మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడంతే! | Sakshi
Sakshi News home page

అల్లుడంతే!

Published Thu, Feb 6 2020 10:33 AM

Tirupati TDP Former MLA Son in law Land Grabbing Story - Sakshi

తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుళ్ల తీరుపై ఆరోపణల పరంపర కొనసాగుతునే ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దల్లుడికి సొంత పార్టీలోనూ.. ప్రజల్లోనూ అనేక అవినీతి మరకలంటుకున్నాయి. ప్రభుత్వ భూముల భూకబ్జాలు.. రియల్‌ ఎస్టేట్‌ మోసాలు.. సెటిల్‌మెంట్లు.. చేస్తున్నారని ఆ పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. తాజాగాఆ కుటుంబానికి అనుచరులుగా ఉన్న వారే బాధితులయ్యారు. ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు తీసుకుని చిన్నల్లుడు మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాచేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు.

తిరుపతి అర్బన్‌: అధికారంలో ఉన్నప్పుడే కాదు.. అధికారానికి దూరమైనా తిరుపతి మాజీ ఎమ్మెల్యే అల్లుళ్ల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయనే ఆరోపణలున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో మోసం చేశారని ఇప్పటికే అనేకమంది బాధితులు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు తిరుపతి మెప్మాలో చోటుచేసుకున్న లక్షలాది రూపాయల అవినీతి అక్రమాల్లోనూ మాజీ ఎమ్మెల్యే అల్లుడి పేరే ప్రధానంగా వినిపిస్తోంది. కొంతమంది గ్రూపు లీడర్లను అడ్డుగా పెట్టుకుని మెప్మా నిధులను స్వాహా చేశారని ఆరోపణలున్నాయి. తాజాగా గతంలో మాజీ ఎమ్మెల్యేకి అనుచరులుగా ఉన్న వారు కూడా బాధితులుగా మిగిలారు. న్యాయం చేయాలని ఇంటి ముందు బైఠాయించారు. 

అడ్డూ అదుపు లేకుండా కబ్జాలు
గత ప్రభుత్వ హయాంలో కొందరు ప్రభుత్వ, మఠం భూములను ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసి, కోట్లాది రూపాయలకు విక్రయించేశారు. కబ్జాలు అంటేనే ఆ కుటుంబంపై వేలెత్తి చూపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే తరఫున ఆమె అల్లుడు అంతా తానై వ్యవహరించేవారు. గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున భూములు కబ్జాచేశారని తెలుగుదేశం పార్టీ నాయకులే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. కాంట్రాక్టర్లనుంచి వసూళ్లు, రెవెన్యూ, కార్పొరేషన్, పోలీస్, మెడికల్‌ విభాగాల నుంచి మామూళ్ల దందాలు చేపట్టారు. ఆ కుటుంబం తీరుతో నియోజకవర్గంలో పార్టీ కూడా వర్గాలుగా మారిపోయింది.  

తానేమీ తక్కువ కాదని..
ఇన్నాళ్లు అవినీతి అక్రమాల్లో మాజీ  ఎమ్మెల్యే పెద్దల్లుడి పేరు మాత్రమే వినిపించేది. తాజాగా తానేమీ తక్కువ కాదంటూ చిన్నల్లుడు దందాలు, మోసాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆయన పలువురి నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.  ఈ క్రమంలో గతంలో ఆ కుటుంబానికి అనుచరుడిగా ఉన్న మహ్మద్‌ రఫీ మంగళవారం సుగుణమ్మ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. మహ్మద్‌ రఫీకి ఎస్వీ యూనివర్సిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని మాజీ ఎమ్మెల్యే చిన్నల్లుడు రూ.7 లక్షలు తీసుకున్నాడు. నాలుగేళ్లు అవుతున్నా ఉద్యోగం ఇప్పించలేదు. ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని     ఎంత ప్రాథేయపడినా పట్టించుకోలేదు.

మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద బాధితుల ఆందోళన
న్యాయం చేయండి  
మా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిందే.. నాకు న్యాయం చేయండి మహా ప్రభూ. నేను పేదోడిని. మమ్మల్ని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు ఉద్యోగాల  పేరుతో దారుణంగా మోసం చేశారు. మా దగ్గర నాలుగేళ్ల క్రితం తిరుపతి ఎస్వీ యూనివర్సీటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.7లక్షలు తీసుకున్నారు. అతన్ని నమ్మి మా బంధువులు అప్పులు చేసి.. నా ద్వారా అతనికి ఇచ్చాం. ఉద్యోగాలు ఇప్పించలేదు. మా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన చుట్టూ తిరుగుతున్నాం. అయితే ఇదిగో అదిగో అంటూ ఏళ్ల తరబడి తిప్పించుకున్నారు. మేం ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో ఆరు నెలల క్రితం కొంత మొత్తానికి చెక్కు.. మరి కొంత మొత్తానికి బాండ్‌ పత్రాన్ని ఇచ్చారు. అయినా వాటి ద్వారా ప్రయోజనం లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద మౌనదీక్ష చేపట్టాం. అయితే వారి మనుషులు న్యాయం చేస్తామంటూ అక్కడి నుంచి దౌర్జన్యంగా పంపించారు. అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.     –మహ్మద్‌ రఫీ, జీవకోన

Advertisement
Advertisement