ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

Published Mon, Sep 21 2015 4:10 AM

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు - Sakshi

వైఎస్సార్ సీపీ స్టూడెంట్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలోవిద్యార్థి సంఘాలు
 
 కడప రూరల్ : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.ఖాజా రహమతుల్లా ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు నేతలు పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని, కరువు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పి, నేడు మాట మార్చడం తగదని హితవు పలికారు.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రంలో పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఈనెల 26వ తేదిన చేపట్టనున్న నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరు బాసటగా నిలిచి ప్రత్యేక హోదా సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలకుల కుటిల ఆలోచనలను, నిర్ణయాలను తిప్పి కొట్టడానికి విద్యార్థి లోకం సిద్ధం కావాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు ప్రాంతమైన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్ మాట్లాడుతూ విభజన హామీలను పాలకులు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రానికి, ముఖ్యంగా విద్యార్థి లోకానికి భవిష్యత్తే ఉండదన్నారు. హోదా కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు ప్రత్యేక హోదాకోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే దీక్షకు సంఘీభావం ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు దస్తగిరి, నిత్య పూజయ్య, నాగార్జునరెడ్డి, అలీ, సనావుల్లా, సుభాన్ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement