రెండో పంటకు నీరివ్వలేం | Sakshi
Sakshi News home page

రెండో పంటకు నీరివ్వలేం

Published Tue, Mar 3 2015 2:08 AM

The second crop nirivvalem

నెల్లూరు (రవాణా): రెండో పంటకు సాగునీరు అందించలేమని నీటిపారుదల శాఖ అధికారులు తేల్చిచెప్పారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో ఇప్పటికే నీటిమట్టం తక్కువుగా ఉందని, మొదటి పంటకు ఈ నెలాఖరు వరకు నీరు అందించాల్సి ఉందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణకు వివరించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఇరిగేషన్, వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులతో సాగునీటి సమస్యపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగునీటిపై వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని ఆదేశించారు. సోమశిలలో గతేడాది ఈసీజన్‌లో 40.43 టీఎంసీల నీరుందని, ప్రస్తుతం 19.52 టీఎంసీలే ఉందని అధికారులు తెలిపారు. కనిగిరి ట్యాంకు కింద 10వ జోన్‌కింద తప్పనిసరిగా నీరు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

10జోన్ కింద 3వేల ఎకరాలు సాగులో ఉందన్నారు. వీటికి సంబంధించి 0.2 టీఎంసీ నీరు అవసరముందని వెల్లడించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు చివరి వరకు రెండో పంట ఉంటుందని, సాగునీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని మంత్రి నారాయణకు ఇరిగేషన్ అధికారులు తేల్చిచెప్పారు. సోమశిలలో  20 టీంఎసీలు నీరున్నా రెండో పంటకు ఇవ్వలేమన్నారు. కావలి కెనాల్ పరిస్థితి ఏమిటని మంత్రి నారాయణ అధికారులును ప్రశ్నించారు.

కావలి కెనాల్ కింది మొత్తం 60,750 ఎకరాలు ఉందని, అందులో 30,750 అధికారికంగా మిగిలినది అనధికారంగా సాగువుతుందని వివరించారు. కాలువ కెనాల్‌కు మొత్తం 6.13 టీఎంసీ నీరు అందించాల్సి ఉందని, ఇప్పటివరకు 4.6 టీఎంసీలే ఇచ్చామని, మిగిలినది ఈనెల 15లోపు అందిస్తామని చెప్పారు. జేసీ ఇంతియాజ్, సోమశిల ఎస్‌ఈ సుబ్బారావు, ఈఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 
10 లక్షల ఎకరాలు సాగులోకి తెస్తాం..

జిల్లాలో 2019 నాటికి 10 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందు కు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సమావేశ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 8 లక్షల ఎకరాలు సాగులో ఉందన్నారు. ఏడాదికి 50 వేలు చొప్పును 4 ఏళ్లల్లో 2 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాను బెస్ట్ అగ్రికల్చర్, బెస్ట్ హార్టికల్చర్‌గా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం దొంతాలి, కంటేపల్లి, ఇడిమేపల్లి ప్రాంతాల్లోని కాలువలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నట్లు వెల్లడించారు. వారంలో వాటర్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement