పరపతే కొలమానం | Sakshi
Sakshi News home page

పరపతే కొలమానం

Published Thu, Dec 11 2014 2:10 AM

పరపతే కొలమానం

స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమాఫీ: పరకాల
జాబితాలో పేర్లు లేని రైతులు జనవరి 9వ తేదీ లోపు సవరణలు చేసుకోవాలి
నేడు చిత్తూరులో సీఎం చేతుల మీదుగా రుణ విముక్తి సర్టిఫికెట్లు

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘రైతులు తీసుకున్న రుణం అంతా మాఫీ చేయమంటే ఎలా సాధ్యం? బ్యాంకర్లు ఇష్టం వచ్చినట్లు రుణాలు ఇస్తే ప్రభుత్వానికి ఏమి సంబంధం? అందుకే ప్రభుత్వం రుణ మాఫీ పథకం అమలుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కొలమానంగా తీసుకుంది’’ అని ప్రభుత్వ సమాచార సలహాదారుడు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో విలేకరులతో మాటాడారు. రైతులను అయోమయానికి గురి చేసే విధంగా కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆరోపించారు. వాటిని నమ్మి ఎవ్వరూ అపోహలకు గురి కావద్దన్నారు. ‘రుణ మాఫీ హామీ ప్రకటన చేసిన సమయంలో చంద్రబాబు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని రైతులకు చెప్పలేదు కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. నేరుగా సమాధానం చెప్పకుండా ‘‘ఒక రైతు కుటుంబం 15 ఖాతాల ద్వారా రూ. 70 లక్షల రుణం తీసుకుంది.. అదంతా మాఫీ చేయమంటారా?’’ అని పరకాల ఎదురు ప్రశ్న వేశారు. మొదటి విడతగా 22.79 లక్షల రైతు కుటుంబాలను రుణ విమోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 10 లక్షల మంది రైతులకు మొత్తం రుణం ఒకేసారి మాఫీ అవుతోందన్నారు.
 
  డేటా ఎంట్రీ సమయంలో కొన్ని తప్పులు దొర్లాయని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. లోపాలున్న జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచామని.. ఏ కారణం చేత తొలి జాబితాలో పేరు లేదో  తెలుసుకొని  సంబంధిత డాక్యుమెంట్లను జనవరి 9వ తేదీ లోపు ఆధారాలతో సహా ఇస్తే సరిచేసి రుణ మాఫీకి అర్హులుగా గుర్తిస్తామని చెప్పారు. రుణ మాఫీ పథకాన్ని సీఎం చంద్రబాబు గురువారం చిత్తూరు జిల్లాలో ప్రారంభిస్తారని.. ఈ సందర్భంగా రైతులకు వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను అందజేస్తారని ఆయన వివరించారు.
 
 తెలంగాణలో ఆధార్, రేషన్ కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్‌లో పొలం ఉండటంతో పాటు అక్కడే రుణం తీసుకున్న వారి విషయంలో ఏమి చేయాలని ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా 2013 డిసెంబర్ 31వ తేదీ తర్వాత వచ్చే బీమా మొత్తం రైతుల ఖాతాకే జమ అవుతుందన్నారు.
 

Advertisement
Advertisement