మందగమనం | Sakshi
Sakshi News home page

మందగమనం

Published Fri, Dec 13 2013 3:04 AM

మందగమనం

వేములవాడ, న్యూస్‌లైన్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ఆవరణలో చేపడుతున్న ఫ్లోరింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. అనేక అవాంతరాల మధ్య నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభం కాగా.. గత నెల 8వ తేదీకే గడువు ముగిసింది. ఇప్పటివరకు యాభై శాతం పనులు పూర్తి కాగా, ఇంకా యాభై శాతం పనులు చేపట్టాల్సి ఉంది. జరిగిన పనులకు వెంటవెంటనే బిల్లు లు చెల్లించిన అధికారులు.. మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.
 
 దీంతో అధికారుల తీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేసేందుకు, కోడె మొ క్కులు చెల్లించుకునేందుకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా డ్రెస్స్‌డ్ గ్రానైట్‌తో ఫ్లోరింగ్ నిర్మించాలని గత సంవత్సరం పాలకమండలి నిర్ణయించింది. ఆలయ ఆవరణలో 12వేల చదరపు అడుగుల్లో ఫ్లోరింగ్ చేసేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి లభించిం ది. రూ.40 లక్షల వ్యయంతో 2012 నవంబర్ చివరివారంలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంలో అధికారులు జాప్యం చేశారు.
 
 తర్వాత మహాశివరాత్రి, శ్రీరామనవమి వేడుకలు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం ఆషాఢమాసం రావడంతో భక్తులరద్దీ కొంత తగ్గిపోయింది. జూలై 8న కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ కొంతభాగంలో తవ్వి వదిలేశాడు. అప్పటివరకు ఉన్న రాయిని తొలగించడం కష్టంగా ఉందని సాకులు చెప్పాడు. పాలకమండలి కలగజేసుకుని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు మొట్టికాయలు వేయడంతో పనుల్లో కాస్త కదలిక వచ్చింది. తర్వాత కార్తీకమాసంలో భక్తుల రద్దీ పెరగడంతో మళ్లీ పనులను నిలిపివేశాడు. ఈ నెల 8వ తేదీతో కాంట్రాక్టర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గడువు ముగిసిపోయింది. ఇప్పటివరకు 12వేల చదరపు అడుగుల పనులకు 7వేల చదరపు అడుగుల పనులు పూర్తయ్యాయి. వీటికి అధికారులు రూ.14 లక్షలు చెల్లించారు.
 
 జరిగిన పనికి బిల్లులు చేతికందడంతో కాంట్రాక్టర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకున్న కాంట్రాక్టర్ మరింత గడువు కావాలని అధికారులను కోరారు. ఈ మేరకు ఇంజినీరింగ్ విభాగం అధికారులు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి కోసం లేఖ రాశారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిర్ధిష్ట కాలపరిమితిలో పనులు పూర్తికావడం లేదని తెలిసినా.. కాంట్రాక్టర్‌కు వెంటవెంటనే బిల్లులు చెల్లించడం గమనార్హం.
 
 రానున్నది ‘సమ్మక్క’ సీజన్..
 ఫిబ్రవరిలో సమ్మక్క సారక్క జాతర జరగనుంది. ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రతిసారి జాతర సమయంలో లక్షలాది మంది వేములవాడకు వస్తుంటారు. సంక్రాంతి మరుసటి రోజునుంచి రద్దీ మొదలై నెలరోజులకు పైగా కొనసాగుతుంది. అంటే మరో 45 రోజుల తర్వాత రాజన్న ఆలయంలో కాలుమోపేంత అవకాశం కూడా ఉండదు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆలయ ఆవరణలో పనులు పూర్తి చేయాలన్న ధ్యాస అధికారులకు కలగడం లేదు. తీరా భక్తుల రద్దీ మొదలయ్యాక పనులు ప్రారంభిస్తే.. మళ్లీ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంట్రాక్టర్‌కు గడువు పొడిగిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి వచ్చేదెన్నడో.. పనులు పూర్తయ్యేదెన్నడో వేచిచూడాల్సిందే.
 

Advertisement
Advertisement