పల్లవి రైస్‌మిల్లు వద్ద ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

పల్లవి రైస్‌మిల్లు వద్ద ఉద్రిక్తత

Published Tue, Jan 21 2014 1:52 AM

The prelude to the tension at raismillu

  • మూడోరోజూ కొనసాగిన రైతుల ఆందోళన
  •  వంటావార్పుతో వినూత్న నిరసన
  •  పోలీసులు, రైతుల మధ్య వాగ్వివాదం
  •  
    విజయవాడ, న్యూస్‌లైన్ : ఎనికేపాడు పల్లవి రైస్‌మిల్లు వద్ద రైతులు చేస్తున్న ఆందోళన సోమవారం మూడోరోజుకు చేరింది. రెండు రోజుల నుంచి మిల్లు ప్రధాన గేటు వద్ద బైఠాయించిన రైతులు తమ బకారుులు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేస్తున్నారు. యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం వంటావార్పు నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ మిల్లుకు తోలామని, ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

    16 జిల్లాలతో పాటు బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లోని రైతులకు సుమారు రూ.50కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గతరాత్రి  మిల్లులో పనిచేసే ముఠా కార్మికులను తమపైకి ఉసిగొల్పి దాడులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన గేటు వద్ద తాము ఆందోళన చేస్తుంటే యాజమాన్యం మరో గేటు నుంచి లారీల ద్వారా ధాన్యాన్ని బయటకు పంపిస్తోందన్నారు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేశామని, కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందన లేదని చెప్పారు. తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయని, మిల్లు యాజమాన్యం బకాయిలు చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు.
     
    టెంట్ కూల్చేసిన పోలీసులు
     
    నిరసన వ్యక్తంచేస్తున్న రైతుల టెంట్‌ను సోమవారం పోలీసులు కూల్చేశారు. సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందితేనే ఆందోళనకు అవకాశం కల్పిస్తామని తేల్చిచెప్పారు.  ఈ నేపథ్యంలో కొద్ది సేపు పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది.
     
    మిల్లును బేరం పెట్టాను : యజమాని విశ్వనాథం


     మిల్లు వద్దకు చేరుకున్న పల్లవి రైస్‌మిల్లు యజమాని విశ్వనాథం రైతులు, విలేకరులతో మాట్లాడారు. రైతులకు సుమారు రూ.50 కోట్ల బకాయిలు పడ్డ మాట వాస్తవమేన ని, అనివార్య కారణాల వల్ల చెల్లించలేకపోయూనన్నారు. మిల్లును బేరం పెట్టానని, విక్రయించగా వచ్చిన డబ్బుతో బకాయిలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ైముఠా కార్మికులతో రైతులపై దాడి చేయించానన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రైతుల ఆందోళనతో వ్యాపారంలో ఆటంకం కలిగి ఇంకా నష్టాల్లో కూరుకుపోతున్నామన్నారు.
     
    వైఎస్సార్ సీపీ సంఘీభావం

     పల్లవి రైస్‌మిల్లు బాధిత రైతులకు న్యాయం జరిగేలా కలెక్టర్ రఘునందన్‌రావు, మంత్రి పార్థసారథి చర్యలు తీసుకోవాలని  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ైరె స్‌మిల్లు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సోమవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగేలా అన్నీ రాజకీయ పార్టీలు, అధికారులు సహకరించాలని కోరారు. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయం జరిగే వరకు బాధిత రైతుల పక్షాన నిలబడతానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ కొల్లి రాజశేఖర్ కూడా పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement