ఈ దీపం.. అపురూపం! | Sakshi
Sakshi News home page

ఈ దీపం.. అపురూపం!

Published Mon, Jan 27 2014 1:52 AM

ఈ దీపం.. అపురూపం!

  •     పల్లె బడిలో ట్యాబ్ పాఠాలు
  •      చిన్నారుల కళ్లెదుట సరికొత్త సిత్రాలు
  •      ఓ యువ టీచర్ వినూత్న ప్రయోగం
  •      విభిన్న బోధనకు తరగని ఉత్సాహం
  •      మారుమూల గ్రామంలో మల్టీమీడియా పరిజ్ఞానం    
  •       విద్యార్థులకు విజ్ఞానదాయకం
  •  
    మాడుగుల, న్యూస్‌లైన్: ఉదయం పది గంటలు.. తెలకలపాలెంలోని ఆ చిన్న బడి విద్యార్థుల కోలాహలంతో సందడిగా ఉంది. ముప్ఫై మంది కూడా లేని ఆ ప్రాథమిక పాఠశాల చదువుల విరితోటలా కళకళలాడుతోంది. చిత్రంగా.. కేవలం నల్లబల్లపై అక్షరాలు కనిపించాల్సిన రెండో తరగతి గదిలో.. ఓ యువ ఉపాధ్యాయురాలు విభిన్న రీతిలో పాఠాలు బోధిస్తోంది. పల్లెటూరికి అపురూపమైన ట్యాబ్లెట్ (కొత్తతరం కంప్యూటర్)ను వాడుతూ ఆమె చిన్నారులకు చకచకా చదువు చెబుతోంది. తెలుగు పదాలే కాదు.. ఇంగ్లీషు రైమ్స్, చిన్న లెక్కలను ట్యాబ్లెట్‌లో బొమ్మలు చూపిస్తూ ఆమె ఆసక్తికరంగా వివరిస్తూ ఉంటే పిల్లల వదనాల్లో ఆనందోత్సాహాల వెలుగు వెల్లి విరుస్తోంది. పంథొమ్మిదేళ్ల కాకర అపర్ణ గాయత్రి తదేక దీక్షతో సాగిస్తున్న విద్యాబోధన ఆ పల్లెటూరిలో విజ్ఞానపు వెలుగులు ప్రసరించడానికి కారణమవుతోంది.
     
    విద్యాగాయత్రి


    మండలంలో కేజేపురం పంచాయితీ శివారు గ్రామం తెలకలదీపం 250 మంది మాత్రమే నివసించే పల్లెటూరు. అక్కడి ప్రాథమిక పాఠశాల కూడా చిన్నదే. కేవలం రెండు గదులు (చిన్న భవనాలు) ఉండే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువే. అయితే ఇటీవలే డీఎడ్ పూర్తి చేసి అక్కడ సెకెండరీ గ్రేడ్ ఉపాధ్యాయినిగా చేరిన గాయత్రి ఉత్సాహానికి ఇవేవీ పరిమితులు విధించలేకపోయాయి. ఏడాది కిందటే ఈ స్కూలులో తొలి నియామకం పొందిన గాయత్రికి అప్పటికే  కంప్యూటర్ విద్యలో ప్రావీణ్యం ఉంది. వినూత్న రీతిలో విద్యాబోధన కోసం ఆమె ట్యాబ్లెట్‌ను ఎంచుకుంది. దానిలో చిత్రాలు, చిన్న గ్రాాఫిక్స్, ఆహ్లాదకరమైన రైమ్స్ లోడ్ చేయించి విద్యాబోధన సాగిస్తే చిన్నారులకు బాగా అర్ధమవుతుందనిపించింది. ఆ దిశగా ఆమె కార్యాచరణ ప్రారంభించింది. ట్యాబ్లెట్ కొని చదువు చెప్పడం ప్రారంభించింది. ఇప్పుడు చిన్నారుల్లో ఆసక్తి ఇనుమడించిందని, ఈ రీతిలో వారు పాఠ్యాంశాలను వేగం అర్ధం చేసుకుంటున్నారని, సులువుగా గుర్తుంచుకుంటున్నారని ఆమె ఉత్సాహంగా చెప్పింది.
     
    వృత్తిపై ఆసక్తి
     
    ఆర్థికంగా ఒడిదుడుకులు లేని కుటుంబంలో పుట్టిన గాయత్రి కేవలం ఉపాధ్యాయ వృత్తిపై గల ఆరాధనతోనే డైట్ శిక్షణను ఎంచుకోవడం విశేషం. ఆమె  తండ్రి ఈవో పీఆర్డీగా పాడేరులో పని చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తెను కార్పొరేట్ విద్యాలయంలో చదివించే స్తోమత ఉన్నా, పట్టుదలతో ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. పాఠశాలలో, కళాశాలలో మంచి మార్కులు పొంది, తొలి ప్రయత్నంలోనే డీఎస్సీలో అర్హత సాధించిన గాయత్రి తెలకలదీపంలో నియమితురాలైంది.
     
    ప్రత్యేక కృషి
     
    ట్యాబ్లెట్ ద్వారా విద్యాబోధన సాగించడంలో గాయత్రి కృషి చాలా ఉంది. ‘మల్టీమీడియాను ఉపయోగించి పాఠాలకు సంబంధించిన చిత్రాలను, గేయాలను తీర్చిదిద్దుతాను. వీటిని ట్యాబ్లెట్‌లోకి ఎక్కించి బోధిస్తాను. ఒక్కో యూనిట్ పాఠం తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది.’ అని ఆమె చెప్పింది. ఈ ఏడాదిలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు, గణితం పాఠ్యాంశాలకు సంబంధించి బోధన కృత్యాలను తయారు చేసినట్టు తెలిపింది. వీటిని సీడీలుగా తయారు చేసి, ఇతర పాఠశాలల్లో సైతం ఇదే రీతిన బోధించడానికి వీలు కల్పిస్తున్నట్టు తెలియజేసింది.
     
     సర్కారీ బడిపై శ్రద్ధ కోసం..

     ‘నేను చదివింది ప్రభుత్వ పాఠశాలలో.. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలన్న భావం అందరిలో కలిగేలా, ఈ పాఠాలను నేను రూపొం దించాను. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరహా విద్యాబోధన జరిగేలా సీడీలు రూపొందిస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తి ద్వారా సమాజానికి ఎందరో ప్రతిభావంతులను దేశానికి అందివ్వవచ్చన్న ఆలోచనతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. ప్రజలకు సేవ కోసం ఆయుర్వేదంలో డిప్లొమో చేస్తున్నాను. ఉన్నత విద్యాభ్యాసంపైనా దృష్టి పెట్టాను.                     
    -అపర్ణ గాయత్రి
     
     అందరికీ స్ఫూర్తి కోసమే..
     ప్రభుత్వ పాఠశాలలపై అందరికీ ఆసక్తి కలగాలన్న ధ్యేయంతో నా ఏకైక కుమార్తెను సర్కారీ బడిలో చదివించాను. ఒక్క కుమార్తెతో కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్స చేయించుకుని పదిమందికీ ఆదర్శంగా నిలిచాను. కార్పొరేట్ స్థాయి విద్యాబోధన పేద విద్యార్థులకు లభించాలన్న ఆశయంతో ఆమె ట్యాబ్లెట్ కొని చదువు చెబుతోంది.
     -కాకర వెంకన్నబాబు, ఈఓపీఆర్‌డీ పాడేరు
     
     ఆసక్తిగా ఉంది..
     పుస్తకాల్లోని ఇంగ్లీష్ రైమ్స్, తెలుగు పద్యాలు, పాఠాలు, లెక్కలు టీవీలో చూసినట్టుగా నేర్చుకుంటున్నాం. పాఠాలు కథల రూపంలో గుర్తుండిపోతున్నాయి. ఈ విధంగా చదువు ఆసక్తిగా ఉంది.                            
     -సూరిశెట్టి లక్ష్మి, విద్యార్థిని  

Advertisement
Advertisement