గంజాయి ముఠాల మధ్య విభేదాల వల్లే హత్య | Sakshi
Sakshi News home page

గంజాయి ముఠాల మధ్య విభేదాల వల్లే హత్య

Published Sat, Aug 19 2017 11:41 PM

గంజాయి ముఠాల మధ్య విభేదాల వల్లే హత్య

రఘువర్మ హత్యకేసులో ముగ్గురి అరెస్టు
ఏఎస్పీ ఐశ్వర్యరస్తోగి

నర్సీపట్నం: గంజాయి ముఠాల మధ్య  విభేదాలే మాదాల రఘువర్మ హత్యకు కారణమని నర్సీపట్నం  ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14న  స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో  జరిగిన మాదాల రఘువర్మ హత్య కేసులో   ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు.

  నర్సీపట్నం ఎస్సీ కాలనీకి చెందిన మర్రా చిన్ని ఆలియాస్‌ బోడా, రోలుగుంట మండలం కొత్తపట్నానికి చెందిన శరమండ నారాయణమూర్తి, నర్సీపట్నం మండలం గుర్రందొరపాలెంకు చెందిన వేపాడ రమణను శుక్రవారం అరెస్టు చేశామని చెప్పారు.  శరమండ నారాయణమూర్తి   కొంత కాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. నారాయణమూర్తి గంజాయి రవాణా చేసిన ప్రతిసారీ   రఘువర్మ అడ్డుకుని డబ్బులు డిమాండ్‌ చేసేవాడని చెప్పారు. ఈ నేపథ్యంలో  వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవని తెలిపారు.

దీంతో రఘువర్మపై నారాయణమూర్తి కక్ష పెంచుకున్నాడని,  నర్సీపట్నానికి చెందిన సమీప బంధువైన మర్రా బోడాతో కలిసి రఘువర్మను హత్య చేసేందుకు పథకం రచించాడని తెలిపారు. గొలుగొండ మండలం ఏటిగైరం పేటకు చెందిన  రఘువర్మ  14వ తేదీన   స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉండడాన్ని చూసి నారాయణమూర్తి బోడాను తీసుకుని వచ్చాడు.  రఘువర్మ, నారాయణమూర్తిల మధ్య వాగ్వావాదం  జరిగింది. ఇదే సమయంలో మర్రా బోడా కత్తితో రఘువర్మపై దాడి చేసి  ఛాతీపై  పొడవడంతో  రఘువర్మ కుప్పకూలిపోయాడు.

అతనిని  ఏరియా ఆస్పత్రి తరలించగా అప్పటికే రఘువర్మ మృతి చెందినట్టు ఏఎస్పీ వివరించారు.   రఘువర్మ గతంలో గంజాయి కేసులో నిందితుడని చెప్పారు. రఘువర్మ హత్య  కేసులో ప్రధాన నిందితుడైన మర్రా చిన్ని అలియాస్‌ బోడాతో పాటు నారాయణమూర్తి, వారికి సహాయంగా మోటార్‌బైక్‌పై వచ్చిన వేపాడ రమణను  మేజిస్ట్రేటు ఎదుట హాజరు పరుస్తున్నట్టు చెప్పారు. నర్సీపట్నంలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కొంత మంది యువకుల జాబితా తమ వద్ద ఉందని, వారిపై  నిఘా పెట్టామన్నారు. గంజాయి అక్రమ రవాణాను సహించేదిలేదని, ఎంతటివారినైనా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ ఎస్‌.సింహాద్రినాయుడు, ఎస్‌ఐ అప్పన్న పాల్గొన్నారు..

Advertisement
Advertisement