శాస్త్రవేత్తలు ఖాళీ | Sakshi
Sakshi News home page

శాస్త్రవేత్తలు ఖాళీ

Published Mon, Sep 16 2013 4:46 AM

There was a shortage of agricultural research by scientists

జగిత్యాల జోన్, న్యూస్‌లైన్:  జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తల కొరత ఏర్పడింది. ఇక్కడ 36 మంది శాస్త్రవేత్తలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పది మందే పనిచేస్తున్నారు.
 
 మిగతా పోస్టులు నెలల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఉన్నవారికే అదనపు బాధ్యతలు నెత్తికెత్తుతున్నారు. వీరికి బోధన, పరిశోధన విధులు అప్పగించడంతో ఏ పనీ సక్రమంగా చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా నూతన ఆవిష్కరణలతో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన పరిశోధన స్థానం పనితీరు అధ్వానంగా మారింది. ఒకప్పుడు ఉత్తర తెలంగాణలోని పన్నెండు వ్యవసాయ పరిశోధన స్థానాలకు పొలాస పరిశోధన స్థానంగా కేంద్ర స్థానంగా ఉండేది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటల సరళి, సాగునీటి యాజమాన్యం, చీడపీడల సమస్యలపై పరిశోధనలు చేసేందుకు ఆచార్య ఎన్‌జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దాదాపు 154 ఎకరాల్లో పరిశోధన స్థానం ఏర్పాటయింది. 1983 నుంచి వివిధ పంటలపై పరిశోధనలు చేయడం ప్రారంభించింది. వరి, వేరుశనగ, నువ్వులు, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంటల్లో పరిశోధనలు చేసి, ఎన్నో నూతన రకాలను రూపొందించి ఖ్యాతి గడించింది. ప్రస్తుతం పొలాస పరిశోధన స్థానం సేవలను కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకే పరిమితం చేశారు. ఈ మూడు జిల్లాల పరిధిలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానాలు, డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలకు మార్గదర్శకంగా పనిచేస్తోంది.
 
 పొలాస పరిశోధన స్థానంలో తొమ్మిది విభాగాలకు కలిపి దాదాపు 36 మంది శాస్త్రవేత్తలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పట్టుమని పదిమంది కూడా లేరంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. రెండు, మూడు విభాగాలకైతే కొన్నేళ్ల నుంచి శాస్త్రవేత్తలే లేకపోవడంతో పరిశోధనలు పడకేశాయి. ఇక్కడికి బదిలీపై వచ్చినవారు రాజకీయ నాయకులు, యూనివర్సిటీ ఉన్నతాధికారుల పైరవీలతో వెంటనే వెనక్కు వెళ్లిపోతున్నారు. ఇటీవల ఓ శాస్త్రవేత్తను హైదరాబాద్ నుంచి పొలాసకు బదిలీ చేయగా.. ఇక్కడ జాయిన్ కాకుండానే పైరవీలు చేసి రాజధానిలోనే తిష్టివేశారు.
 
 మరో శాస్త్రవేత్తకు ఐదారుసార్లు బదిలీ ఆర్డర్లు వచ్చాయంటే యూనివర్సిటీలో లాబీయింగ్ ఎలా జరుగుతోందో ఊహించవచ్చు. మరికొందరు శాస్త్రవేత్తలు పీహెచ్‌డీ, పిల్లల చదువు పేర వచ్చిన పది నెలల లోపే రాజధానికి బదిలీ చేయించుకుంటున్నారు. ఇటీవల వారం రోజుల క్రితం మరో నలుగురు శాస్త్రవేత్తలు పీహెచ్‌డీ, మెటర్నిటీ, బదిలీ పేరిట ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీనికితోడు పొలాసలో పనిచేసే శాస్త్రవేత్తలకు హెచ్‌ఆర్‌ఏ 10 శాతం ఇస్తుండగా, హైదరాబాద్‌లో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నారు.
 
 పొలాసలో పనిచేస్తామన్న శాస్త్రవేత్తలకు ఒక్కొక్కరికి నాలుగైదు విభాగాలను అప్పగించడంతో పనిభారం పెరిగి వీరు సైతం రాజధానికి వెళ్దామని కోరుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది చాలదన్నట్టు పరిశోధన స్థానానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రొఫెసర్ల కొరత ఉండడంతో, వ్యవసాయ శాస్త్రవేత్తలనే అక్కడ పాఠాలు చెప్పేందుకు వినియోగిస్తున్నారు. దీంతో శాస్త్రవేత్తలకు మరింత పనిభారం పెరిగింది. ఈ విషయమై పరిశోధన స్థానం డెరైక్టర్ ఎల్.కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. శాస్త్రవేత్తల కొరతపై యూనివర్సిటీ ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. శాస్త్రవేత్తల కొరత కారణంగా ఉన్న వారికే అదనపు బాధ్యతలను అప్పగించకతప్పలేదన్నారు.
 

Advertisement
Advertisement