ఆ పిటిషన్లను ప్రస్తుతం విచారణకు స్వీకరించలేం | Sakshi
Sakshi News home page

ఆ పిటిషన్లను ప్రస్తుతం విచారణకు స్వీకరించలేం

Published Fri, Jan 24 2020 5:40 AM

Those Petitions Cannot Currently Be Accepted For Trial Says AP High Court - Sakshi

సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై దాఖలైన పిటిషన్లను ప్రస్తుత దశలో విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ బిల్లులపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.బిల్లుల్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలన్న వ్యాజ్యాలపై ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మండలిలో బుధవారం జరిగిన పరిణామాల గురించి ఆరాతీసింది. అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సమాధానమిస్తూ.. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ, సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం వెలువరించేంత వరకు వేచిచూడాలని పిటిషనర్లకు స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ స్పందిస్తూ.. బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చలేదని.. వాటిని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలు అపరిపక్వమైనవని వివరించారు. బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి పంపిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ గురించి బిజినెస్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయని ధర్మాసనం ప్రశి్నంచింది. సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం తీసుకునేందుకు మూడు నెలల గడువు ఉందని రోహత్గీ వివరించగా.. అందుకే అప్పటి వరకు ఆగాలని పిటిషనర్లకు సూచించింది.  

అవి సాధారణ బిల్లులే.. ద్రవ్య బిల్లులు కాదు
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది అశోక్‌భాన్‌ వాదనలు వినిపిస్తూ.. ఆ రెండు బిల్లులకు గవర్నర్‌ అనుమతి అవసరమని, అయితే గవర్నర్‌ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దీనికి రోహత్గీ అడ్డుతగులుతూ, ఆ బిల్లులు ద్రవ్యబిల్లులు కాదని స్పష్టంగా చెప్పామని, అలాంటప్పుడు ద్రవ్యబిల్లుకు వర్తించే రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావించడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. అశోక్‌భాన్‌ జోక్యం చేసుకుంటూ, బుధవారం అడ్వొకేట్‌ జనరల్‌ ఈ రెండింటిని అధికరణ 207 కింద సాధారణ బిల్లులుగా చెప్పారన్నారు. భాన్‌ వాదనను ధర్మాసనం ఖండిస్తూ.. సాధారణ బిల్లులని మాత్రమే ఏజీ చెప్పారని, అధికరణ 207 కింద బిల్లులని చెప్పలేదని స్పష్టం చేసింది. వ్యాజ్యాలు తేలేంత వరకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించకుండా ఆదేశాలు జారీ చేయాలని అశోక్‌భాన్‌ కోరారు. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే.. ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో ప్రభుత్వానికి తెలుసునని ధర్మాసనం పేర్కొంది.   

Advertisement
Advertisement