నేడు కాంగ్రెస్ కృతజ్ఞత సభ | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్ కృతజ్ఞత సభ

Published Sat, Nov 9 2013 3:40 AM

Today,  Congress gratitude Sabha

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్:  హన్మకొండ జేఎన్‌ఎస్ గ్రౌండ్‌లో శనివారం జరగనున్న కాంగ్రెస్ కృతజ్ఞత సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్ష మంది సమీకరణ లక్ష్యంగా జిల్లా మంత్రులు, నేతలు ప్రణాళిక రూపొందించుకున్నారు. అధిష్టానం పరిశీలించే అవకాశం ఉన్నందున నేతలు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభకు డిప్యూటీ సీఎం రాజనర్సింహతో పాటు కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరామ్‌నాయక్, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, గీతారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు రాజయ్య, హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు హాజరుకానున్నారు.

వారం రోజులుగా జిల్లాకు చెందిన మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు ఇక్కడే మకాం వేసి సభను జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, శ్రేణులను తరలించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణవాదులు, ఉద్యోగులు, ఇతర సంఘాల నేతలు హాజరయ్యేందుకు శ్రమిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి పది వేల మందిని సమీకరించాలని నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటే ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జిలుగా ఉన్న వారిపై భారం వేశారు. మంత్రులు సారయ్య, పొన్నాల ఇప్పటికే ఉద్యోగ జేఏసీ నాయకులు, న్యాయవాదులు, మహిళా గ్రూపులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా తెలంగాణ ఇస్తున్న పార్టీగా కాంగ్రెస్‌కు ప్రత్యేక గుర్తింపును ఈ సభ ద్వారా తేవాలని ప్రయత్నిస్తున్నారు. అరవై ఏళ్ళ తెలంగాణ ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తున్నందున ఆ పార్టీకి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సభ జరిగే జేఎన్‌ఎస్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తయ్యూరుు. వేదికపై నాయకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆ స్థాయిలోనే ఏర్పాటు చేశారు.

స్టేడియం చుట్టుపక్కల ఉన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. స్టేడియంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు దొంతి మాధవరెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్ పరిశీలించారు. సభ జయప్రదం కావాలని మైదానంలో వేదబ్రాహ్మణులు శుక్రవారం యాగం కూడా నిర్వహించారు. వరంగల్ నగరానికి వచ్చే నాలుగు మార్గాల్లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, జిల్లా నాయకుల భారీ ఫ్లెక్సీలు, కాంగ్రెస్ జెండాలు, తోరణాలు కట్టారు. వాహనాలకు కేఎంసీ, ఎల్‌బీ కళాశాల , ఆర్ట్స్‌కళాశాల, పద్మాక్షిగుట్ట ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించారు. అతిథులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు భారీగా జనం వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Advertisement
Advertisement