జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలి | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలి

Published Sun, Nov 16 2014 1:46 AM

జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలి

నెల్లూరు (దర్గామిట్ట): రాజకీయాలకతీతంగా జిల్లా అభివృద్ధికి ప్రతిఒక్కరూ తోడ్పాటునందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. నగరంలోని నిప్పోసెంటర్‌లో శనివారం భారతరత్న సర్దార్‌వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తొలుత వల్లభాయ్‌పటేల్‌నగర్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిత్విక్‌ఎన్‌క్లేవ్‌గా ఉన్న ప్రాంతాన్ని సర్దార్‌వల్లభాయ్‌పటేల్ నగర్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు.

పటేల్ కాంస్య విగ్రహ ఏర్పాటుతో జీవితంలో ఎంతో సంతోషానిచ్చిందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడిన మహానీయుడుగా సర్దార్‌వల్లభాయ్‌పటేల్ చరిత్రలో నిలచారన్నారు. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన నిధులను స్వర్ణభారత్‌ట్రస్ట్ నిర్వాహకురాలు దీపావెంకట్ సమకూర్చారని తెలిపారు. విగ్రహ నిర్వహణ బాధ్యతలను టయోటో షోరూం నిర్వహకులు చూసుకుంటారని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగాస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నగరంలో ఆక్రమణలు తొలగింపునకు అందరూ పూర్తి సహకారమందించాలని తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, నగర పరిధిలో రింగ్‌రోడ్డు ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణాన్ని ఏ మేర విస్తరించాలో ప్రణాళికను తయారు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న డిపోను బైపాస్‌లోకి మార్చి ఆ ప్రాంతంలో టౌన్‌బస్డాండ్‌గా నిర్మాణాలు చేపడతామని చెప్పారు. నగరాన్ని విక్రమ సింహపురిగా మార్చేందుకు కార్పొరేషన్‌లో తీర్మానం చేయాలని సూచించారు.

మినీబైపాస్‌ను సర్దార్‌వల్లభాయ్‌పటేల్‌రోడ్డుగా నామకరణం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధి జరగాలంటే కొన్ని సంస్కరణలు జరగాలన్నారు. పేదలకు కొన్నిరకాల ఇబ్బందులు ఉండవచ్చన్నారు. జిల్లాలో విమానశ్రయం ఏర్పాటు అంత సులభతరం కాద ని తెలిపారు. వైఎస్సార్ జిల్లా ఓబులాపురం నుంచి రాపూరు మీదుగా కృష్ణపట్నంకు రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు.  నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడుతూ పటే ల్ విగ్రహాన్ని స్థాపించకపోవడం విచారకరమన్నారు. పటేల్ లేకుంటే సువిశాల సామ్రాజ్యం ఉండేదికాదన్నారు.

పటేల్ విగ్రహస్థాపన నెల్లూరుకు గర్వకారణంగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర పురపాలకశాఖమంత్రి నారాయణ మాట్లాడుతూ పటేల్ విగ్రహావిష్కరణలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధేగాకుండా రాష్ట్ర అభివృద్ధికి వెంకయ్యనాయుడు తోడ్పాడునందించలన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రజలు వెంకయ్యనాయుడుపై కోటి ఆశలు పెట్టుకున్నారన్నారు.

గతంలో ఆయన హాయాంలోనే జిల్లాలో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. నగర మేయర్ అజీజ్ మాట్లాడుతూ అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ వరప్రసాద్, చెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణి, నగర కమిషనర్ చక్రధరబాబు, ఎస్పీ సెంథిల్‌కుమార్, ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, వాకాటి నారాయణరెడ్డి, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు మేరిగ మురళీధర్, కార్పొరేటర్లు రూప్‌కుమార్ యాదవ్, జెడ్.శివప్రసాద్, దొడ్డపనేని రాజా, మేకల రజనీ, దీపావెంకట్, బీజేపీ నాయుకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, సురేంద్రరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement