ఇక ప్రజా ప్రతినిధులు డమ్మీలే... | Sakshi
Sakshi News home page

ఇక ప్రజా ప్రతినిధులు డమ్మీలే...

Published Sun, Mar 2 2014 4:04 AM

ఇక ప్రజా ప్రతినిధులు డమ్మీలే...

  • అధికారులదే పెత్తనం
  •  పాలన అంతా కలెక్టర్ పర్యవేక్షణలోనే
  •  జిల్లా ప్రజలు రెండోసారి రాష్ట్రపతి పాలన చూడబోతున్నారు. జై ఆంధ్రా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన నేపథ్యంలో 1973లో రాష్ట్రపతి పాలన విధించారు. తిరిగి రాష్ట్ర విభజన, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా కారణాలను దృష్టిలో ఉంచుకొని శనివారం రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులిచ్చారు.
     
    సాక్షి, విజయవాడ : ఇక ప్రజాప్రతినిధులు డమ్మీలుగా మారనున్నారు. రాష్ట్ర అసెంబ్లీని సుషుప్తావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన అమలు చేయాలని రాష్ట్రపతి శనివారం ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాల కోసం ప్రజలపై రాష్ట్రపతి పాలన రుద్దిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జిల్లా పాలన మొత్తం కలెక్టర్ చేతిలోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రాజీనామాతో మంత్రి పార్థసారథి మాజీ మంత్రి అయిపోయారు. ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నందున శనివారం వరకు ఆయనకు ప్రోటోకాల్ కొనసాగించారు.

    రాష్ట్రపతి పాలన ఆమోదం పొందగానే ప్రభుత్వ వాహనాలు, ఎస్కార్ట్ వెనక్కి తీసుకుంటారు. ఈ నిర్ణయం ఆదివారం నుంచి అమలులోకి రానుంది. ఎమ్మెల్యేలు కూడా పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉంటారు. వీరికి ఎటువంటి హక్కులూ ఉండవు. వేతనం మాత్రం వస్తుంది. ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలలో వీరికి ప్రాధాన్యత ఉండదు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ప్రభుత్వం ఉన్నా ఏ నిర్ణయం తీసుకోలేరు కాబట్టి పెద్దగా తేడా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసాధారణ  పరిస్థితులు ఉంటేగాని పెట్టకూడ ని రాష్ట్రపతి పాలనను ఆంతరంగిక సమస్యల కోసం పెట్టడాన్ని మేధావులు తప్పు పడుతున్నారు. రెండుసార్లూ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ ఉండటం గమనార్హం.
     
    అంతర్గత కారణాలతోనే..

    గతంలో 1973లో రాష్ట్రపతి పాలన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు.. ఇప్పుడు కూడా అంతర్గత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అప్పుడు కృష్ణా కలెక్టర్‌గా సీఎస్ రావు పనిచేస్తే.. ఇప్పుడు రఘునందన్‌రావు ఉన్నారు. అయితే పాలనలో నిత్యం జరిగే వ్యవహారాల్లో పెద్దగా తేడా ఉండదని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ప్రభుత్వం వచ్చే వరకు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు. అధికారుల బదిలీలు కూడా ఉండవు. అధికారుల నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం ఉండదు.
     
    మరోవైపు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు కూడా అధికారులపై ఉండవు. 1973లో రాష్ట్రపతి పాలన పెట్టిన సమయంలో జిల్లాలో జైఆంధ్ర ఉద్యమం హింసాత్మక రూపం తీసుకోవడం, ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉక్కు కాకాని వెంకటరత్నం మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కలెక్టర్ సీఎస్ రావు చాకచక్యంగా వ్యవహరించి జిల్లాలో పరిస్థితులు చక్కబడేందుకు కృషి చేశారు. ఆ సమయంలో కాకాని వెంకటరత్నం, మండలి వెంకట కృష్ణారావు, కాజా రామనాధం, దమ్మలపాటి రామారావు, వసంత నాగేశ్వరరావు, ఆసిఫ్ పాషా, అక్కినేని భాస్కరరావు, చనుమోలు వెంకట్రావు, కోట రామయ్య, మేకా రాజా రంగయ్య అప్పారావు వంటి హేమాహేమీలు శాసనసభ్యులుగా ఉన్నారు.
     

Advertisement
Advertisement