పన్నుల వసూలుకు పది సూత్రాలు | Sakshi
Sakshi News home page

పన్నుల వసూలుకు పది సూత్రాలు

Published Sat, Feb 28 2015 12:41 AM

The ten principles of taxation

సాక్షి, రాజమండ్రి : మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో పన్నుల వసూలులో చోటు చేసుకుంటున్న అలసత్వంపై ప్రభుత్వం ఆలస్యంగా కళ్లు తెరిచింది. ‘ఆదాయం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయి. పన్నుల వసూలు సమర్థంగా లేకపోతే పరిపాలన ముందుకు సాగదు’ అంటూ పురపాలక శాఖ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. మీరు లక్ష్యాలు నిర్దేశించుకోండని హితబోధ చేస్తోంది. లక్ష్యాలు చేరక పోతే నిధుల్లో కోత పెడతామని  హెచ్చరిస్తోంది.

క్షేత్రస్థాయి సిబ్బందిని పరుగులు పెట్టించి పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత కమిషనర్లదేనంటూ కొత్తగా సర్కారు ఇప్పుడు జ్ఞాపకం చేస్తోంది. సిబ్బందిలో అలసత్వం, పారదర్శకత లోపం వంటి కారణాలను సరిచేసేందుకు పురపాలక శాఖ పది సూత్రాల ప్రణాళికలను ఆమలు చేస్తోంది. వీటిని కమిషనర్లు ఆచరించి ఈ ఏడాదైనా నూరు శాతం పన్నులు వసూలు చేయాలని సర్కారు సూచిస్తోంది.
 
ఇలా వసూలు చేయండి..
 మున్సిపాలిటీల్లో నూరు శాతం పన్నులు వసూలు చేసే డ్యూటీ కమిషనర్లదే. వారే పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
 
పన్నుల వసూలు విభాగాల్లోని కార్యాలయ, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేకంగా కమిటీలు వేయాలి. వారికి రోజువారీగా లక్ష్యాలు నిర్దేశించి, ఏ రోజుకారోజు నూరుశాతం వసూళ్లు చేసేలా ఆదేశించాలి.
 
వార్డులు, డివిజన్‌లలో మైకులతో అనౌన్సుమెంట్లు చేస్తూ, సినిమాల్లో స్లైడ్లు ప్రదర్శిస్తూ, ఎక్కడికక్కడ బ్యానర్లు కట్టి ప్రజలు పన్నులు తక్షణం చెల్లించేలా ప్రచారం చేయాలి.
 
వసూలైన పన్నులు మరుసటి రోజు సంబంధిత అకౌంట్లకు జమచేయాలి. వాటిని వెంటనే రికార్డులకు ఎక్కించాలి.
 
ప్రతి బిల్లు కలెక్టర్ పరిధిలోని టాప్ -500 బకాయిదారుల జాబితా తయారు చేసి, వాటిని చూపి ఒత్తిడి తెచ్చి బిల్లులు రాబట్టే ఏర్పాటు చేయాలి.  బకాయిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిబ్బందికి అత్యవసరమైతే కాని సెలవులు ఇవ్వకూడదు.
 
బకాయిల్లో 85 శాతం బిల్లు కలెక్టర్లు వసూలు చేయాల్సిందే. 10 శాతం బిల్లులు అంటే కరడుకట్టిన బకాయిదారుల జాబితాలతో సూపర్వైజర్, మున్సిపల్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక పర్యవేక్షక బృందంగా ఏర్పడి వసూళ్లకు వెళ్లాలి. ఐదు శాతం వసూళ్లు అంటే మరీ భారీగా పెరిగిపోయిన బకాయిల వసూలుకు మున్సిపల్ కమిషనర్లు పూనుకోవాలి.
 
జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పన్ను వసూళ్లపై రీజనల్ డెరైక్టర్ ప్రతి రోజూ సమీక్ష చేయాలి.
 మున్సిపల్ కమిషనర్లు మొండి బకాయిలపై నేరుగా జోక్యం చేసుకుని మాటలతో వసూలు కాని పక్షంలో చట్టపరమైన చర్యలకు పూనుకోవాలి.
 మేజర్ బకాయిదారుల చరాస్తులు కూడా జప్తు చేయాలి. ఈమేరకు ముందుగా నోటీసులు ఇవ్వాలి. ప్రత్యేక వాహనాలు పెట్టి జప్తు చేసిన ఆస్తిని నగరపాలక సంస్థ కార్యాలయానికి తరలించాలి.
 
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1965 ప్రకారం 85 శాతం కూడా పన్నులు వసూలు చేయలేని మున్సిపాలిటీలకు విడుదల అయ్యే నిధులకు కూడా కోత పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉందని కమిషనర్లు గమనించాలి.
 
ఈ నిబంధనలు పాటిస్తూ 2014-15 ఆర్థిక సంవత్సర వసూళ్లు నూరు శాతం చేసి తీరాలన్న ఆదేశాలతో కూడిన లేఖలను అందరు కమిషనర్లకు పురపాలక శాఖ డెరైక్టర్ వాణీమోహన్ రెండు రోజుల క్రితం జారీ చేశారు.
 
జిల్లాలో బకాయిల వసూలు ఇలా ఉంది..
జిల్లాలో మున్సిపాలిటీలకు ప్రధాన ఆధారమైన ఆస్తిపన్నుల వసూళ్లు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి.. నగరపాలక సంస్థల్లో 45 నుంచి 55 శాతం వరకూ వసూలు అయ్యాయి. మున్సిపాలిటీల్లో ఈ వసూళ్లు 45 శాతం అయ్యాయి. నీటి పన్ను కూడా చాలా మున్సిపాలిటీల్లో 60 శాతం  దాటలేదు. ఖాళీ స్థలాల పన్ను కూడా ఎక్కడా 50 శాతం దాటిన దాఖలాలు లేవు.  ఇక వ్యాపార ప్రకటనలపై వచ్చే ట్యాక్స్ ఎక్కడా 40 శాతం దాటలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మరోనెలలో ముగియనుండగా ఈ వ్యవధిలో వంద శాతం వసూళ్లు ఎలా చేస్తారు, ఈ మార్గ దర్శకాలు ఎంత వరకూ ఫలితాలనిస్తాయి అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement