పాలకుల నిర్లక్ష్యంతోనే పల్నాడులో నీటి ఎద్దడి | Sakshi
Sakshi News home page

పాలకుల నిర్లక్ష్యంతోనే పల్నాడులో నీటి ఎద్దడి

Published Fri, Mar 18 2016 1:16 AM

పాలకుల నిర్లక్ష్యంతోనే పల్నాడులో నీటి ఎద్దడి - Sakshi

ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ  ఎప్పుడూ స్పందిస్తుంది
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్

 
పిడుగురాళ్ళ: ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పల్నాడులో నీటి ఎద్దడి తలెత్తిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన తాగునీటి వాటర్ ట్యాంకు వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంచినీటి కోసం ఈ ప్రాంతానికి కొన్ని కోట్ల రూపాయలను మంజూరు చేస్తే ఆ పథకాలను ప్రస్తుత అధికార పార్టీ వారు పూర్తి చేయకుండా నిరుపయోగంగా ఉంచడంతో నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తల్లిదండ్రులు ఆళ్ల దశరథ రామిరెడ్డి, వీరరాఘవమ్మల సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ వాటర్‌ట్యాంకులను ప్రారంభించడం సంతోషకరమన్నారు.

తాగునీటి సమస్యను తీర్చేందుకే అయోధ్యరామిరెడ్డి వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారన్నారు. గురజాల నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఉందని జంగా కృష్ణమూర్తి తెలపడంతో తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు వాటర్ ట్యాంకులను సిద్ధం చేశారని అన్నారు. పట్టణానికి చెందిన అల్లు పిచ్చిరెడ్డి, కొక్కెర వాసుదేవరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తాటికొండ చిన ఆంజనేయులురెడ్డిలు కూడా వాటర్‌ట్యాంకులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement