వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

Published Sat, Sep 7 2013 5:08 AM

Three killed in separate road accidents

జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు, రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. తండ్రి వెంట వెళ్లిన బాలుడు బావిలో పడి మృతి చెందిన సంఘటన సోంపేటవాసులను కలచివేసింది. రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది గాయాల పాలయ్యారు. వారిలో ఆరుగురు విద్యార్థులున్నారు. 
 
 విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
 పాలకొండ, న్యూస్‌లైన్: పాలకొండలోని శిర్లిపోతన్న వీధికి చెందిన నీలబోయిన సూరి (45) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శిర్లపోతన్న వీధిలో నివసిస్తున్న సూరి భవన నిర్మాణ కూలిగా పని చేస్తున్నాడు. శుక్రవారం తన ఇంటి సమీపంలో భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసి పని చేసే స్థలానికి చేరుకున్నాడు. కొద్ది సేపటికే విద్యుత్ తీగలు మీద పడడంతో మృతి చెందాడు. సూరికి భార్య అక్కమ్మ, ఒక కుమారుడు ఉన్నాడు. భర్త హఠాన్మరణంతో తల్లడిల్లిపోయిన అక్కమ్మ కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. కాగా ఈ ఘటనలో ఒక గేదె పెయ్యి కూడా విద్యుదాఘాతంతో మృతి చెందింది.
 బావిలో పడి బాలుడు...
 
 సోంపేట : ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన అంబేద్కర్ కాలనీలో విషాదం రేకెత్తించింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోంపేట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అనంత నారాయణ బెహరా, పద్మబెహరాల మూడో కుమారుడు అనంత మాధవ్ బెహరా (12) స్థానిక పెద్ద కోమటి వీధిలో ఏడో తరగతి చదువుతున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో పాఠశాలలకు సెలవు కావడంతో తండ్రితో కలిసి ఇంటి సమీపంలో గల బావి వద్దకు స్నానానికి, బట్టలు ఉతకడానికి వెళ్లాడు. బట్టలు ఉతకడం, స్నానం పూర్తవడంతో, మాధవ్‌బెహరాను తొందరగా ఇంటికి రమ్మని చెప్పి తండ్రి నారాయణ బెహరా ఇంటికి వెళ్లిపోయాడు. బావిలో నీరు తీయబోయిన బాలుడు కాలు జారి బావిలో పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇన్‌స్పెక్టర్ షేక్ మదీనా, ఇతర సిబ్బంది వచ్చి బాలుడిని బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. అప్పటి వరకు తమతో ఉన్న కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. సోంపేట పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 గూడ్‌‌స ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి..
 పొందూరు : రైలు పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని గూడ్స్‌రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. శుక్రవారం  ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని రైల్వే సిబ్బంది తెలిపారు. సంఘటన స్థలాన్ని రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చిరంజీవి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. మృతుడు యాచకుడు కావచ్చునని,   గళ్ల చొక్కా, నిక్కరు ఉన్నాయని హెచ్‌సీ చెప్పారు.  
 
 ఆటో బోల్తా - ఆరుగురికి గాయాలు
 జలుమూరు : మండలంలోని హుస్సేన్‌పురం గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయాల పాలయ్యారు. తర్లాం, గొటివాడ గ్రామాలకు చెందిన విద్యార్థులు కరవంజిలోని మోడల్ హైస్కూల్‌లో ఆరు, ఏడు తరగతులు చదువుతున్నారు. వారు రోజూ ఆటోలో వచ్చి వెళుతుంటారు. శుక్రవారం పాఠశాల ముగిసిన తర్వాత కరవంజి నుంచి జలుమూరు వెళుతున్న ఆటోలో బయలుదేరారు. హుస్సేన్‌పురం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో విద్యార్థులు కె.నజియా, ఎన్.హరి, అనురాధ, సునీత, కె.హేమలత, జె.నాగమణి గాయాల పాలయ్యారు. ఆటో డ్రైవర్ విశ్వనాథం సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 వాహనం ఢీకొని గొర్రెల కాపరికి...
 పొందూరు  : ద్విచక్ర వామణం ఢీకొనడంతో నర్సాపురం గ్రామంలో గొర్రెల కాపరి కోండ్రు అప్పన్నకు గాయాలయ్యాయని ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలి పారు. గొర్రెలు కాస్తున్న అప్పన్న నర్సాపురం నుంచి చిలకపాలెం-పొందూరు రహదారిపైకి వచ్చినపుడు గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. బాధితుడిని రిమ్స్‌కు తరలించారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.    
 
 రోడ్డు ప్రమాదంలో మహిళకు..
 రేగిడి  : ద్విచక్రవాహనంపై నుంచి జారిపడడంతో ఒక మహిళ గాయాల పాలైంది. మండలంలోని సరసనాపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు.  చికిత్స నిమిత్తం ఆమెను అల్లుడు పప్పల వెంకటరావు ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తుండగా బూరాడ జంక్షన్ వద్ద జారి పడింది. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక చికిత్సకు చేరుకున్న ఆమెను వెంటనే రాజాం కేర్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ ఎం.చంద్రమౌళి తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement