సీఎం సమావేశానికి ప్లానింగ్‌తో పయనం | Sakshi
Sakshi News home page

సీఎం సమావేశానికి ప్లానింగ్‌తో పయనం

Published Thu, Aug 7 2014 3:29 AM

సీఎం సమావేశానికి ప్లానింగ్‌తో పయనం

  •       విజయవాడలో కలెక్టర్లతో నేడు ముఖ్యమంత్రి సమావేశం
  •      ఐదేళ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికతో వెళ్లిన కలెక్టర్ సిద్ధార్థజైన్
  •      ఐఐటీ, తిరుపతి స్మార్ట్‌సిటీ,కుప్పం అభివృద్ధిపై ప్రధాన దృష్టి
  •      తాగునీటి సమస్య, వ్యవసాయాభివృద్ధిపైనా..
  • జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మౌలిక సదుపాయాలను ఎలా సమకూర్చాలి? పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధి దిశగా ఎలాంటి అడుగులు వేయాలి? ఇలా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన నిర్ధిష్ట ప్రణాళికతో కలెక్టర్ సిద్ధార్థజైన్ విజయవాడకు పయనమయ్యారు. జిల్లాల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లతో గురువారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.    
     
    సాక్షి, చిత్తూరు: విజయవాడలో జరిగే సమావేశానికి కలెక్టర్ సమగ్ర నివేదికతో వెళ్లారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో నివేదిక తయారీపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్య శాఖలకు సంబంధించిన అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి భాస్కరశర్మ నివేదిక  సిద్ధం చేశారు.
     
    పారిశ్రామిక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు

    జిల్లాలో పరిశ్రమలు, విద్యాసంస్థల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో పొందుపరిచారు. శ్రీకాళహస్తి, ఏర్పేడులో 12వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, ఇందులో ఐఐటీతోపాటు ఐబీఎం లాంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. కలికిరిలోనూ పరిశ్రమలు స్థాపించవచ్చని సూచించారు. పరిశ్రమల స్థాపనకు నీటి సమస్య ప్రధాన అడ్డంకి కానుందని, దీనికోసం హంద్రీ-నీవాను పూర్తి చేయడమేగాక జిల్లాలోని ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
     
    కండలేరు పరిస్థితి ఏంటో తేల్చండి?
     
    జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని శాశ్వతంగా నివారించేందుకు గత ప్రభుత్వం కండలేరు నుంచి నీటిని తెచ్చేందుకు ఉపక్రమించిందని సూచించారు. టెండర్ల ప్రక్రియ వరకూ వచ్చి ఆగిపోయిన ఈ పథకాన్ని పూర్తి చేస్తే జిల్లాలో మంచినీటి సమస్యను నివారించవచ్చని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.
     
    చిత్తూరులో మెడికల్ కాలేజీ
     
    చిత్తూరులో వైద్య కళాశాల ఏర్పాటుపైనా నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. దీనికి సంబంధించి చిత్తూరు ఎమ్మెల్యే డీఏ.సత్యప్రభ సీఎం వద్ద హామీ కూడా పొందినట్టు తెలిసింది. చిత్తూరు, సమీప ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం కోసం మూడేళ్లలో దీన్ని పూర్తి చేయాలని కూడా నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. చిత్తూరులో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటునూ సూచించారు. వ్యవసాయ, పాడి పరిశ్రమ అబివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలనూ పొందుపరిచినట్లు తెలిసింది.
     
    కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక నివేదిక
     
    కుప్పం అబివృద్ధి కోసం ప్రత్యేకంగా నియమితులైన నలుగురు అధికారులతో సమగ్ర నివేదికను తెప్పించుకున్న కలెక్టర్, కుప్పం కోసం ప్రత్యేక నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. హౌసింగ్, పింఛన్లు, విద్యుత్, మరుగుదొడ్లు, ఆధార్ తదితర అంశాలపై నివేదికను సిద్ధం చేశారు. కుప్పంలో హార్టికల్చర్ అభివృద్ధి, విమానాశ్రయం ఏర్పాటుపై కూడా పేర్కొన్నారు. తిరుపతిని స్మార్ట్‌సిటీగా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడం లాంటి అంశాలను కూడా నివేదికలో పొందుపరిచారు. నివేదిక ప్రకారం అభివృద్ధికి దాదాపు రూ.27 వేల కోట్లు అవసరమని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరి ఇన్ని నిధులను వెచ్చించి చంద్రబాబు తన సొంత జిల్లాను ఏ మేరకు అభివృద్ధి చేస్తారో వేచి చూడాల్సిందే.
     

Advertisement
Advertisement