కోతకు ఇసుకతో అడ్డుకట్ట | Sakshi
Sakshi News home page

కోతకు ఇసుకతో అడ్డుకట్ట

Published Fri, Feb 21 2014 12:23 AM

కోతకు ఇసుకతో అడ్డుకట్ట

  •     ఇప్పటి కష్టాలకు రేవులదే ప్రధాన బాధ్యత
  •      {పకృతిసిద్ధ మార్పులూ కారణమే
  •      పోర్టుల ద్వారా ఇసుక డిపాజిట్ చేయాల్సిందే
  •      బీచ్ కోత నివారణకు పూణె నిపుణుల సిఫార్సులు
  •      జీవీఎంసీ బృందానికి నివేదిక సమర్పణ
  •  సాక్షి, విశాఖపట్నం : బీచ్ కోతకు కారణాలను శోధించే ప్రయత్నం ఓ కొలిక్కి వస్తోంది. ఈ బాధ్యతను పైన వేసుకున్న మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు సమస్యకు మూలాలు గుర్తించే దిశగా ముందడుగు వేస్తున్నారు. జీవీఎంసీ చొరవతో ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరాభివృద్ధి సంస్థ, పోర్టు, నగరపాలక సంస్థలకు చెందిన ఒక్కో అధికారి ఇటీవల పూణె వెళ్లి అక్కడ కేంద్ర జలశక్తి పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నిపుణులను సంప్రదించారు.

    విశాఖలో కోతకు గురైన ప్రాంతాల్ని, అలల గమనాల్ని, సముద్రంలోని ఇసుక తీరు తెన్నులను, పత్రికల్లో వచ్చిన కథనాల్ని అధికారులు చూపించారు. పోర్టుల మోడళ్లను చూపించారు. గత సమాచారం, గణాంకాల ఆధారంగా సమీక్ష అనంతరం పూణె నిపుణులు విశాఖ పరిస్థితిపై ఓ నివేదిక తయారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.  నష్ట నివారణ చర్యలను చేపట్టేందుకు వీలుగా ఈ నివేదికను నలుగురు అధికారుల బృందానికి అందజేసినట్టు తెలియవచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..
     
     ప్రకృతి.. వికృతి
     దేశంలోని ఇతర బీచ్‌లలో సైతం ఇటువంటి విపత్తు చోటు చేసుకుంటోందని గమనించిన పూణె నిపుణులు విశాఖ తీరరేఖను వాటితో సరిపోల్చారు. ఇటీవల సంభవించిన తుఫాన్‌ల వల్ల; ఈశాన్య/నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకే వేళ వాతావరణంలోని మార్పుల వల్ల కూడా ఆర్కే బీచ్‌లోని కురుసుర, గోకుల్ పార్క్ ప్రాంతాల్లో తీరం కోతకు గురైందని ప్రాథమికంగా అంచనా వేశారు.
         
     తుఫాన్‌ల సమయంలో భారీగా ఇసుక మేటలు వేయడం ఓ కారణమైతే, ఉత్తరం వైపు తరలివెళ్లాల్సిన ఇసుక దక్షిణానికి, దక్షిణం వైపు వెళ్లాల్సిన ఇసుక ఉత్తరానికి మేట వేయడంతో కోత తీవ్రత పెరుగుతోందని గుర్తించారు.
         
     కోతకు గురవుతున్న ప్రాంతంలో ఏటా సుమారు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిక్షిప్తం (డిపాజిట్) కావాల్సి ఉండగా, వివిధ నిర్మాణాల వల్ల, డ్రెడ్జింగ్ సరిగా లేకపోవడం వల్ల, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కేవలం 50 శాతమే డిపాజిట్ అవుతోందని నిపుణులు గమనించారు. ఇక్కడకు చేరాల్సిన ఇసుక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోందని (డ్రిఫ్టింగ్ అవుతోందని) గుర్తించారు.
         
     దీర్ఘకాలిక పరిష్కార చర్యల వల్లే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచించారు. విశాఖ బీచ్ పరిసర ప్రాంతాల్నీ గాబ్రియాన్స్ (పల్చని జియో సింథటిక్ సంచులు), రాళ్లు, జియో బ్యాగ్స్ (ఇసుక నింపే ప్రత్యేక సంచులు) అమర్చాలని సూచించారు.
         
     ఆరేళ్ల క్రితం ఏర్పడిన గంగవరం పోర్టు నిర్మాణం వల్ల కూడా ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోతోందని సూచించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ నిర్మాణం సమయంలో రేవులో ఇసుక మేట వేయకుండా తీసుకున్న చర్యలు కూడా ఇప్పుడు కోతను ప్రభావితం చేస్తున్నాయని సూచనప్రాయంగా తెలిపారు.
         
     హెచ్‌పీసీఎల్ వ్యర్థాలను సముద్రంలో విడిచిపెట్టడానికి ఉద్దేశించిన పైప్‌లైన్, ఇసుకను పంప్ చేయడానికి పోర్టు గతంలో నిర్మించిన పైప్‌లైన నిర్మాణాలను పరిశీలించాలని సూచించారు. బీచ్ పరిరక్షణ కోసం రెండు పోర్టులూ ఇసుకను నిక్షిప్తం చేస్తూ ఉండాల్సిందేనని నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటేనే తీరం కోతను అడ్డుకోవడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
         
     ప్రజలకు ఇబ్బంది లేకుండా సంఘటన స్థలంలో తత్కాలిక రక్షణ చర్యలు చేపట్టామని, నిపుణుల సూచనల ప్రకారం భవిష్యత్తులో శాశ్వత చర్యల్ని చేపడతామని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ తెలిపారు. చెన్నై ఐఐటీ నిపుణుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
     

Advertisement
Advertisement