వైఎస్ తరహాలో పథకాలను అందించాలి | Sakshi
Sakshi News home page

వైఎస్ తరహాలో పథకాలను అందించాలి

Published Mon, Jan 4 2016 12:05 AM

వైఎస్ తరహాలో పథకాలను అందించాలి

జన్మభూమిలో ప్రొటోకాల్ ఉల్లంఘన తగదు
మంత్రి, కలెక్టర్లను ప్రశ్నించిన ఎంపీపీ పచ్చల రత్నకుమారి
 

కాజ (మంగళగిరి రూరల్) :  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరి సంక్షేమ పథకాలను పేదలకు అందించేందుకు కృషి చేయాలని ఎంపీపీ పచ్చల రత్నకుమారి సూచించారు. మండలంలోని కాజ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన జన్మభూమి - మా ఊరు గ్రామ సభలో పాల్గొన్న ఆమె పాలకులు, అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలకు అతీతంగా మహానేత వైఎస్ సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలను పొందారని ఆమె చెప్పారు. నేటి పాలకులు మాత్రం జన్మభూమి కమిటీల పేరుతో వారి అనుయాయులకే పథకాలు అందించేలా వ్యవహరించడం మంచిది కాదని అన్నారు.

అధికారులు, మంత్రులు ప్రభుత్వ పథకాలను పేదలందరికీ అందించడంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అనంతరం కార్యక్రమం ముగింపు సమయంలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై కలెక్టర్ కాంతిలాల్ దండేను నిలదీశారు. జన్మభూమి కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ఎంపీటీసీ సభ్యులు, ప్రజా ప్రతినిధులను కనీసం సభా వేదికపై కూర్చోవడానికి కూడా అవకాశం కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగకుండా అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను గౌరవించాలని ఆమె సూచించారు. అయితే కలెక్టర్  కాంతిలాల్ దండే మాత్రం ఇక నుంచి జరిగే సమావేశాల్లో తామంతా వెనుకకు వెళ్లి కూర్చుంటామని హేళనగా మాట్లాడటం వేదికపై వున్న ప్రజా ప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది.

దీంతో కలెక్టర్ తీరుపై వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు అధికార పార్టీ నేతలు కూడా రుసరుసలాడారు. ఇదే సందర్భంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివశిస్తున్న పేదలకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదని ఎంపీపీ రత్నకుమారి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, మండల ఉపాధ్యక్షులు మొసలి పకీరయ్య, ఎంపీటీసీలు చిలకలపూడి భాస్కర్, ఈదా ప్రతాపరెడ్డి, అప్పికట్ల శేషమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు పచ్చల శ్యామ్‌బాబు, దొంతా వెంకటరావు, గుర్రం అజయ్‌కుమార్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement