ఆ రైతులు ఇంకా....నీరు పేదలే.. | Sakshi
Sakshi News home page

ఆ రైతులు ఇంకా....నీరు పేదలే..

Published Tue, Mar 19 2019 8:59 AM

Those Formers Are Still Poor - Sakshi

‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ గ్రామాల్లో పంటపొలాలకు  మడ్డువలస కాలువ ద్వారా సాగునీరు అందిస్తా. మాకు ఓటు వేసి గెలిపించండి. ఒక్క అవకాశం ఇవ్వండి. నేను అధికారంలోకి రాగానే మొదటి పనిగా మీకు సాగునీరు అందిస్తా. నీరు వస్తే మీ పల్లెలు సస్యశ్యామలంగా మారిపోతాయి. అప్పుడు ఎవ్వరూ వలసలు వెళ్లవలసిన అవసరం లేకుండా చేస్తా.’ మీరు నన్ను నమ్మండి అంటూ 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన కిమిడి కళావెంకటరావు ఆ గ్రామాల ప్రజలకు హమీలు గుప్పించారు. ఆయన ఆ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి చేపట్టి నేటికి ఐదేళ్లు పూర్తయినా ఇంతవరకు ఆ గ్రామాలకు చుక్క సాగునీరు అందలేదు.   దీంతో ఆ గ్రామాల రైతులు తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు.  మడ్డువలస ప్రాజెక్ట్‌ ద్వారా నీటిని విడిచిపెట్టి 13 ఏళ్లు కావస్తోంది. ప్రాజెక్ట్‌ పరిధిలో ఆయకట్టు కాలువల విస్తరణ జరిగి కూడా 13 ఏళ్లే కావస్తోంది. ఇంతవరకూ ప్రాజెక్ట్‌ను ఆధునికీకరించకపోవడం ఓ సమస్య కాగా, కాలువల విస్తరణ జరగకపోవడం మరో సమస్య.  

సాక్షి, శ్రీకాకుళం: మండలంలోని పలు గ్రామాలకు మడ్డువలస ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందని పరిస్థి«తి ఉన్నా అధికారులు పట్టించు కోవడంలేదు. దేవరవలస, మంగమ్మపేట, వాండ్రంకి, బోట్లపేట  తదితర గ్రామాల్లో కాలువ 56 అడుగులకు పైగా లోతులో ఉంది. ఇంజినీరింగ్‌ ప్లాన్‌లు ఈ ప్రాంతంలో ఆయకట్టుకు సాగునీరు అందించని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు నీరు రాక  ఈ ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో ఆయకట్టు భూములకు ఆరుతడి అధారంగా సాగు మారింది. ఆయకట్టు పరిధిలో రైతులకు మాత్రం నీటి తీరువా చెల్లించడం  తప్పడం లేదు. దీంతో మడ్డువలస విస్తరణతో పాటు  సాగునీరు రావాలంటే ఆధునికీకరణ నిమిత్తం రైతులకు ఎదురుచూపులే మిగిలాయి.


ఆందోళనలో రైతులు
మడ్డువలస ప్రధాన కుడికాలువ ద్వారా వాండ్రంగి పంట పొలాలకు సాగునీరు రావాలంటే 2009వ సంవత్సరంలో  చేపట్టిన మొదటి అలైన్‌మెంట్‌ ద్వారా పనులు చేస్తేనే పంట పొలాలకు సాగునీరు అందుతుందని, లేకపొతే భూములన్నీ బీడుగా మారుతాయని మాజీ  సర్పంచ్‌ బూరాడ వెంకటరమణ తెలిపారు.  ఈ విషయంపై గతంలో  రాష్ట్ర మంత్రి  కళా వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. 2009వ సంవత్సరంలో చేపట్టిన భూసేకరణ ప్రకారమే పనులు చేయాలని కోరారు.  వాండ్రంగి గ్రామానికి మడ్డువలస ప్రధాన కుడి కాలువ ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని ఎన్నికల ముందుకూడా ప్రజలకు హామీ ఇచ్చాన్నారని మంత్రికి  గుర్తు చేశామన్నారు.అయినా నేటి వరకు మడ్డువలస సాగునీరు కోసం  ఎలాంటి పనులు చేయలేదని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వెలిబుచ్చారు. గ్రామంలో సుమారు 9 వందల ఎకరాలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తోందని రైతులు వాపోతున్నారు.    

ఆయకట్టుకూ అందని నీరు
మడ్డువలస ప్రధాన కుడికాలువ ద్వారా మండలంలో ప్రస్తుతం 5,200 ఎకరాలకు సాగునీటి కాలువ ఉంది. పలుచోట్ల పిల్ల కాలువలు లేకపోవడంతో ఈ ప్రధాన కాలువ నీరు కూడా ఆయకట్టుకు అందడంలేదు. రెండోవిడతలో మండలంలో 6,500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కాలువను విస్తరించాల్సి ఉంది. మండలంలోని నాగులవలస గ్రామం వద్ద ప్రారంభమైన ఈ కాలువ 16 గ్రామాల మీదుగా నల్లిపేట చెరువు వరకూ ఉంది. ఈ కాలువ నుంచి ఖరీఫ్‌ ప్రారంభంలో సాగునీరు అందడం గగనం కాగా, వరి పంట కోత దశలో ఉన్న సమయంలో చివరి తడికి కూడా ఆయకట్టు రైతులకు కష్టాలే. నల్లిపేట నుంచి కప్పరాం, దేవరవలస, మంగమ్మపేట మీదుగా లావేరు మండలానికి కాలువను విస్తరించాల్సి ఉండగా మధ్యలోనే నిలిపివేశారు.  

            

Advertisement

తప్పక చదవండి

Advertisement