మూడో రోజూ గుడిసెల కూల్చివేత | Sakshi
Sakshi News home page

మూడో రోజూ గుడిసెల కూల్చివేత

Published Sat, Jan 25 2014 5:30 AM

The third day of the demolition of the hut

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: సాగర్ మేజర్ కాల్వ కట్టలపై గుడిసెల తొలగింపు ప్రక్రియ మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ఉదయం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశా రు. ఆర్డీఓ సంజీవరెడ్డి, డీఎస్పీ బాలకిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా వెళ్లిన అధికారు లు జేసీబీల సహాయంతో గుడిసెలు తొల గించారు. తొలుత ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు ఉదయం 11 గంటల నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు. మధురానగర్, సంభానినగర్, గొల్లగూడెంరోడ్డు తదితర పరిసరాల్లో కొన్ని గుడిసెలతో పాటు కట్టడాలను కూల్చారు. మరోపక్క కోర్టు స్టే తెచ్చుకున్న భవనాలను మాత్రం అధికారులు కూల్చకుండా వెనుదిరిగారు.
 
 ఎక్కడా లెక్కలు తప్పవద్దు..? : కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్
 కూల్చివేతల విషయంలో అధికారులు ఎక్కడా లెక్కలు తప్పవద్దని, తేడా జరిగిన తర్వాత వివాదంలో ఇరుక్కుంటే సహించేది లేదని అధికారులకు కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం విధుల్లో పాల్గొనే తహశీల్దార్‌తో పాటు సర్వే బృందంలోని సిబ్బందిని ఈ విషయంపై హెచ్చరించినట్లు తెలిసింది. ఏ చిన్న పొరపాటు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని, చిన్నా, పెద్ద తేడా లేకుండా కాల్వ భూమిలో ఉన్న వరకు ఖచ్చితంగా గుర్తులు పెట్టి తొలగించాలని సూచించినట్లు తెలిసింది. ఈ పనులపై వచ్చే ఆరోపణలు ఎప్పటికప్పుడు రహస్యంగా తెలుసుకునేందుకు కలెక్టర్‌తో పాటు ఎస్పీ ఆరా తీసినట్లు తెలిసింది.
 
 బాధితుల ఆందోళన...
 అధికారులు ఆఘమేఘాల మీద తొలగింపులు చేపట్టారని, కొలతలు సక్రమంగా లేకుండా సర్వే అధికారులు ఇష్టం వచ్చినట్లు గుర్తులు పెట్టి కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. లక్షలు దారపోసి పట్టా భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేశామని, వాటిల్లో లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్లు నిర్మించామని, కానీ కాల్వ భూములతో పాటు తమ ప్లాట్లలోని ఇళ్లను కూల్చివేసి రోడ్లపాటు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పైసా పైసా కూడ గట్టుకుని సొంత ఇంటి కల తీర్చుకుంటే ఇలా నిలువునా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కోల్పోయిన వారిలో చిరుద్యోగులతో పాటు పోలీసు, రెవెన్యూ ఉద్యోగులు సైతం ఉన్నారు. కొంత మంది నాయకులు అసలు కాల్వ స్థలాన్ని వదిలేసి మరోవైపు తప్పి తమ ఇళ్ల మీదకు తీసుకువచ్చారని అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement