలను తెలుసుకున్నారు.

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స విభాగంతో పాటు ప్రసూతి వైద్య విభాగాలను సందర్శించారు. అక్కడ ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉండడాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైద్య కళాశాలకు చేరుకొని అక్క డ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు, జిల్లా నోడల్ వైద్యాధికారి ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ ముద్దాడ రవి చంద్రలతో సమావేశమయ్యారు. 50 మెడికల్ సీట్లు పెరిగే నేపథ్యంలో ఎంసీ ఐ అడిగిన సదుపాయాలను కల్పించే విషయంలో చేపట్టవలసిన చర్యల గు రించి చర్చించారు.

దీర్ఘకాలిక సెలవుపెట్టి బయట ఆస్పత్రులకు వెళ్తున్న వైద్యులపై కఠిన చర్యలు చేపడతామ ని, వారి వివరాలు వెంటనే అందజేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పదోన్నతులకు నోచుకోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకు డీపీసీని నిర్వహిం చాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ద్వా రా వినతిపత్రం అందజేయగా మంత్రి స్పంధిస్తూ పదోన్నతులు ఇస్తే బయటికి వెళ్లిపోతారా? అని ప్రశ్నించారు. తాము సిద్దంగా ఉన్నామని అసిస్టెంట్ ప్రొఫెసర్లు చెప్పారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ మదుసూదనబాబు, ఆర్‌ఎంఓలు శాస్త్రి, బంగారయ్య పాల్గొన్నారు.
 
మానవీయకోణంలో వైద్యసేవలందించాలి
 
మానవీయ కోణంలో వైద్య సేవలు అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వైద్యులను కోరారు. సోమవారం సాయంత్రం కేజీహెచ్ రేడియాలజీ లెక్చర్ గ్యాలరీలో వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ విధుల్లో ఉంటూ నిజాయతీతో సమయపాలన పాటించాలన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు.
 
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద  నిధులు సేకరించి కేజీహెచ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నామన్నారు.  పారిశుద్ధ్యం, భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ  రూ.2 కోట్లు అందించేందుకు ముందుకువచ్చిందన్నారు.  మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడుతోపాటు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్.. జీవీఎంసీ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడారు. తొలుత సమీకృత విరోచన వ్యాధి నివారణ పక్షోత్సవాలను మంత్రులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
 

Advertisement
Advertisement