సంక్షోభంలో పొగాకు రైతు | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో పొగాకు రైతు

Published Fri, Jun 12 2015 4:50 AM

సంక్షోభంలో పొగాకు రైతు - Sakshi

వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మార్కెట్లో తగ్గిన కొనుగోళ్లు, కానరాని గిట్టుబాటు ధరలు వెరసి పొగాకు రైతును సంక్షోభంలోకి నెట్టాయి. బయ్యర్లతో సమావేశాలు పెట్టి రైతన్నను కాపాడాల్సిన పాలక వర్గాలు పట్టించుకోకపోవడంతో పొగాకు రైతు ఈ ఏడాది భారీ నష్టాన్ని చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. పొదిలి-2 కేంద్రం పరిధిలోని కనిగిరి ప్రాంత రైతులు పొగాకు రైతులు వచ్చే ఏడాది పొగాకు పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
- ఇళ్లల్లో మగ్గుతున్న బేళ్లు
- భారీ నష్టం చవిచూసే ప్రమాదం
- లబోదిబోమంటున్న రైతులు
- క్రాప్ హాలిడే ప్రకటించిన పొదిలి-2 కేంద్రం రైతులు

 
కనిగిరి
జిల్లాలో పొగాకు విక్రయాల్లో సంక్షోభం ఏర్పడడంతో ఆ రైతుల్లో భయోందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 11 వేలం కేంద్రాలుండగా వాటికి సంబంధించి 90 మిలియన్ కేజీల అనుమతి ఉండగా, 108 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు అంచనా. పొదిలి వేలం కేంద్రం-2 పరిధిలో 14 మండలాలున్నాయి. ఈ కేంద్రం పరిధిలో 1750 వరకు బ్యారన్‌లుండగా ఒక్క కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనే 1350 బ్యారన్‌లున్నాయి.

దీనికి సంబంధించి 2,200 మంది పొగాకు లెసైన్స్ రైతులున్నారు.  ఈ రైతులు గత ఏడాది 9.4 మిలియన్ కేజీలు పొగాకు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది 8.5 మిలియన్ కేజీలు మాత్రమే చేశారు. గత ఏడాది జూన్ నాటికి 4.8 మిలియన్  కేజీల పొగాకు అమ్మకాలు జరగ్గా, ఏడాది జూన్ నాటికి 1.2 మిలియన్  కేజీల పొగాకు అమ్మకాలు జరిగినట్లు అధికారిక నివేదికలున్నాయి.

భారీగా నష్టంవాటిల్లే ప్రమాదం
అధికారిక లెక్కల ప్రకారం ఆగస్టు వరకు పొగాకు కొనుగోళ్లు జరుగుతాయి. ఇప్పటికే 45 శాతం పొగాకు అమ్మకాలు జరిగి ఉండాలి . కారణాలు ఏమైనా బయ్యర్లు పొగాకును కొనుగోలు చేసే వాతావరణం కనిపించడం లేదు. అంటే ఆగస్టు, సెప్టెంబర్ నాటికి 5 మిలియన్ కేజీల అమ్మకాలు జరిగినా, దాదాపు 3.5 మిలియన్ కేజీల పొగాకు నిలిచిపోతోంది. అందులో గ్రేడ్ 1 రకం కనీసం 1.5 మిలియన్ కేజీలుంటుందనేది  రైతుల అంచనా.

లేదా ప్రస్తుతం గ్రేడ్ 1 రకానికి కేజీకి సరాసరిన రూ.90 నుంచి రూ.108  వరకు  ఇస్తున్నారు. దానిని సగం రేటుకు అమ్ముకున్నా నష్టం వస్తుంది. ప్రస్తుతం ఒక్కో రైతు ఇంట్లో 30, 40 బేళ్లు మగ్గిపోతున్నాయి. సరైన గిట్టు బాటు ధరలేక, లోగ్రేడ్ పొగాకు అమ్మకాలు జరగక తీసుకెళ్లిన బేళ్లు వెనక్కి తీసుకుని రావాల్సిందే. ఈ ఏడాది ఒక్కో రైతుకు లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతుందని రైతులు లబోదిబోమంటున్నారు.

విదేశీ ఆర్డర్లు తగ్గినందునే...
దీనిపై ఆక్షన్ సూపరిండెంట్ సత్యన్నారాయణ రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా దేశంలో పొగాకు ఉత్పత్తుల వాడకం తగ్గింది. విదేశీ అర్డర్లు తగ్గినందువల్ల బయ్యర్లు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదు. కనిగిరి ప్రాంత పొగాకు రైతులు వచ్చే ఏడాదికి క్రాప్ హాలిడే ప్రకటిస్తూ తీర్మానం చేసి వినతి పత్రం ఇచ్చిన విషయం వాస్తవమే.

Advertisement
Advertisement