రాజధానిగా కర్నూలు లేనట్లే! | Sakshi
Sakshi News home page

రాజధానిగా కర్నూలు లేనట్లే!

Published Fri, Aug 15 2014 2:10 AM

there is no the capital of kurnool

సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీమ ముఖద్వారం కర్నూలు రాజధాని అయ్యే కల నెరవేరేలా కనిపించడం లేదు. ఆ మాటెత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తపడినట్లు తెలిసింది. గురువారం కర్నూలుకు వచ్చిన సీఎంను రాజధాని సాధన కమిటీ నాయకులు కలిశారు. ‘ప్రతి జిల్లా వారు రాజధాని కావాలంటున్నారు. అన్ని జిల్లాలకు ఇవ్వలేం కదా?’ అని వారికి ఆయన చెప్పి పంపినట్లు తెలిసింది. సీఎం మాటలను బట్టి చూస్తే కర్నూలు రాజధాని లేనట్లే అని తేలిపోయింది. అదే విధంగా తనను కలిసిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకూ ఇదే విషయాన్ని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు తెలిసింది.

 రాజధాని ఊసెత్తవద్దని.. ఏదైనా కావాలంటే నియోజకవర్గంలోని సమస్యలపై మాట్లాడమని చెప్పినట్లు సమాచారం. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎంతో  ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గురువారం సమావేశమయ్యారు. కర్నూలును రాజధానిని చేయాలని జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును అడుగుతుంటే తమ్ముళ్లంతా తలదించుకునే ఉండిపోయినట్లు సమాచారం. ప్రభుత్వ అతిథగృహంలో టీడీపీ నేతలు, రాజధాని సాధన కమిటీకి ఎదురైన సంఘటనను చూస్తే కర్నూలు రాజధాని గురించి మర్చిపోవచ్చని తమ్ముళ్లు చెప్పుకుంటూ వెళ్లటం కనిపించింది.

ఇదిలా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించాలని సీఎంను కోరారు. అలాగే ఎంపీ బుట్టారేణుక, పాణ్యం ఎమ్మెల్యేల గౌరు చరిత, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కూడా నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిసి విన్నవించారు. కర్నూలుకు రాజధాని అడిగేహక్కు ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. రాజధానిని పోగొట్టుకుని, ఇప్పుడు అవకాశం ఉండి ఇవ్వకపోతే అన్యాయం చేసిన వారవుతారని కోరినట్లు తెలిసింది.

అదే విధంగా గుండ్రేవుల రిజర్వాయర్, కర్నూలులో ఉర్దూ పాఠశాల అవసరమని ఎస్వీ మోహ న్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా కర్నూలు జిల్లాలో ఐటీ, పారిశ్రామిక కారిడార్, అగ్రికల్చర్ యూనివర్సిటీకు అనుకూలంగా ఉందని, ఆమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు కూడా స్థానిక సమస్యలపై చర్చకే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.

 కోరికల చిట్టాలకు ఓకే చెప్పిన సీఎం..
 కర్నూలు రాజధానిని చేయాలనే మాటెత్తకుండా అధినేత చంద్రబాబు తమ్ముళ్లను అదుపుచేసినట్లు తెలిసింది. దీంతో చేసేది లేక తమ్ముళ్లు నియోజకవర్గంలోని కోరికల చిట్టాను అధినేత చంద్రబాబు ముందుంచారు. ఆ చిట్టాలన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు టీడీపీ నేతలు వెళ్లడించారు. ఆ వివరాలను స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రకటించనున్నట్లు వారు వివరించారు. మరి కొన్నింటికి మాత్రం ‘చూద్దాం.. చేద్దాం’ అన్న సమాధానమే ఎదురైనట్లు టీడీపీ శ్రేణులు వెళ్లడించాయి.

 నామినేటెడ్ పదవుల కోసం తమ్ముళ్ల క్యూ..
 శ్రీశైలం, మహానంది, యాగంటి తదితర ఆలయాలతోపాటు జిల్లాలోని 12 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం తమ్ముళ్లంతా అధినేత వద్ద క్యూ కట్టారు. నియోజకవర్గఇన్‌చార్జ్‌లు తమ వారికి ఆ పదివి.. ఈ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే నామినేటెడ్ పదవుల విషయమై తమ్ముళ్లకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement