సేల్స్‌టాక్స్ ఉద్యోగి పేరుతో టోకరా ! | Sakshi
Sakshi News home page

సేల్స్‌టాక్స్ ఉద్యోగి పేరుతో టోకరా !

Published Sat, May 10 2014 12:54 AM

సేల్స్‌టాక్స్ ఉద్యోగి పేరుతో టోకరా !

కిరాణా స్టోర్స్‌లో రూ.1.25 లక్షల నగదు తీసుకుని మాయం
 మోటార్‌సైకిల్‌పై వచ్చి దందా
 ఉయ్యూరులో పట్టపగలు కలకలం

 
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : సేల్స్‌టాక్స్ ఆఫీసర్ తరఫున వచ్చానంటూ ఓ మోసగాడు ఓ కిరా ణా దుకాణం నిర్వాహకులకు టోకరా వేశాడు. దుకాణంలో యజమాని భార్య ఉండటాన్ని అదనుగా చూసుకుని దబాయించి ఏకంగా రూ. 1.25 లక్షల నగదుతో పరారయ్యాడు. వచ్చిన వ్యక్తి వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి కాదని తరువాత నిర్ధారణ కావటంతో ఆ వ్యాపారి కుటుంబంతో పాటు స్థానికులూ నివ్వెరపోయారు. ఉయ్యూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని రావిచెట్టు ఎదురుగా శ్రీమణికంఠ జనరల్ స్టోర్స్ ఉంది. దుకాణం యజమాని రాచిపూడి శివనాగరాజు స్థానికంగా సుపరిచితుడే. మధ్యాహ్న సమయంలో భోజనానికి షాపుపైనే ఉన్న ఇంట్లోకి వెళ్లాడు. నాగరాజు భార్య శివలీల కౌంటర్‌లో కూర్చుని వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

సాయంత్రం మూడు, నాలుగు గంటల సమయంలో టిప్‌టాప్‌గా తయారైన ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై షాపు వద్దకు వచ్చాడు. లోనికి వెళ్లి.. ‘లెసైన్స్ ఏది ? వ్యాపార లావాదేవీలు ఎంత? గుమస్తాకి జీతం ఎంత? లెసైన్స్ రెన్యువల్ అయిందా?’ అంటూ హడావుడి చేశాడు. దీంతో వ్యాపారి భార్య శివలీల ‘ఎవరు సర్ మీరు?’ అని ప్రశ్నించగా, ‘సేల్స్ టాక్స్ ఆఫీస్ నుంచి వ చ్చా, మా సార్ దూరంగా ఉన్నారు. మీ వ్యాపార లావాదేవీలు ఏమీ బాగోలేదు, ఆయన వచ్చారంటే ఇబ్బందులు పడతారు’ అంటూ దబాయించాడు.

‘కౌంటర్ లో క్యాష్ ఎంత ఉంది?’ అంటూ అని ప్రశ్నించాడు. రూ. 1.25 లక్షలు నగదు ఉందని, ఈ నెల 12న తమ కుమారుడి వివాహ సందర్భంగా బంగారు నగలు కొనేందుకు తెచ్చి ఉంచామని శివలీల చెప్పింది. ‘ముందు ఆ నగదు నాకిచ్చేయండి’ అంటూ హుకుం జారీ చేయటంతో కంగారులో శివలీల మొత్తం డబ్బు అతడి చేతికి ఇచ్చివేశారు.  నకిలీ ఉద్యోగి ఆ నగదు తో ద్విచక్రవాహనంపై ఎక్కి దుకాణంలోని గుమస్తా నాగరాజన్‌ను వెనుక ఎక్కించుకుని మసీదు వరకు వెళ్లాడు.

‘ఇక్కడే ఉండు, మా సార్ దగ్గరికి వెళ్లి వస్తా’ అని గుమస్తాను దించి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ అతడు తిరిగి రాకపోవటంతో గుమస్తా వెనుదిరిగి వెళ్లి విషయాన్ని యజమాని నాగరాజుకు చెప్పాడు. ఆయన చుట్టుపక్కల ఆరా తీయగా, అసలు సేల్స్‌టాక్స్ ఆఫీసర్లు ఎవరూ తనిఖీకి రాలేదని తేలింది. దీంతో వ్యాపారి ఉయ్యూరు సీఐ మురళీరామకృష్ణకు ఫిర్యాదు చేశాడు. సీఐ ఆదేశాల మేరకు టౌన్ ఎస్సై జానకిరామయ్య దుకాణం వద్దకు వచ్చి విచారణ జరిపారు.   ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement