అవినీతిపై ఇక యుద్ధమే | Sakshi
Sakshi News home page

అవినీతిపై ఇక యుద్ధమే

Published Sun, Jul 9 2017 2:04 AM

అవినీతిపై ఇక యుద్ధమే - Sakshi

మూడేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి విలువ రూ. 3.75 లక్షల కోట్లు
నిప్పులు చెరిగిన ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ ప్లీనరీలో ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి’ పుస్తకం ఆవిష్కరణ
- రాజధానిలో రూ.లక్ష కోట్లు.. విశాఖలో రూ.లక్ష కోట్ల కుంభకోణాలు 
ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమీషన్లు కొట్టేశారు 
బొగ్గు, ఇసుక, మద్యం, మట్టి.. ప్రతి దాంట్లోనూ కుంభకోణాలు, లంచాలే 
- చంద్రబాబు అవినీతిని అన్ని గ్రామాల్లో ప్రజలకు వివరించాలి 
బాబు పాలన ఎప్పుడు పోతుందా అని జనం ఎదురు చూస్తున్నారు 
- రాజన్న రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటున్నారు 
- ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడానికి పార్టీ సిద్ధంగా ఉంది 
వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ ప్రారంభోపన్యాసం 
 
చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని యావత్‌ ప్రజానీకం కోరుతోంది. రాజన్న పాలన తిరిగి రావాలని ఆకాంక్షిస్తోంది. ప్రజాభీష్టానికి అనుగుణంగా అందరం పోరుబాట పట్టాలి. ప్రస్తుత అవినీతి పాలనపై పార్టీ శ్రేణులు యుద్ధానికి సిద్ధం కావాలి. – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
 
వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి/సాక్షి, అమరావతి: చంద్రబాబు మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో అక్షరాలా రూ.3,75,008 కోట్ల అవినీతి జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ అవినీతి వ్యవహారాలకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ మూడో జాతీయ ప్లీనరీ గుంటూరు–విజయవాడ మధ్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట విశాలమైన ప్రాంగణంలో శనివారం ప్రారంభమైంది. ప్లీనరీలో ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి’(ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌) పుస్తకాన్ని వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. చంద్రబాబు అవి నీతిపై పూర్తి ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని ముద్రించామని, ప్రతి ఒక్కరూ దీన్ని తమ గ్రామాల్లోకి తీసుకెళ్లి అందరికీ వివరించాలని కోరారు.

(తొలిరోజు ప్లీనరీ.. సక్సెస్‌: ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

రూ.3.75 లక్షల కోట్ల అవినీతిలో రూ.లక్ష కోట్లు కేవలం రాజధానిలో జరిగిన భూముల వ్యవహారానికి సంబంధించిన కుంభకోణమని, మరో రూ.లక్ష కోట్లు విశాఖపట్నం భూముల కుంభకోణమని తెలిపారు. ఈ 2 కాకుండా మూడేళ్లలో వివిధ ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమీషన్లు తీసుకున్నారని జగన్‌ ఆరోపించారు. బొగ్గు, ఇసుక, మద్యం, మట్టి నుంచి జెన్‌కో కాంట్రా క్టర్ల వరకూ ప్రతి దాంట్లోనూ చంద్రబాబు చేసిన కుంభకోణాలు, తీసుకున్న లంచాల వివరాలను సాక్ష్యాధారాలతో ఈ పుస్తకంలో ముద్రించామన్నారు. 
 
బాబు దుర్మార్గ పాలనకు చరమగీతం పాడండి
చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని యావత్‌ ప్రజానీకం కోరుతోందని, రాజన్న పాలన తిరిగి రావాలని ఆకాంక్షిస్తోందని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా పోరుబాట పట్టాలని, ప్రస్తుత అవినీతి పాలనపై యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్లీనరీలో ఆయన ప్రారంభోపన్యాసం చేశా రు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో ఈనాటికీ చెరగని ముద్ర వేసుకున్నారని, ప్రతి కుటుంబానికీ ఓ పెద్దగా గుర్తుండిపోయారన్నారు. జగన్‌ ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే... 
 
‘‘ప్లీనరీకి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ, రాలేకపోయిన అక్కాచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, ఆత్మ బంధువులందరికీ పేరుపేరునా నమస్సుమాంజలి. మన ప్రియతమ నాయకుడు, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 68వ జయంతి సందర్భంగా మనమంతా ఈ రోజు ఒకచోట కలిశాం. ఇప్పటివరకూ మనం ఎందరో ముఖ్యమంత్రులను చూశాం. కానీ, మరణించిన తర్వాత కూడా జనం గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరూ అంటే... వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే. చనిపోయి 8ఏళ్లు అవుతున్నా ఈ రోజుకీ మన పెద్దాయనగా, మన కుటుంబంలో అన్నగా జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తి ఎవరంటే... వైఎస్సార్‌.. వైఎస్సార్‌.. వైఎస్సార్‌. ఆయన 5సంవత్సరాల 3 నెలలు మాత్రమే రాష్ట్రాన్ని పాలించారు.

(వైఎస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్లీనరీ: ఫొటోల కోసం క్లిక్‌ చేయండి)

వైఎస్సార్‌ కంటే ముందు రాష్ట్రంలోనూ... దేశంలోనూ పాలించిన ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం. వాళ్లలో ఏ ఒక్కరూ చేయని విధంగా, కనీసం ఆలోచించడానికి కూడా సాహసించని విధంగా పాలించిన సీఎం వైఎస్సార్‌. మరణించిన తర్వాత ప్రతి ఇంట్లోనూ బతికి ఉన్న నాయకుడు వైఎస్సార్‌. అవ్వాతాతల దగ్గర్నుంచి అక్కాచెల్లెమ్మల వరకూ... అక్కాచెల్లెమ్మల నుంచి రైతన్నల వరకూ... రైతన్నల నుంచి పిల్లల దాకా... ఎవరు మాట్లాడినా వినిపిస్తున్నది ఒకే మాట. ఆ రాజన్న రాజ్యం తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇవాళ చంద్రబాబు పాలన చూస్తున్నాం. ఈ మూడేళ్ల చంద్రబాబు పాలనకు, వైఎస్సార్‌ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గ్రహిస్తున్నారు. చంద్రబాబు పాలన ఎప్పుడెప్పుడు పోతుందా అని రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతటి దుర్మార్గమైన, అన్యాయమైన పాలనను గతంలో ఎప్పుడూ చూడలేదని రాష్ట్ర ప్రజానీకమంతా అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ జరుపుకుంటోంది.

రాబోయే రోజుల్లో దశ దిశ నిర్దేశించుకునేందుకు, మనం ఇప్పటిదాకా చేసిన పోరా టాలను జ్ఞాపకం చేసుకుంటూ.. రాబోయే రోజుల్లో ఎలా పోరాటం చేయాలి? ఏం చేయాలి? మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతాం? అనే అంశాలను ఈ ప్లీనరీలో చర్చించుకుందాం. అవసరమైన తీర్మానాలు చేసుకుందాం. ప్రజాభీష్టాన్ని తెలు సుకునేందుకు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉంది. పార్టీ సీనియర్‌ నేతలు మీకు అందుబాటులోనే ఉంటారు’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. 

(మహానేత వైఎస్ఆర్ ఫొటో ఎగ్జిబిషన్: క్లిక్‌ చేయండి)

Advertisement
Advertisement