బాధ్యతగా పని చేయండి | Sakshi
Sakshi News home page

బాధ్యతగా పని చేయండి

Published Wed, Jan 21 2015 2:43 AM

బాధ్యతగా పని చేయండి

అనంతపురం మెడికల్ : తొమ్మిది మంది వైద్యులు సమాచారం లేకుండా వెళ్లిపోయారు.. అలా చేస్తే ఎలా..? కనీసం సమయపాలన పాటించడం లేదు.. మీ అనుమతి లేకుండా ఎలా సెలవులో వెళ్తారు...ఆ వైద్యులకు మెమోలివ్వడంటూ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.నీరజను ఆదేశించారు. వైద్య కళాశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించారు.

వైద్యులు సరస్వతి, భాను, మాధవీలత, దుర్గా, వరలక్ష్మి, నాగజ్యోతి, అరుణకుమారి, శాంతబాయి, సుదర్శన్ వీరంతా ఎక్కడికి వె ళ్లారన్నారు. సెలవులో వెళితే వీరి లీవ్ లెటర్స్‌ను చూపించమన్నారు. వారంత ఇంటిమేషన్ లేదని చెప్పడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వారికి మెమోలివ్వాలని ఆదేశించారు. విధులకు సక్రమంగా ఎందుకు హాజరుకావడం లేదని, సూపర్ విషన్ చేస్తున్నారా లేదానని ప్రశ్నించారు.

అందుకు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సార్ నా పరిధిలో చేస్తున్నానని సమాధానం ఇచ్చారు. మంత్రి తక్షణం వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మరోసారి తనిఖీ చేస్తానని, ఈ సారి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పని గంటల్లో జాప్యం చేయరాదన్నారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలకనుగుణంగా పనిచేయాలన్నారు.

స్వచ్ఛభారత్ చేశారా...చీపురు పట్టుకుని ఊడ్చారా అనిప్రశ్నించారు. ప్రతిభావంతులు మీరే స్వచ్ఛ భారత్ చేయకపోతే ఎలాగన్నారు. అందుకు ప్రిన్సిపాల్ స్పందిస్తూ సార్ గతంలో అందరూ చేశామన్నారు. వైద్య కళాశాలలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వీలైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
 
ఈవ్‌టీజింగ్‌పై ఉక్కుపాదం : అనంతరం మంత్రి మెడిసన్ విద్యార్థులతో మాట్లాడారు. ఎవరైనా ఈవ్‌టీజింగ్ చేస్తున్నార అని ఆరా తీశారు. అలా చేస్తే ఉక్కుపాదం మోపుతామన్నారు. అందరు స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలని తెలిపారు. ఈవ్‌టీజింగ్ నేరమని, అటువంటి వాటికి పాల్పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. బాగా చదువుకుని మంచి వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
 
వైద్యుల ఆవేదన : ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన తీరు వైద్య కళాశాల వైద్యులను బాధించింది. తనిఖీలో ప్రిన్సిపాల్‌ను నిలబెట్టి మాట్లాడడం ఎంత వరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు. వందల మంది వైద్యులకు అధిపతి అయిన ఆమెను నిలబెట్డడంపై వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
రెగ్యులరైజ్ చేయండి : ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయూలని వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఈయూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. మంత్రి ఎదుట ప్లకార్డులు, బ్యానర్‌తో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రికి వినతి పత్రం అందించారు. ఈయూ నేతలు లోకేష్ యాదవ్, రాంప్రసాద్, రవి, రోషన్, మసూద్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement