వైఎస్సార్‌సీపీ ప్రభంజనం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

Published Thu, Jan 31 2019 3:31 AM

Times Now - VMR survey reveals about Coming Lok Sabha election Results - Sakshi

సాక్షి, అమరావతి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతుందని టైమ్స్‌ నౌ– వీఎంఆర్‌ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ 23 సీట్లలో విజయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది. టీడీపీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఖాతా తెరవలేవని చెప్పింది. వైఎస్సార్‌ సీపీ, టీడీపీల మధ్య ఓట్ల వత్యాసం కూడా భారీగానే ఉంటుందని సర్వే పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 49.5 శాతం ఓట్లు, టీడీపీకి 36 శాతం, బీజేపీ (ఎన్‌డీఏ)కి 4.8 శాతం, కాంగ్రెస్‌ (యూపీఏ)కు 2.5 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు, వైఎస్సార్‌సీపీకి 8 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. 

పాదయాత్రతో ప్రజలకు చేరువైన జగన్‌ 
ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర సాగించి అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారని విశ్లేషకులు అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఇందుకు తోడయ్యాయని విశ్లేషించారు. జగన్‌ ఇచ్చిన హామీలు అన్ని వర్గాల వారిని ఆదుకునేలా ఉన్నాయని, అందుకే ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టనున్నారని తేల్చి చెప్పారు.   

Advertisement
Advertisement