రామ‘తీర్థా’నికి ఎసరు | Sakshi
Sakshi News home page

రామ‘తీర్థా’నికి ఎసరు

Published Sat, Aug 8 2015 4:09 AM

రామ‘తీర్థా’నికి ఎసరు - Sakshi

కందుకూరు : వేసవిలో జిల్లా మొత్తం తాగునీటి సమస్యతో అల్లాడుతున్నా కందుకూరు మున్సిపాలిటీలో మాత్రం తాగునీటి సమస్య లేదంటే అది కేవలం ఒక్క రామతీర్ధం మంచినీటి పథకం వల్లే సాధ్యమవుతోంది. దాదాపు 70 వేల మంది జనాభాకి పుష్కలంగా నీరు అందిస్తున్న ఈ పథకానికి గండికొట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు పన్నిన ఈ కుట్రలో మున్సిపల్ అధికారులు భాగస్వాములై తెరవెనుక పావులు కదపడం ప్రారంభించారు.

నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీ నుంచి పంచాయతీలకు తాగునీటిని తరలించడానికి కృషి చేస్తున్నారు. ఈ మేరకు అవసరమైన పైప్‌లైన్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొనగా, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు భగ్గుమంటున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి మరికొందరు ప్రయత్నిస్తున్నారు.

నిబంధనలకు పూర్తి విరుద్ధం
కందుకూరు మున్సిపాలిటీకి మంచినీటిని అందించేందుకు అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద నిధులు ఇవ్వాలన్న అప్పటి శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దాదాపు రూ.120 కోట్లు నిధులు మంజూరు చేశారు. వీటిలో రామతీర్థం ప్రాజెక్టు నుంచి 66 కిలోమీటర్ల మేర భారీ పైప్‌లైన్ నిర్మించి, ఉప్పుచెరువులో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా పట్టణానికి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో గత మూడేళ్ళ నుంచి పట్టణానికి మంచినీటి సమస్య తీరింది. పట్టణంలోని జనాభాకు పుష్కలంగా నీరందుతుండంతో తాగునీటి సమస్య నుంచి పట్టణ ప్రజలు పూర్తిగా ఉపసమనం పొందారు.

ప్రస్తుతం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు అధికార పార్టీ నాయకులు సరికొత్త కుట్రకు తెరదీశారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక స్థానిక సంస్థ నుంచి మరో స్థానిక సంస్థలకు సౌకర్యాలు అందించడం సాధ్యం కాదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీకి చెందిన పంచాయతీలకు ఈ నీటిని తరలించేందుకు తెరదీశారు. దీనిలో భాగంగా ప్రస్తుతం మండలంలోని ఆనందపురం, శ్యామీరపాలెం, గనిగుంట, దివివారిపాలెం, చుట్టుగుంట, గళ్లావారిపాలెం, కండ్రావారిపాలెం, ముక్కొడివారిపాలెం గ్రామాలకు మున్సిపాలిటీ నుంచి నీటిని తరలించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు.

ఈ మేరకు రూ. 61లక్షలతో పైప్‌లైన్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని డీఎంఎకి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు మున్సిపల్ స్పెషలాఫీసర్‌గా ఉన్న కందుకూరు ఆర్డీఓ గత మే 23 తేదీన 11/35/ఓూఈ/క్కఖ్గీ/ఈగ/ఎూఔ/2015తో ఫైల్ తయారు చేసి పంపారు. దీని అత్యంత రహస్యంగా ఉంచినా బయటకు పొక్కడంతో మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 గ్రామాల విలీనంపై కోర్టులో పెండింగ్
 ప్రస్తుతం మున్సిపాలిటీ నుంచి నీటిని సరఫరా చేసే 8 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం చేయాలనే అంశంపై ప్రస్తుతం హైకోర్టులో ఉంది. ఇటీవల కందుకూరు మున్సిపాలిటీని ఉదాహరణగా చూపిస్తూ ప్రభుత్వం విలీన గ్రామాలకు సంబంధించి ఓ జీఓను విడుదల చేసింది. ఇవి మున్సిపాలిటీకి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా ఈ గ్రామాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ కీలక టీడీపీ నాయకుడు ఈ కుట్రకు తెరదీశాడు.
 
 అసలుకే మోసం వచ్చే పరిస్థితి
 అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఈ ప్రయత్నాలతో అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఎనిమిది గ్రామాలకు నీటిని తరలిస్తే మరిన్ని గ్రామాల నుంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కేవలం కందుకూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండముడుసుపాలెం, అనంతసాగరం,  మహదేవపురం, కొండికందుకూరు, నరిశెట్టివారిపాలెం,కోవూరు చెర్లోపాలెం, కాకుటూరు వంటి గ్రామాల నుంచి ప్రతిపాదనలు వచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో పట్టణానికి మంచినీటి సరఫరా కోసం ఉద్దేశించిన ఈ పథకం అసలుకే ఎసరు ఏర్పడే ప్రమాదం ఉంది.

అదే జరిగితే ఇన్ని కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ పథకం వృధానే. వాస్తవానికి ప్రస్తుతం నీటిని తరలించేందుకు ఉద్దేశించిన 8 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు రూ.10 కోట్లు ఖర్చుతో మన్నేరుపై ఆత్మకూరు-ఆనందపురం మంచినీటి పథకాన్ని నిర్మించారు. ఈ పథకం ఆ గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మించారు. ఆ పథకం సక్రమంగా పనిచేయడం లేదు. దీన్ని మరమ్మతు చేసుకుని నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, మున్సిపాలిటీ కేవలం వారికి సంబంధించిన గ్రామాలకే నీటిని తరలించడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement