మిగిలింది ఇద్దరే... | Sakshi
Sakshi News home page

మిగిలింది ఇద్దరే...

Published Wed, Mar 5 2014 1:59 AM

The    There ...

కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల్లో ఇద్దరే మిగిలారు. కేంద్రమంత్రులు జైరామ్ రమేష్, జెడీ శీలం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి జిల్లా మంత్రితో పాటు పలువురు శాసనసభ్యులు గైర్హాజరయ్యారు.

జిల్లా మంత్రి పార్థసారథి ఇప్పటికే తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధం కావడంతో ఆయన రాలేదు. తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి, పామర్రు ఎమ్మెల్యే డీవై దాసు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవి కూడా గైర్హాజరయ్యారు. మిగిలిన   నియోజకవర్గ ఇన్‌చార్జులు కూడా ఎవరూ ఆంధ్రరత్నభవన్ దరిదాపుల్లోకి రాలేదు. మంగళవారం విజయవాడ వచ్చిన జైరామ్ రమేష్‌కు రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలికేందుకు కేవలం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిటీ కాంగ్రెస్ నేతలు అడపా నాగేంద్రం, మీసాల రాజేశ్వరరావు మాత్రమే హాజరయ్యారు.

ఆ తర్వాత హోటల్‌కు వెల్లంపల్లి వచ్చి కలిశారు. సాయంత్రం ఆంధ్రరత్నభవన్‌లో జరిగిన సమావేశంలో కూడా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అంతా తానై వ్యవహరించగా, ఇద్దరు ఎమ్మెల్యేలు అంటీముట్టనట్లుగా ఉండిపోయారు. పలుమార్లు మైక్‌లో పిలిస్తేగాని వేదిక మీదకు వెళ్లలేదు. ఆ తర్వాత కూడా మాట్లాడమని చెప్పినా వారు మౌనంగానే ఉండిపోయారు.
 

 ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పమంటారు...

 ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర మంత్రులను నిలదీశారు. కేంద్ర మంత్రి జెడీ శీలం మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు చిరు ఆగ్రహంతో ఉన్నారని, దీనికి కాంగ్రెస్ నేతలే కారణమంటూ మాట్లాడుతుండగా కార్యకర్తలు అడ్డు తగిలారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తర్వాత ప్రజల వద్దకు వెళ్లి ఏం చెప్పాలంటూ వారు నిలదీశారు. దీంతో అసలు దోషి చంద్రబాబు నాయుడేనని, ముందుగానే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారంటూ తన వాదనను సమర్థించుకున్నారు.
 

డౌన్‌డౌన్ నినాదాలు
 జైరామ్ రమేష్ విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలో బీసీ విద్యార్థి సంఘం నగర ప్రధాన కార్యదర్శి కె.హరీష్  ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఆంధ్రరత్న భవన్ ముందు నిరసన తెలిపారు. జైరామ్ రమేష్ డౌన్‌డౌన్, గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హరీష్‌ను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లి అరెస్టు చేశారు.
 

 భద్రతావలయంలో ఆంధ్రరత్నభవన్
 కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ రాకతో ఆంధ్రరత్నభవన్ భద్రతావలయంలోకి వెళ్లింది. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన జైరామ్ రమేష్ ఎక్కడికెళ్లినా నిరసనలు వ్యక్తం అవుతుండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన బస చేసిన డీవీ మనార్ హోటల్ వద్ద కూడా భారీ బందోబస్తు నిర్వహించారు. ముగ్గురు ఏసీపీలతో వందలాది మంది పోలీసులను అక్కడ మోహరించారు. ఆంధ్రరత్నభవన్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పంపించారు.
 

 జైరామ్ వ్యంగ్యాస్త్రాలు
 కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాం రమేష్ ప్రసంగం ఆద్యంతం తెలుగువారిపై వ్యంగ్యాస్త్రాలతో సాగింది. సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో స్పష్టత ఇస్తారని భావించిన కాంగ్రెస్ శ్రేణులను ఆయన నిరుత్సాహపరిచారు. తెలుగు వారికి ఒక భాష రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాజధానులు ఏర్పడతాయని, మిగిలిన రాష్ట్రాలకు ఆ పరిస్థితి ఉండదన్నారు. సీమాంధ్రులకు అవకాశం ఇస్తే చార్మినార్‌లో రెండు మినార్‌లు కోరతారంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు. చివరికి అధిష్టానానికి వీర విధేయులుగా ఉన్న కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, పళ్లంరాజులపైనా తనదైన శైలిలో చమక్కులు విసిరారు. వారు ఉదయం లేచింది మొదలు హైదారాబాద్‌ను యూటీ చేయాలంటూ ‘ సుప్రభాతం, సహస్రనామ’ ప్రత్యేక మంత్రాలుగా జపించారని చెప్పారు. సీమాంధ్రకు కేంద్రం ఇచ్చే ప్యాకేజీల ఊసెత్తలేదు.

Advertisement
Advertisement