Sakshi News home page

రాజధాని.. మన హక్కు

Published Mon, Jun 23 2014 2:36 AM

రాజధాని.. మన హక్కు - Sakshi

 అనంతపురం ఎడ్యుకేషన్ : ‘ఆంధ్ర, తెలంగాణ విలీన సమయంలో ఒప్పందం మేరకు రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన నేపథ్యంలో ఇప్పుడు రాజధాని అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నాడు ఏ భౌగోళిక సరిహద్దులతో కర్నూలు రాజధానిగా ఏర్పడిందో...ఈ రోజు దాదాపు అదే భౌగోళిక సరిహద్దులతో అవశేషాంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయితే, రాజధానిని మాత్రం కోస్తా ప్రాంతానికి తరలించేందుకు పాలకులు కుట్ర పన్నుతున్నారు. ‘ఆ రోజు మేం (రాయలసీమ వాసులం) రాజధానిని త్యాగం చేశాం...ఈ రోజు మా రాజధానిని మాకిచ్చేయండి. రాజధాని మనహక్కుగా భావించి పాలకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని మేధావులు పిలుపునిచ్చారు.
 
 ఆదివారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని భువన విజయం ఆడిటోరియంలో రాయలసీమలో రాజధాని సాధన కోసం మేధోమదనం పేరిట సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి  లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ‘ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం అజాగ్రత్త చేసినా రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదముంది. పాలకులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అభివృద్ధిని ఒక ప్రాంతానికే పరిమితం చేయరాదు. 1956లో రాయలసీమ ప్రజలు రాజధానిని త్యాగం చేశారు. ఈ రోజు అదే రాజధానిని ఇక్కడికి కాకుండా మరో ప్రాంతానికి ఎలా తరలిస్తారు? ’ అని ప్రశ్నించార
 
 పథకం ప్రకారమే తరలింపు యత్నం
 రాజధానిని కోస్తా ప్రాంతానికి తరలించేందుకు పథకం ప్రకారం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మేల్కొనకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. రాజధానిని సాధించుకోకపోతే చివరకు నీటి హక్కులు కూడా కోల్పోతాం. రాయలసీమలో రాజధాని కోసం చేసే ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా ఉండాలి.
 - శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు  
 
 రూ.వంద కోట్లు వసూలు చేసిస్తాం
 పాలకులను న్యాయం చేయమని కోరం. కాకపోతే అన్యాయం చేయొద్దని చేతులెత్తి మొక్కుతాం. అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టే ఆ రోజు కర్నూలును రాజధాని చేశారు. రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు మేమూ, మా విద్యార్థులూ  వందకోట్లు విరాళాలు సేకరించి ఇస్తాం.
 - కే. మల్లికార్జునరెడ్డి, చరిత్ర శాఖాధిపతి, ఎస్కేయూ
 
 రాజధాని మన హక్కు
 రాజధాని రాయలసీమ వాసుల హక్కు. తొలి సభ నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన చంద్రబాబునాయుడు రాజధాని విజయవాడలో ఏర్పాటవుతున్నట్లు మీడియాకు లీకులిచ్చారు. ఇంత జరుగుతున్నా...ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదు. ఇక నాయకులతో పనిలేదు. అన్ని వర్గాల ప్రజలూ రోడ్డెక్కెల్సిన సమయం ఆసన్నమైంది.
 - డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, రాయలసీమ సాధన పోరాట సమితి సభ్యుడు
 
 విభజనతో కన్నీటి సీమగా మారింది
 రాష్ట్ర విభజనతో రాయలసీమ కన్నీటి సీమగా మారింది. రియల్టర్లు పెట్టుబడులు పెట్టిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని పాలకులు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కచ్చితంగా రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి. ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమించి ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలి.
 - సునీత, ఉపాధ్యాయురాలు
 
 ప్రకృతి వైపరీత్యాల ప్రభావం లేని నగరం
 భూకంపాలు, వరదలు, తుఫాను తాకిడి లేని నగరం కర్నూలు. కోస్తా ప్రాంతానికి రాజధాని తరలింపు యత్నాలను ప్రాణాలొడ్డైనా సరే అడ్డుకోకపోతే, ఈ ప్రాంత అభివృద్ధిని చేజేతులా నాశనం చేసిన వారవుతాం. రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కండి.
 - చంద్రశేఖర్ కల్కూర, తెలుగు భాషా వికాస ఉద్యమం అధ్యక్షుడు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement