‘అయ్య’ బాబోయ్! | Sakshi
Sakshi News home page

‘అయ్య’ బాబోయ్!

Published Wed, Jun 25 2014 2:07 AM

‘అయ్య’ బాబోయ్! - Sakshi

జమ్మలమడుగు: ‘కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది సర్కారు అయ్యవార్ల పరిస్థితి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే చంద్రబాబు తమపై వరాల జల్లు కురిపిస్తాడని కొండంత ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. హేతుబద్దీకరణ (రేషనలైజేషన్)పేరుతో సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను కుదించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అప్పుడే రంగం సిద్ధం చేసింది. పర్యవసానంగా జిల్లాలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలగనుంది.
 
 హేతుబద్ధీకరణ పేరుతో...
 ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేస్తూ ఉంటుంది. అంటే విద్యాహక్కు చట్ట ప్రకారంవిద్యారి,్థ ఉపాధ్యాయ   నిష్పత్తిని సరిచూసి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను కుదించడం లేదా పెంచడం చేస్తారు. మన రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్ఫత్తి 1:30గా కొనసాగుతోంది.
 
 ప్రాథమిక పాఠశాలల్లో ఒకటినుంచి 10వరకు విద్యార్ధులు ఉన్న పాఠశాలల్లో ఒక విద్యావాలంటీర్‌ను, 11నుంచి20వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని, 21నుంచి 60 మధ్య విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులను, 61నుంచి90 మధ్య ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులను, 91నుంచి120 మధ్య ఉంటే నలుగురు ఉపాధ్యాయులను, 121నుంచి150 మధ్య ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులను, అంతకు మించితే 5 గురు ఉపాధ్యాయులతోపాటు అదనంగా ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తున్నారు.
 
 విద్యార్ధుల సంఖ్య పెరగడంలేదా తగ్గడం జరిగే చోట అదనపు ఉపాధ్యాయులను నియమించడం లేదా ఉన్న ఉపాధ్యాయులను వేరే చోటికి పంపించడం చేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ నిబంధనలను కాస్త మార్పుచేసి కొత్త నిబంధనలను అమలు చేసేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది.
 
 దిగజారనున్న విద్యాప్రమాణాలు...
 ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటున్నారు. ఇక కార్పొరేట్ పాఠశాలల్లో అయితే ప్రాథమిక తరగతులకు సైతం సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తున్నారు. అందుకు దీటుగా సర్కారు బళ్లలో కూడా ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాప్రమాణాలను మరింత దిగజార్చేలా ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడంపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
 
 ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గిస్తూ...
 ఓవైపు ఇప్పటి వ రకు ఉన్న 1:30 నిష్పత్తిని అమలు చేస్తున్నామని చెబుతూనే మరోవైపు ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపన్నాగమే పన్నింది. 11నుంచి 20 మధ్య ఉన్న పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్న నిబంధనను 11-30గా మార్పు చేయాలని నిర్ణయించింది. అంటే ఇప్పటివరకు 21-30 విద్యార్ధులు ఉన్న పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇకనుంచి అక్కడ ఒకే ఉపాధ్యాయుడు 5తరగతులు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా మండలానికి 20నుంచి 30మంది ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాకు వెళ్లే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ నిష్పత్తి ప్రకారం దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు తమ పాఠశాలలను విడిచి పెట్టాల్సి వస్తుంది.
 

Advertisement
Advertisement