పురిటి నొప్పులతో అరిస్తే చెంపదెబ్బలు | Sakshi
Sakshi News home page

ప్రసవ రోదన

Published Wed, Mar 21 2018 9:42 AM

Tirupati Government Hospital Staff Harassments On Pregnants - Sakshi

పాకాలకు చెందిన స్వర్ణ రెండు రోజుల క్రితం పురిటి నొప్పులతో తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆదివారం నొప్పులు ఎక్కువయ్యాయి. నరకయాతన పడింది. పక్కనే ఉన్న  నరుసమ్మ ఎందుకు అరుస్తున్నావ్‌..అంటూ రెండు చెంపలూ చెళ్లుమనిపించింది. అంతటితో ఆగకుండా పచ్చి బూతుల దండకం అందుకుంది. ఇది ఒక్క స్వర్ణ పరిస్థితే కాదు. ప్రసూతి ఆస్పత్రికి వస్తున్న పలువురు గర్భవతులు ఎదుర్కొంటున్న సమస్య..

తిరుపతి (అలిపిరి): ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. నిరుపేద గర్భవతులకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడే మహిళలకు ఛీదరింపులు తప్పడంలేదు. గర్భవతుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ మానవత్వం మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. పురిటి నొప్పులతో అల్లాడుతున్న మహిళలను ఓదార్చాల్సిన వైద్యసిబ్బంది పచ్చి బూతుల దండ కం అందుకుంటున్నారు. కేకలు పెడితే చెంప చెల్లుమనిపిస్తున్నారు. సభ్యసమాజం నివ్వెరపోయేలా ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వైద్య సిబ్బంది వైలెంట్‌ వైద్యానికి దిగుతున్నారు.

రోజుకు 30 నుంచి 50 ప్రసవాలు
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పేద గర్భిణుల సంఖ్య పెరగడంతో 300 పడకలకు పెంచి సేవలందిస్తున్నారు. రోజుకు 30 నుంచి 50 ప్రసవాలను వైద్యబృందం చేస్తోంది. ఆస్పత్రిలో కాన్పునకు ముందు పేద గర్భిణులకు నరకం చూపిస్తున్నారు. యాంటినెటల్‌ వార్డులో పురిటి నొప్పులు ప్రారంభమైన మహిళలను ఉంచి వైద్యం చేస్తుంటారు. ఈ వార్డులో చేరే మహిళల పట్ల వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

రాత్రయితే ప్రవేశం లేదు
యాంటినెటల్‌ వార్డులో సేవలు పొందుతున్న గర్భిణులకు పుట్టెడు కష్టాలు తప్పడం లేదు. రాత్రయితే సహాయకులను బయటకు పంపేస్తున్నారు. గర్భవతులకు వైద్య సేవలందుతున్నాయా లేవా..? అన్న విషయాలు బంధువులకు చేరవేయడం లేదు. కాన్పు అయిన తర్వాత బంధువులకు తెలియజేస్తున్నారు. పురిటి నొప్పుల సమయంలో తనను కొట్టారు.. తిట్టారు అని బాలింత చెబితే తప్ప వారి బంధువులకు తెలిసే అవకాశం లేదు. రాయలసీమ ప్రాంత ప్రభుత్వ కాన్పుల ఆస్పత్రిలో వైద్యం అందుతున్న తీరు ఇది.

పోస్ట్‌నెటల్‌ వార్డులో మరీ దారుణం
కాన్పు అనంతరం బాలింతలను పోస్ట్‌నెటల్‌ వార్డులోకి తరలిస్తారు. అక్కడ బాలింతలు అవస్థలు పడక తప్పడం లేదు. పడకల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒకే పడకపై ఇద్దరు బాలింతలు వైద్యసేవలు పొందాల్సివస్తోంది. ఎవరైనా ప్రశ్ని స్తే వారికి వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నారు. బాలింతలకు మౌలికసదుపాయాలు కల్పించడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

సిజేరియన్‌కు రూ.500
ప్రసూతి ఆస్పత్రిలో సాధారణ ప్రసవం సాధ్యంకాని పక్షంలో గర్భిణులకు సిజేరియన్లు చేసి శిశువును వెలికి తీస్తారు. ఇదే అదునుగా చేసుకుని కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సిజేరియన్‌ అయిన మహిళ బంధువుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రూ.500 నుంచి రూ.1000 డిమాండ్‌ చేస్తున్నారు. గర్భిణుల బంధువులు చేసేది లేక వారి దగ్గర ఉన్న నగదులో ఎంతో కొంత ఇవ్వడం మామూలైపోయింది. సిబ్బంది చేతివాటంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఫలితం లేకుండా పోయింది.

గర్భవతి మృతి
ప్రసూతి ఆస్పత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో రాజంపేటకు చెందిన మణి (35) అనే గర్భవతి మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లిన గర్భవతి హఠాత్తుగా మృతి చెందింది. ఉమ్మనీరు రక్తనాళాలు, శ్వాస అవయావాలకు చేరడం వల్ల ఆమె మృతి చెందిందని ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భవాని వెల్ల్లడిం చారు. నాలుగో కాన్పు కావడంతో పాటు మహిళ వయస్సు 35 సంవత్సరాలు దాటడడం కూడా మృతికి కారణమని చెప్పారు. బంధువులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యం వల్లే్ల మృతి చెందిందని ఆరోపించారు.

మెరుగైన వైద్య సేవలు
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గర్భుణులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంలేదు. కాన్పు సమయంలో మహిళ ఆరోగ్యం క్షీణిస్తే తప్ప మృతి చెందదు. మణి అనే గర్భిణి ఉమ్మనీరు రక్తనాళాలు, శ్వాస అవయవాల్లోకి వెళ్లడం వల్లే మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదు.– డాక్టర్‌ విద్యావతి, ఆర్‌ఎంఓ,ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, తిరుపతి

Advertisement

తప్పక చదవండి

Advertisement