మూడు లారీలు.. 6 లోడులు | Sakshi
Sakshi News home page

మూడు లారీలు.. 6 లోడులు

Published Wed, Aug 19 2015 1:13 AM

Three trucks loaded .. 6

గ్రామాల్లో  ఇసుక ర్యాంపుల నిర్వహణ డ్వాక్రా సంఘాలకు అప్పగించామని చెప్పినా.. అనేక చోట్ల తెరవెనుక టీడీపీ నాయకులే చక్రం తిప్పుతున్నారు. నరసన్నపేట మండలంలోని గోపాలపెంట ర్యాంపు కూడా ఇందుకు మినహాయింపు కాదు!!
 
 నరసన్నపేట : గోపాలపెంటలో ఇసుక ర్యాంపును డ్వాక్రా మహిళలకు అప్పగించినా వారు నామమాత్రంగానే ఉంటున్నారు. అంతా ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన మరో వ్యక్తే చూస్తున్నారు. ఆయ న చెప్పిందే వేదం. ఇసుక లోడు కావాలన్నా, ఆగాల న్నా ఆయన చెప్పినట్టే చేయాలి. డీఆర్‌డీఏ అధికారులు వచ్చినా ఆయనతోనే సంప్రదింపులు చేస్తున్నారు. ఇలా పెత్తనమంతా టీడీపీ నేతదే కాగా, రసీదులు రాయడానికే డ్వాక్రా మహిళలు పరిమితమవుతున్నారు.
 
 అక్రమ లోడులు
 ఈ ర్యాంపులో నిత్యం వందలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. లారీల్లో అధికంగా ఇసుక లోడ్ చేయాలన్నా, సీరియల్ కాకుండా ముందుగా లోడ్ కావాలన్నా డబ్బు ముట్ట చెప్పాల్సిందే. మూడు నెలలుగా ఇక్కడ ఇసుక ర్యాంపు నిర్వహిస్తుండగా వారం రోజులుగా వాహనాల తాకిడి అధికంగా ఉంది.  జిల్లాలో మరెక్కడా లారీలకు ఇసుక లోడ్ చేయక పోవడంతో గోపాలపెంట ర్యాంపునకు వాహనాలు అధికంగా వస్తున్నాయి. ఇక్కడ 9 క్యూబిక్ మీటర్లు ఇసుకనే ఇస్తున్నారు. దీంతో టిప్పర్లు విశాఖ, విజయనగరం. జిల్లాల నుంచి అధికంగా వస్తున్నాయి. ర్యాంపులో రెండు పొక్లెయిన్లు లోడింగ్‌కు ఉపయోగిస్తుండగా ఒకటే నిరంతరంగా లోడ్ చేస్తోంది.
 
 మరో పొక్లెయిన్ నిత్యం మొరాయిస్తూ ఉంది.  ఒక్కో లారీ మూడు రోజుల వరకూ క్యూలో ఉంటున్నాయి.  ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ర్యాంపు నిర్వాహకులు లారీల సిబ్బంది నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ ర్యాంపులో 1.80 ల క్యూబిక్ మీటర్లు ఇసుక విక్రయించాలని అధికారులు నిర్ణయించగా సోమవారం ర్యాంపు ముగిసే సరికి 62 వేల క్యూబిక్ మీటర్లు ఇసుకను  మాత్రమే విక్రయించినట్లు లెక్కలుచెబుతున్నారు. వాస్తవానికి అంతకంటే ఎక్కువగానేఅమ్మినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఈ ర్యాంపు పేరిట లారీలు వచ్చి పోతుండటంతో రోడ్డు పాడైందని, రోడ్డుకు ఆనుకొని ఉన్న ఇళ్లకు చెందిన కుటుంబాలు వాహనాల శబ్దానికి ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను ఉన్నతాధికారులు చక్కదిద్దాలని వారుకోరుతున్నారు.
 

Advertisement
Advertisement