బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Published Mon, Oct 3 2016 3:02 AM

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - Sakshi

- శాస్త్రోక్తంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
- ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించిన సేనాపతి విష్వక్సేనుడు
 - పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
 
 సాక్షి, తిరుమల:
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తరఫున ఆయన సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంసంధ్యా సమయంలో విష్వక్సేనుడు.. ఛత్ర, చామర, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగింపుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి తిరిగి ఆలయంలోనికి చేరుకున్నారు. వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల్లోపు ధ్వజారోహణంతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. తర్వాత రాత్రి 9 గంటలకు  శేష వాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 11 వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఐదో రోజు రాత్రి 7.30 గంటలకే గరుడ వాహనంపై స్వామి దర్శనమివ్వనున్నారు. ఎనిమిదో రోజు రథోత్సవం, చివరి రోజు చక్రస్నానంలో స్వామి సేద తీరుతారు.

 నేడు శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పణ
 తిరుమలేశునికి సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత సీఎం ఇక్కడి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి సమర్పిస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వెలుపల పెద్ద శేషవాహనసేవలో పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు. బ్రహ్మోత్సవాల కోసం బందోబస్తు సిబ్బంది తిరుమలకు చేరుకోవడంతో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.

 కన్నుల వైకుంఠం
 బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల ఆలయం ప్రత్యక్ష వైకుంఠాన్ని తలపిస్తోంది. శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహాద్వారం నుంచి గర్భాలయం వరకు సువాసనలు వెదజల్లే పుష్పాలతో పాటు, విద్యుత్ దీపాలతో అలంకరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement