వెలుగుల పండుగ వెలవెల | Sakshi
Sakshi News home page

వెలుగుల పండుగ వెలవెల

Published Mon, Nov 4 2013 12:34 AM

There no festival due to diseases

సాక్షి, గుంటూరు : దీపావళి వెలుగుల పండగ. కొత్త బట్టలు, పండగ ఘుమఘుమలు, బాణసంచా హోరు.. ఇలా ప్రజలంతా కేరింతల మధ్య జరుపుకునే పర్వదినం. కానీ, అన్ని వర్గాల ప్రజల్నీ కష్టాలు చుట్టుముట్టిన వేళ దీపావళి సంబరాల జాడ పెద్దగా కనిపించలేదు.ప్రకృతి ప్రకోపంతో వదర నీరు పొలాలపై విరుచుకుపడటంతో పంటలు నేలకరిచాయి. వేలాది రూపాలయ పెట్టుబడులు నీటి పాలయ్యాయి. పల్లెల్లో పిల్లాపాపలు జ్వరాలతో మంచం పట్టారు. పాడి పశువులు అంటు రోగాలతో వట్టిపోయాయి. ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన వేళ రైతుకు ఇంకెక్కడి దీపావళి? పేదరైతులకు వానలు అప్పులే మిగిల్చాయి. వదరలు అన్నదాత నోట మట్టికొట్టాయి. నిన్న మొన్నటి వరకు సమ్మెలో ఉన్న ఉద్యోగులు జీతాలందక పండుగరోజు కూడా చేతిలో చిల్లి గవ్వలేక అవస్థలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారాలు లేక దుకాణదారులు తీవ్రంగా నష్టపోయారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతుండగా దీపావళి వచ్చింది. ఎలాగో తంటాలు పడి పిల్లల సంతోషం కోసం ఉన్నంతలో ఈ ఏడాదికిలా అయిందనిపించారు.
 
 వెంటాడుతున్న జ్వరాలు, పెరిగిన ధరలు
 గ్రామాల్లో ఇంటింటా జ్వరాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఏడాది చికున్‌గన్యా, మలేరియా, వైరల్ జ్వరాలు లేని ఊరు లేదంటే అతిశయోక్తికాదు. పిల్లాపాపలు ఆరోగ్యంతో ఉంటేనే ఏ పండగైనా అంటున్న పల్లెజనం ఈ ఏడాది దీపావళికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీనికితోడు నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగిన కారణంగా అధిక శాతం మంది బాణసంచా వెలుగులపై శ్రద్ధ చూపలేదు. బాణాసంచా ధరలు కూడా విపరీతంగా ఆకాశాన్నంటడంతో శని, ఆదివారాలోలనూ బజార్లలో పెద్దగా వ్యాపార సందడి కనిపించ లేదు.
 
 40 శాతమే కొనుగోళ్లు...
 ఏటా దీపావళి పండగకు వారం పదిరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. దుస్తులు, బంగారం, పండగ సరుకులు...చివరకు బాణాసంచా కొనుగోళ్లు ఊపందుకుంటాయి. పండగ రోజు సాయంత్రానికి బాణాసంచా నిల్వలు దాదాపుగా అమ్ముడై పోతాయి. ఎటువిన్నా చెవులు చిల్లులు పడేలా శబ్ధాలే వినిపిస్తాయి. ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి నెలకొంది. పండగకు రెండు రోజుల ముందు వరకూ వానలు పడుతూనే ఉన్నాయి. అక్టోబరు 22 నుంచి వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు పంటల్ని ముంచేయడంతో అన్నదాతలు రాత్రింబవళ్లూ వాటిని రక్షించుకునే పనిలోనే ఉన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరం. జిల్లాలోని సుమారు 3 లక్షల మంది రైతులు వానల బారిన పడి నష్టపోయినట్లు సమాచారం. సాగుకోసం అవసరమైన పెట్టుబడులకు తెచ్చిన అప్పుల్ని తీర్చేమార్గమేంటని..? అన్నదాత తలపట్టుకుని కూర్చొన్నాడు. ఏటా దీపావళి సీజన్‌లో జిల్లా అంతటా రూ.6 కోట్ల మేర జరిగే బంగారం కొనుగోళ్లు ఈ సారి రూ.2 కోట్ల మేర లేకపోవడం జ్యూయలరీ వ్యాపారుల్ని కుంగదీస్తోంది.
 
 ప్యాకేజ్డ్ పిండివంటలే దిక్కు..
  నిత్యావసరాల ధరలు నింగినంటిన కారణంగా సామాన్య జనం ఈ ఏడాది పండగ పిండివంటలపై శ్రద్ధ చూపలేదు. బియ్యం, ఉప్పు, పప్పు, ఉల్లిపాయలు, నూనెల ధరలకు బడ్జెట్ సరిపోక, మార్కెట్‌లో పెట్టిన అరకేజీ, కేజీ అరిసెలు, బూరెలు, గారెలు తదితర ప్యాకెజ్డ్ పదార్థాలను తీసుకె ళ్తున్నారు. ఈ ఏడాది దుస్తులు, బంగారం కొనుగోళ్లు కూడా భారీస్థాయిలో తగ్గాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో పరిస్థితులను తెలుసుకున్న పట్టణాల యువత పండక్కి బంధువుల ఇళ్లకెళ్లే విషయాన్ని పక్కనబెట్టారు. మొత్తానికి జిల్లాలో ఈ ఏడాది వెలుగులు లేని దీపావళిని చూశామని చెప్పాలి.

Advertisement
Advertisement