అడుగంటుతున్న ‘సాగర్’ | Sakshi
Sakshi News home page

అడుగంటుతున్న ‘సాగర్’

Published Sun, Jul 6 2014 11:37 PM

అడుగంటుతున్న ‘సాగర్’

 విజయపురి సౌత్
 నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి దగ్గర పడుతుండటం ఆయకట్టు రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా వర్షాలు సరిగా పడకపోవటంతో ఇప్పటికే ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సాగర్‌లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో ఖరీఫ్ పంటలకు నీరందే అవకాశం కనిపించటం లేదు. గతేడాది సాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో గేట్లను ఎత్తేశారు. దీంతో రెండు పంటలూ పండి రైతులు గట్టెక్కారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
 
 ఎగువ జలాశయూలదీ అదే పరిస్థితి..
 కృష్ణా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని జలాశయాలకు ఇన్‌ఫ్లో ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి 125 టీఎంసీల నీరు చేరితేనే కర్ణాటక ప్రభుత్వం దిగువకు నీటిని విడుదల చేస్తుంది. మహారాష్ట్రలోని తుంగభద్ర జలాశయం పరిస్థితి అలానే ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, భీమా ప్రాజెక్టుల్లోకి సుమారు 225 టీఎంసీల నీరు వస్తే శ్రీశైలం జలాశయానికి నీటిప్రవాహం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం కూడా డెడ్‌స్టోరేజీకి చేరువలో ఉంది. ప్రస్తుత నీటిమట్టం 834.20 అడుగులు కాగా కేవలం 54.1501 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జలాశయ పూర్తి సామర్ధ్యం 215.8 టీఎంసీలు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ప్రత్యేక అవసరాలకు మినహాయిస్తే నీటిమట్టం 834 అడుగుల కంటే దిగువకు వెళ్లడానికి లేదు.
 
 సాగర్ పరిస్థితి ఇదీ..
 నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ 510 అడుగులు. అంటే 131.6690 టీఎంసీలు. కాగా ఆదివారానికి నీటిమట్టం 514 అడుగుల వద్ద ఉంది. ఇది 138.5610 టీఎంసీలకు సమానం. జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 469, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 6,004 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం ఔట్‌ఫ్లో 6,473 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి చుక్కనీరు కూడా రావటంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగర్ నుంచి 8 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. కృష్ణా డెల్టా తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఈ నెల 3వ తేదీ వరకు కృష్ణా డెల్టాకు నాలుగున్నర టీఎంసీల నీటిని విడుదల చేశారు. మరో రెండున్నర టీఎంసీలు విడుదల చేయాల్సి ఉంది. ఇక జంట నగరాల తాగునీటి అవసరాలకు జూలై, ఆగ స్ట్ నెలల్లోరెండు టీఎంసీలు అవసరమవుతాయి. అలాగే కుడి, ఎడమ కాలువల ఆయకట్టు ప్రాంతాలకు నీరు విడుదల చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడకపోతే గడ్డు పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది.
 

Advertisement
Advertisement