జీతమివ్వకపోతే ఎలా బతకాలి? | Sakshi
Sakshi News home page

జీతమివ్వకపోతే ఎలా బతకాలి?

Published Fri, Jun 26 2015 3:28 AM

Three security guards   Suicide attempt

ప్రొద్దుటూరు క్రైం : ఆరు నెలలుగా జీతాలివ్వలేదని వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న వెంకటేష్(48), పవన్(32), చంద్రమోహన్(25) గురువారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషం తాగి ఆస్పత్రి ప్రాంగణంలో కుప్పకూలి పోయారు. ఆస్పత్రి సిబ్బంది వారిని వెంటనే చికిత్స నిమిత్తం క్యాజువాలిటీలో చేర్పించారు. కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి వల్లే తమకు జీతాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

విషయం తెలియగానే ఆస్పత్రి సూపరింటెండెంట్ బుసిరెడ్డి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ఉన్నతాధికారులకు విషయం చేరవేశారు. జిల్లా ఆస్పత్రిలో 18 మంది సెక్యూరిటీగా పని చేస్తున్నారు. వారికి ఈ ఏడాది జనవరి నుంచి జీతాలు రాలేదు. ఇందుకోసం పదే పదే అధికారులను అడుగుతూ వస్తున్నారు. కాంట్రాక్టర్‌లో చలనం రాకపోవడంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. విద్యాసంస్థలు ప్రారంభమైన దృష్ట్యా  జీతాలు ఇవ్వకపోవడంతో పిల్లలను పాఠ శాల, కళాశాలలకు పంపించేలేదని వారు వాపోతున్నారు.

జీతం అడిగితే కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి తనను కొట్టి పంపించాడని చంద్రమోహన్ అనే సెక్యూరిటీ ఉద్యోగి తెలిపాడు. కడపకు రమ్మని చెప్పిన అతను దాడి చేయడమే గాక డబ్బు జీతం ఇచ్చేది లేదు.. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని ఆగ్రహం వ్యక్తం చేశాడన్నారు. మరో ఉద్యోగి పవన్‌ను కూడా కాంట్రాక్టర్ దూషించాడన్నారు. కాంట్రాక్టర్ ఆస్పత్రి వద్దకు ఏడాదిగా రాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పూట గడవక చనిపోతున్నామని వెంకటేష్ అనే సెక్యూరిటీ గార్డు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

తన చావుకు కారణం కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి, అధికారులేనని అందులో స్పష్టం చేశాడు. తన చావుతోనైనా మిగిలిన ఉద్యోగులకు జీతాలు ఇస్తారని అందులో పేర్కొన్నాడు. ఔట్‌పోస్టు పోలీసులు ఈ లేఖను స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డిపై కేసు నమోదు చేయాలని, అతన్ని తొలగించి వేరే వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అన్వేష్ డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement