మూడు నెలలు.. మూడు సమస్యలు | Sakshi
Sakshi News home page

మూడు నెలలు.. మూడు సమస్యలు

Published Mon, Dec 16 2013 12:47 AM

Three months.. Three problems

 ఆందోళనలకు లోక్‌సత్తా పార్టీ నిర్ణయం


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు ప్రధానమైన ప్రజాసమస్యలపై వచ్చే మూడు నెలలకాలంలో ప్రజల్ని భాగస్వాములను చేస్తూ ఆందోళనలు చేపట్టాలని లోక్‌సత్తా పార్టీ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లో ఆదివారం సమావేశమైంది. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావులు విలేకరులతో మాట్లాడారు. సీఎం కిరణ్ అధికారం చేపట్టేటప్పుడు మూడేళ్లలో 15 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లబోనని చెప్పడాన్ని వారు గుర్తుచేశారు. ఎన్నికలకు మరో 3 నెలల కాలం ఉండగా, ఇప్పటివరకు 4 లక్షల ఉద్యోగాలే ఇచ్చినట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు.

ఇందులోనూ లొసుగులున్నాయని, ఆ వాస్తవాలను నియోజకవర్గాలవారీగా ప్రజలముందు పెడతామని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ మద్యం మహమ్మారి వల్ల భర్తలను కోల్పోయిన బాధితులు వందల సంఖ్యలో ఉన్నారని.. వారికి ఈ ప్రభుత్వం ఏం చేసిందన్న దానిపై ఎక్కడికక్కడ బాధితులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో కాలుష్యాన్ని గుర్తించడానికి ప్రత్యేకంగా కిట్‌లను ఉపయోగించి నీటి నాణ్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని వివరించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. అలాగే ప్రజలు పెద్ద ఎత్తున పార్టీకి విరాళాలు ఇవ్వాలని కోరారు. అవకాశమిస్తే రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చి కొత్త దశ, దిశ ఇచ్చే శక్తి లోక్‌సత్తా పార్టీకి ఉందని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement