ముగ్గురు మహిళలపై టీడీపీ నేత దాడి | Sakshi
Sakshi News home page

ముగ్గురు మహిళలపై టీడీపీ నేత దాడి

Published Sat, Feb 15 2014 2:11 AM

The said three women attacked

  • బాధితులు వెఎస్సార్ సీపీ సానుభూతి పరులు
  •  టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి ఘాతుకం
  •  నిరసనగా దళితుల రాస్తారోకో
  • అవనిగడ్డ/నాగాయలంక, న్యూస్‌లైన్ : అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ బాబాయ్ కొడుకు, సర్పంచి అంబటి శ్యామ్‌ప్రసాద్ దళితవర్గానికి చెందిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ మహిళా సానుభూతిపరులపై శుక్రవారం దాడిచేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత పంచాయతీ ఎన్నికల్లో ఈ ముగ్గురూ వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థికి మద్ధతు ఇచ్చినందుకే దాడిచేసినట్లు బాధితులు పేర్కొన్నారు.  ఘటనకు నిరసనగా అవనిగడ్డలో దళితులు రాస్తారోకో చేశారు.

    వివరాల్లోకి వెళితే... నాగాయలంక పోలీసుస్టేషన్ పరిధిలోని బ్రహ్మానందపురానికి చెందిన  వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు మునిపల్లి భాస్కరరావు తల్లి మునిపల్లి కళావతి, బంధువులైన కొక్కిలిగడ్డ మార్తమ్మ, ఆళ్లకూరి మరియమ్మ  గ్రామంలోని బంధువుల ఇంట జరుగుతున్న సంవత్సరికం కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది తెలుసుకున్న వక్కపట్లవారిపాలెం సర్పంచి అంబటి శ్యామ్‌ప్రసాద్, నాని, మరో వ్యక్తి కలసి కులంపేరుతో దూషించి రాడ్లతో వారిపై దాడిచేసి గాయపరచి పరారయ్యారు. గాయాలైన ముగ్గురు మహిళలను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నారు.
     
     వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చినందునే...
     
    గత పంచాయతీ ఎన్నికల్లో వక్కపట్లవారిపాలెం గ్రామ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థికి  మునిపల్లి కళావతి మద్దతు ఇచ్చినందునే సర్పంచి శ్యామ్‌ప్రసాద్ దాడిచేశాడని వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యులు మునిపల్లి భాస్కరరావు ఆరోపించారు. ఆ ఎన్నికల నాటి నుంచి తమపై కక్ష పెట్టుకున్న సర్పంచి మహిళలని  చూడకుండా రాడ్డుతో దాడిచేసి గాయపరిచాడని చెప్పారు.
     
    రాస్తారోకో....
     
    బ్రహ్మానందపురంలో దళితులపై దాడిచేసి తీవ్రంగా గాయపరచిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండుచేస్తూ మాలమహానాడు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక ఏరియా ఆస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు.   దళిత నాయకులు దోవా గోవర్ధన్, నలుకుర్తి రమేష్, నలుకుర్తి రాజేష్, సీపీఎం నాయకుడు బండి ఆదిశేషు తదితరులు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో దళితసంఘాల ఐక్యవేధిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.  అవనిగడ్డ, నాగాయలంక ఎస్‌ఐలు శివరామకృష్ణ, నరేష్ రంగప్రవేశం చేసి నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
     

Advertisement
Advertisement