పట్టణాల్లో వేడి రాజుకుంది | Sakshi
Sakshi News home page

పట్టణాల్లో వేడి రాజుకుంది

Published Mon, Jun 30 2014 1:59 AM

The urban heat ignited

మచిలీపట్నం : జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాలకు పాలకవర్గాల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ వేడి రాజుకుంది. చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీల నాయకులు తలమునకలై ఉన్నారు. చైర్మన్, వైస్‌చైర్మన్ పదవుల కోసం పైరవీల పరంపర కొనసాగుతోంది. ఎవరికి వారు తమకే పదవులు దక్కాలని కోరుతూ మంత్రులు, ఆయా పార్టీల ముఖ్య నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, పెడన, నూజివీడు, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ పురపాలక సంఘాలకు పాలకవర్గాల ఎంపిక కోసం ప్రిసైడింగ్ అధికారులు ఆదివారం నోటిఫికేషన్లు జారీ చేశారు. జూలై 2వ తేదీ ఉదయం 11గంటలకు పార్టీ విప్‌తోపాటు ఎనగ్జర్-1, 2లను ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

మూడో తేదీ ఉదయం 10గంటలకు ఎనగ్జర్-3, ఫారం-ఏ, బీ ఫారాలను అందజేయాలని సూచించారు. మూడో తేదీ ఉదయం ఆయా పురపాలక సంఘాల్లో కౌన్సిలర్లుగా ఎన్నికైన వారితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎంపిక ఉంటుంది. ఆయా పార్టీల బలాబలాల ఆధారంగా చేతులెత్తే పద్ధతిలో చైర్మన్, వైస్‌చైర్మన్లను ఎన్నుకుంటారు.
 
మున్సిపాలిటీల వారీగా బలాలు ఇవే..
మచిలీపట్నం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. పట్టణంలో 42 వార్డులకు గానూ, టీడీపీ-29వార్డులు, వైఎస్సార్‌సీపీ -12, కాంగ్రెస్-1 స్థానం గెలుచుకున్నాయి.  
 
 జగ్గయ్యపేట మున్సిపాలిటీని వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. మొత్తం 27 వార్డులకు గానూ వైఎస్సార్ సీపీ 17, టీడీపీ 10 వార్డుల్లో గెలుపొందాయి. చైర్మన్‌గా తన్నీరు నాగేశ్వరరావు, వైస్‌చైర్మన్‌గా మహ్మద్ అక్బర్ పేర్లు ఖరారయ్యాయి.
 
 ఉయ్యూరు పురపాలక సంఘం పోరు రసవత్తరంగా మారింది. మొత్తం 20వార్డులకు గానూ వైఎస్సార్ సీపీ-9, టీడీపీ-9, స్వతంత్రులు రెండు వార్డుల్లో గెలుపొందారు. ఓ స్వతంత్ర అభ్యర్థి టీడీపీని బలపరచటంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఉయ్యూరు పురపాలక సంఘాన్ని టీడీపీ దక్కించుకునే అవకాశం ఉంది.
 
 గుడివాడ మున్సిపాలిటీని వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. పట్టణంలోని 36 వార్డులకు గానూ వైఎస్సార్ సీపీ-21వార్డులు, టీడీపీ-15 వార్డులు దక్కించుకున్నాయి. చైర్మన్‌గా యలవర్తి శ్రీనివాసరావు పేరు ఖరారైంది. వైస్‌చైర్మన్ పదవి కోసం పలువురు పోటీపడుతున్నారు.
 
 తిరువూరు పురపాలక సంఘాన్ని టీడీపీ దక్కించుకుంది. మొత్తం 20 వార్డులకు గానూ  టీడీపీ-12, వైఎస్సార్ సీపీ-7,  సీపీఎం-1 వార్డులు దక్కించకున్నాయి. చైర్‌పర్సన్‌గా మరకాల కృష్ణకుమారి, వైస్‌చైర్మన్‌గా సోమవరపు నరసింహారావు పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
 
 పెడన పురపాలక సంఘంలో టీడీపీ అనూహ్యంగా స్వల్ప మెజారిటీ సాధించింది. మొత్తం 23 వార్డులకు గానూ టీడీపీ-12, వైఎస్సార్ సీపీ-11 వార్డుల్లో విజయం సాధించాయి.
 
 నూజివీడులో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. మొత్తం 30 స్థానాలకు గానూ వైఎస్సార్ సీపీ 22, టీడీపీ 7, స్వంతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. చైర్‌పర్సన్‌గా బసవా రేవతి పేరు దాదాపు ఖరారైంది.
 
 నందిగామ పురపాలక సంఘాన్ని టీడీపీ దక్కించుకుంది. మొత్తం 20 వార్డులకు గానూ టీడీపీ-12, వైఎస్సార్ సీపీ-8 వార్డుల్లో గెలుపొందాయి. చైర్‌పర్సన్ పదవి కోసం ఎ.పద్మావతి, సరికొండ రవీంద్ర పోటీ పడుతున్నారు.  
 
 బందరు టీడీపీలో ముసలం

బందరులో టీడీపీ కౌన్సిలర్ల మధ్య ముసలం పుట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ 29 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఎన్నికల సమయంలో 15వ వార్డు టీడీపీ తరఫున పోటీ చేసిన మోటమర్రి వెంకటబాబాప్రసాద్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఫలితాలు విడుదలైన అనంతరం కాపు సామాజికవర్గం నుంచి ఏడుగురు కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. దీంతో కాపులకు చైర్మన్ పదవి కేటాయించాలని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ వద్ద పలువురు కౌన్సిలర్లు ప్రతిపాదన పెట్టారు. ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వద్దకు పలువురు కౌన్సిలర్లు వెళ్లి కాపు సామాజికవర్గం వారికి చైర్మన్ పదవి కేటాయించాలని కోరడంతో ఆయన నిరాకరించినట్లు సమాచారం. దీంతో కౌన్సిలర్ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
 

Advertisement
Advertisement