వదల బొమ్మాళీ! | Sakshi
Sakshi News home page

వదల బొమ్మాళీ!

Published Sat, Dec 24 2016 2:20 AM

వదల బొమ్మాళీ! - Sakshi

తిరుపతి తుడా: తిరుపతి నగరపాలక సంస్థలో ఏళ్లతరబడి తిష్టవేసి.. అడ్డదిడ్డంగా దోచేస్తున్న అవినీతి తిమింగలాల్లో ఆందోళన మొదలయ్యింది. స్థానికంగా పనిచేసే డీఈఈ లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి అడ్డంగా దొరికొపోయారు. ఆ కోవకు చెందిన కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏక్షణాన తమపై దాడిచేస్తారో.. ఎంత నగదు స్వాధీనం చేసుకుంటారోనని వణికిపోతున్నారు.

అవినీతికి అడ్డా!
తిరుపతి కార్పొరేషన్‌ అవినీతికి అడ్డాగా మారింది. ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు వసూల్‌ రాజాలుగా వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరి అండదండలతో ఉన్నతాధికారులనే మస్కా కొట్టిస్తూ తమదైన శైలిలో అవినీతికి పాల్పడుతున్నారు. ఓ ద్వితీయ శ్రేణి  అధికారి అండ చూసుకుని పేట్రేగిపోతున్నారు. ఏ పనిచేయాలన్నా మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. ఇటీవల మున్సిపల్‌ పాఠశాలలకు డీఎస్సీ ద్వారా 36 మంది ఉపాధ్యాయుల నియామకం జరిగింది. వీరికి ఉద్యోగ నియామక పత్రాలు జారీకి నెలన్నర రోజులు పట్టింది. కేవలం వారు లంచం ఇవ్వలేదన్న సాకుతోనే వేధింపులకు గురిచేశారు. వారి జీతాల చెల్లింపులకు సంబంధించిన ఫైలు కదలికలోనూ చేతి వాటం ప్రదర్శించారు. ఇలా అన్ని విభాగాల్లో ముడుపులు ముట్టందే ఫైళ్లు ముందుకు కదలని పరిస్థితి.

పాతుకుపోయారు!
తిరుపతి కార్పొరేషన్‌లో కొంతమంది అధికారులు, ఉద్యోగులు చక్రం తిప్పుతూ తమకు కావాల్సిన విభాగాల్లోనే ఏళ్లతరబడి పాతుకుపోయారు. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండతో వారు ఆడిందే ఆటగా ముందుకుసాగుతున్నారు. ప్రమోషన్లు వచ్చినా వెళ్లడంలేదు. అధిక ఆదాయం వచ్చే కింది స్థాయి పోస్టులను వదలడంలేదు. కొందరు ఉద్యోగులు కింది స్థాయి పోస్టుతో పాటు పైస్థాయి పదవిని అనుభవిస్తున్నారు. ఇది వింతగా ఉన్నా నగ్నసత్యం. పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి సూపరింటెండెంట్‌గా ఉంటూనే క్లర్క్‌–1గా కొనసాగుతున్నారు. కిందిస్థాయి సి బ్బందికి ఆ పోస్టును ఇవ్వకుండా అంటిపెట్టుకోవడం గమనార్హం. రెవె న్యూ విభాగంలోనూ ఇద్దరు వ్యక్తులు ఆర్‌ఐలుగా పదోన్నతులు పొందినా బిల్‌ కలెక్టర్‌ పోస్టులను వదులడంలేదు. ఇదే విభాగంలో ఓ మహిళా ఉద్యోగిని సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది జూనియర్‌ అసిస్టెంట్‌గా కొనసాగుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్‌ జాబితాలో ఉన్నా వారికి పదవులు ఇవ్వడం లేదు. ప్రమోషన్‌ వస్తే రాబడి తగ్గుతుందనే భయంతో ౖపైరవీలు చేస్తూ రెండు పదవులు అనుభవిస్తున్నారు. పరిపాలన, రెవెన్యూ, హెల్త్, టౌన్‌ ప్లానింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఇదే తంతు.

మాట వినకపోతే అంతే!
మాట వినని, ముడుపులు ఇవ్వని వారికి ప్రాధాన్యతలేని పోస్టుల్లోకి పంపుతున్నారు. అవసరం లేకపోయినా అవసరానికి మించి మెప్మాలో ఉద్యోగులు ఉండడానికి ఇదే కారణం. ఇక్కడ అవసరానికి మించి ఉద్యోగులు కొనసాగుతున్నారు. టౌన్‌ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్, పరిపాలన, హెల్త్‌ విభాగాల్లో అవినీతి అధికమవుతోంది. రెవెన్యూలో ఇంటి పన్నులపై కనికట్టు చేస్తున్నారు. ఖరీదైన ఇళ్లకు కూడా సాధారణ ఇంటి పన్నులు వేసే ప్రబుద్ధులు ఈ విభాగంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం సెటిల్‌మెంట్ల విభాగంగా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement