ఏమిటీ జాప్యం... ఎందుకీ జాడ్యం | Sakshi
Sakshi News home page

ఏమిటీ జాప్యం... ఎందుకీ జాడ్యం

Published Tue, Jun 3 2014 1:46 AM

to receive Pension financial each month problem

 గార,న్యూస్‌లైన్: ప్రభుత్వం నుంచి పింఛన్లు అందుకోవాలంటే ప్రతి నె లా అవస్థలు పడాల్సిందే. సకాలంలో సొమ్ములు అందక ఫించన్‌దారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేయడం, పోస్టల్ ద్వారా పంపిణీ చేయడంతో అందాల్సిన డబ్బులు నెలల తరబడి అందక వాటి రాకకోసం  ఎదురు చూస్తున్నారు. మండలంలోని సుమారు 8 వేల మంది వృధ్యాప్య, వితంతు, వికలాంగ పింఛన్ లభ్ధిదారులుండగా, ఇప్పటికే సుమారు 2వేల మందికి చేతివేలి ముద్రలు సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి నెలా వీరి సంఖ్య పెరుగుతున్నా ప్రత్యామ్నాయం వైపు  అధికారులు దృష్టిసారించడంలేదు. వీరిలో సుమారు 600 మంది వరకు  గత మూడు నెలలుగా ఫించన్ అందడం లేదు.  
 
 తొలుత ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సరిగ్గా లేదని కారణం చూపిన అధికారులు, ఇప్పుడు వేలిముద్రలు సరిగ్గా లేవని, మిషన్ పనిచేయడం లేదని తదితర కారణాలు చూపి పింఛన్లు  చెల్లించకపోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లు పథకంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసిన తర్వాత సాంకేతిక సమస్యతో మరలా చేయవలసి వస్తోంది. మండలమంతటీకీ ఒక్క సమన్వయకర్తనే నియమించడం, లబ్ధిదారుల నుంచి రీ ఎన్‌రోల్‌మెంట్ కోసం ఆరు వేలిముద్రలు నమోదు చేయడంతో పాటు, ఫోటో, ఆధార్‌లు చేసేసరికి చాలా సమయం పడుతుంది.

దీంతో ఒక్కో వ్యక్తి నాలుగైదు రోజలు మండల కేంద్రానికి రావాల్సి వస్తోంది. తీరా పింఛన్లు వస్తోందంటే నమ్మకం లేదు. మరలా మరో కుటుంబ సభ్యుడుని వెంట తీసుకొని పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోలకు ధరఖాస్తు చేసి, వాళ్ల ఆమోదం చేయించుకోవాల్సి ఉంటోంది. ఇలా ఇన్ని తిప్పలతో తీరని అవస్థలు పడుతున్నా ఉన్నతాధికారుల్లో ఏమాత్రం చలనం లేదని సర్పంచ్‌లు సైతం నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. మరో సమన్వయకర్తను నియమించాలని సర్పంచ్‌లు పీస శ్రీహ రిరావు, లోపింటి భవాని రాధాకిృష్ణారెడ్డి, పొట్నూరు కృష్ణమూర్తి డిమాండ్ చేస్తున్నారు.
 
అదేవిధంగా ఒక్క మండల కేంద్రంలోనే కాక పంచాయితీలో షెడ్యూల్ తెలిపి రావాలని, నీ ఇష్టానుసారంగా వస్తూ, వెళ్లిపోవడం, పింఛన్‌దారులను తిప్పి ఏడిపించడం సమంజసం కాదని కో-ఆర్డీనేటర్‌ను ఎంపీడీవో కార్యాలయం వద్దనే సర్పంచ్‌లు  నిలదీశారు. దీంతో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. ఉన్నతాధికారులైనా  స్పందించి తమకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement