నేను నిన్ను ప్రేమిస్తున్నా.. | Sakshi
Sakshi News home page

నేను నిన్ను ప్రేమిస్తున్నా..

Published Sat, Feb 14 2015 2:20 AM

నేను నిన్ను  ప్రేమిస్తున్నా..

నేడు ప్రేమికుల  రోజు
 
ప్రేమకు అర్థం ఎవరంటే మేమని చూపే ప్రేమికులు ఎందరో ఉన్నారు. రెండక్షరాల ప్రేమను ప్రణయనాదంగా భావించి జీవితంలో ఆనందంగా ప్రయాణిస్తున్నవాళ్లూ ఉన్నారు. అలాంటి ప్రేమను పానుపనుకునే కాముకులకూ కొదవేం లేదు. మనోనేత్రంతో మనసు చూసి, వలచి, తలచి.. తరించిన ప్రేమ పెళ్లి వరకూ వెళ్లినా.. పెద్దరికం ముందు ఓడినా.. పవిత్రంగానే ఉంటుంది. ఆకర్షక ఒంపుల వైఖరిలో చిక్కి, అదే ప్రేమని భ్రమిసి.. అందాన్ని దక్కించుకోవాలనుకునే కీచక ప్రేమకు ఎందరో అమ్మాయిలు బలవుతున్నారు. కన్నవారి ప్రేమ తప్ప అన్యం పుణ్యం ఎరుగని ముక్కుపచ్చలారని బాలికలు కూడా వీరిలో ఉన్నారు. అసలైన ప్రేమ వయసెరిగి.. మనసెరిగి ప్రవర్తిస్తుంది. అందుకే ఈ ప్రేమలోకంలో మాటరాని మౌనాన్ని జయించిన మూగమనసులూ ఉన్నాయి. ప్రేమతో చీకట్లను చీల్చి వెలుగుల్లో పయనిస్తున్న చూపులెరగని మనుషులూ ఉన్నారు. అయితే  ప్రేమే సర్వస్వం అనుకునే యువతకు.. ప్రేమ నేరం అనుకునే పెద్దరికానికి వైరం ఇవాళ్టిది కాదు. లైలా మజ్నూ జ మానా నుంచి పెద్దల చేతిలో ప్రేమ ఓడిపోతూనే ఉంది. పెద్దల పట్టింపులకు పెళ్లిపీటలెక్కాల్సిన ఎన్నో ప్రేమలు బలవంతంగా ‘చితి’కిపోతున్నాయి. ప్రేమను నిజంగా ప్రేమించిన వ్యక్తి.. దాన్ని ప్రేమగా వ్యక్తీకరించాలి. కన్నవారిని నొప్పించకుండా.. ప్రేమను ఒప్పించుకోవాలి. అప్పుడే ఆ ప్రేమ పదికాలాలు పచ్చగా ఉంటుంది. నిజమైన ప్రేమకు అర్థంలా ఉంటుంది.
 
వెంకటరామ్ మునిరెడ్డి, మాధవీలత
 
చిత్తూరు : తిరుపతిలో వ్యవసాయశాస్త్రవేత్తగా పనిచేస్తున్న పల్లె వెంకటరామ్‌మునిరెడ్డిది వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం కొత్తపల్లి. తుడా (తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ) కార్యదర్శి మాధవీలతది సైతం అదే జిల్లా  ఒంటిమిట్ట మండలం మల్‌కాట్‌పల్లి. ఇద్దరూ 1992లో తిరుపతి ఏజీబీఎస్ కాలేజీలో చేరారు. ఇద్దరి మనసులూ కలిశాయి. ఐదు సంవత్సరాల వారి ప్రేమ చివరకు పెద్దల ఆమోదంతో 2000 ఫిబ్రవరి 24న మూడుముళ్ల బంధంగా మారింది. 1999లో వెంకట్ వ్యవసాయశాస్తవేత్తగా ఉద్యోగంలో చేరి అన్నదాతల మన్ననలందుకుంటున్నారు. 2003లో మాధవీలత వ్యవసాయాధికారిగా, 2005  జనవరిలో ఇక్రిషాట్‌లో ఉద్యోగంలో చేరారు. మాధవీలత భర్త సహకారంతో  గ్రూప్ వన్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు  నంద్యాల, నెల్లూరులో ఆర్డీవోగా పనిచేశారు. ఉత్తమ అధికారిగా మన్ననలు పొందారు. ప్రస్తుతం తుడా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారికి కౌశిక్,హర్షిత పిల్లలు. మంచిని ప్రేమించి నిజాయితీగా పది మందికీ చేవసే భాగ్యం భగవంతుడు ఇవ్వడం అదృష్టమంటారు వారు.
 
వారి మాటల్లో ప్రేమంటే.. సృష్టికి మూలం.. నమ్మకం.. అనురాగం.. నిస్వార్థం ఉంటాయి. ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమికులు పరస్పరం ఉన్నతికి సోపానాలు వేసుకోవాలి. మా వరకూ వస్తే మా ప్రేమ పెరిగిందే తప్ప తరగలేదు. మేం ఒకటే హృదయం కలిగిన ఇద్దరు మనుషులం. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రేమను బలిపెట్టడం కంటే నేరమైనది మరొకటి ఉండదు. కోరుకున్న యువతి దొరకలేదనే  కసితో యాసిడ్ దాడులు, కత్తిపోట్లతో ప్రాణాలు తీయడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం బాధాకరం.  నిజమైన ప్రేమలో ఇలాంటి వాటికి స్థానం లేదు.
 
పాటలో పల్లవించిన ప్రేమ
 
మదనపల్లె సిటీ: ఇద్దరూ పుట్టకతోనే అంధులు. ఇద్దరి మనస్సులు ఒకటయ్యాయి. ఇద్దరు మంచి గాయకులు. పాటల పల్లవికిలో ప్రేమ చిగురించి పెళ్లికి దారితీసింది. మదనపల్లె పట్టణం బోయవీధికి చెందిన బాణాల రమణమ్మ, కరీంనగర్ జిల్లా కోహెడ మండలం సముద్రాలకు చెందిన ఉత్తరపల్లి రాజులు అంధులు. చిన్నప్పటి నుంచి పాటలు పాడే అలవాటుంది. మదనపల్లెలో జరిగిన ఓ కచేరిలో కలిశారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమకు దాకా దారి తీసింది. విషయం ఎన్జీవో సంఘ నాయకురాలు సుభద్రకు తెలియజేశారు. ఇద్దరి పెద్దలను ఒప్పించి 2010 జూన్ 5వ తేదీన శ్రీప్రసన్న వెంకటరమణస్వామి దేవాలయంలో పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి మెలిసి జీవిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తిరుపతిలో చిన్న వ్యాపారం చేస్తూ అప్పుడప్పుడు గాన కచేరీల్లో పాల్గొంటున్నారు.
 
సేవే ప్రేమకు సన్మార్గం..!


పుంగనూరు: డాక్టర్ శివ, సరళ ఇద్దరూ హోమియో వైద్యులు.   వే ర్వేరు కళాశాలల్లో చదువు పూర్తి చేసుకుని పుంగనూరు వచ్చారు. పుంగనూరు, మదనపల్లె ప్రాం తాల్లో  వివిధ కార్యక్రమాల్లో కలసి పాల్గొనేవారు. వృత్తి పరంగా, సమాజసేవలో కలుసుకోవడంతో మనస్సు లు ఒక్కటయ్యాయి. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. కులాలు వేరైనా భావాలు ఒక్కటే కావడంతో తల్లిదండ్రులను ఒప్పించి 1990 డిసెంబర్ ఒకటో తేదీ పెళ్లి చేసుకున్నారు. నాటి నుంచి పుంగనూరులో సరళ హోమియో నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేసి సమాజసేవ చేస్తూ  ఆదర్శవైద్యులుగా పేరుగాంచారు. డాక్టర్ శివ జిల్లా లయన్స్ క్లబ్ పీఆర్‌వోగా ఉంటూ పేద ప్రజలకు అండగా నిలిచి పలువురు మన్ననలు పొందుతున్నారు.  డాక్టర్లు శివ, సరళ మాట్లాడుతూ ప్రేమతో ఆత్మహత్యలకు పాల్పడడం చేయొద్దన్నారు. ప్రేమను ప్రేమగా చూస్తే అంతా విజయమేనని వారు వెల్లడించారు.
 
కాలేజీలో పుట్టిన ప్రేమ

 
పుంగనూరు: కళాశాలలో ఒకరికొకరు ముఖ పరిచ యం. అనుకోకుండా అదే కళాశాలలో ఇద్దరికీ తాత్కాలిక ఉద్యోగాలు వచ్చాయి. ముఖ పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇదీ జిల్లా ఎన్‌జీవోల సంఘ ఉపాధ్యక్షుడు వరదారెడ్డి, మదనపల్లె ప్రభుత్వ క ళాశాల అధ్యాపకురాలు విజయలక్ష్మిల ప్రేమగాథ. 1985లో జి.వరదారెడ్డి, విజయలక్ష్మిలు బసవరాజ కళాశాలలో తాత్కాలిక అధ్యాపకులుగా చేరారు. ఇలా ఉంటూ ప్రేమలో పడ్డారు. కులాలు వేరైనా పెళ్లి చేసుకోవాలన్నారు. విజయలక్ష్మి పెద్దలను కాదని సమాజంలో జీవించగలమా అన్న అనుమానం వ్యక్తం చేసింది.  తరువాత వరదారెడ్డి సెరికల్చర్ శాఖలో శాశ్వత ఉద్యోగంలో చేరా రు. దీంతో పెళ్లికి మార్గం సుగమమైంది. 1989 డిసెంబర్ 15న పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తున్నారు. ప్రేమను ద్వేషాలతో విడదీయకండని ఈ కపుల్స్ చెబుతున్నారు.
 
కెరీర్ పాడుకాకూడదు

 
సత్యవేడు : ప్రేమ ఒక తియ్యని అనుభూతి. అందరూ ఆస్వాదించాలి. అయితే ప్రేమ మత్తులో పిచ్చివారై కెరీర్‌ను పాడుచేసుకోకూడదు. జీవితంలో ఎదుగుదలకు ప్రేమ స్ఫూర్తి కావాలి... అంటోంది ఓ ప్రేమజంట.
 
ప్రేమపెళ్లితో..
 
సత్యవేడుకు చెందిన వీరరాఘవులు, సరోజది ప్రేమ వివాహం. ఈ ఇద్దరివీ నిరుపేద కుటుంబాలు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి 1968లో తిరుత్తణి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అతడికి సరైన ఉద్యోగం లేదు. తిండిలేని రోజులు చూశారు. విద్యుత్‌శాఖలో కాంట్రాక్టు లేబర్‌గా చేరిన అతడు ఏడేళ్లు చాలీచాలని జీతంతో కాపురం నెట్టుకొచ్చాడు. ఆపై హెల్పర్‌గా, అసిస్టెంట్ లైన్‌మన్‌గా, లైన్‌మన్‌గా సత్యవేడు ఇతర పరిసర ప్రాంతాల్లో పనిచేశాడు. సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. రెండేళ్ల క్రితం అతను ఉద్యోగవిరమణ పొందారు. ప్రేమ పెళ్లి అయినందునే ఎంతటి కష్టాల్లోనూ భార్య సహకారం వెన్నంటి ఉందని, ఓ మంచి స్థాయికి రాగలిగానని అంటున్నాడు వీరరాఘవులు. ప్రస్తుతం లయన్స్‌క్లబ్‌లో మెంబర్‌గా ఉంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదలకు అతని వంతు ఆర్థిక సాయం అందిస్తూ ఆదర్శ జీవితం గడుపుతున్నాడు.
 
{పేమకు వైకల్యం అడ్డుకాదు

 
పూతలపట్టు:  మనిషికి అందంకాదు మనసు పెద్దదై ఉండాలి... దృఢ సంకల్పంతో ప్రేమ పెళ్లి జరిగిందని అంటున్నారు ఓ ప్రేమజంట. పాకాల మండ లం కామిచేనుపల్లెకు చెందిన శ్రీబాబు పుట్టుకతో వికలాంగుడు. రెండు చేతులు ఉన్నాయి. కానీ అవి పనిచేయవు. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలతో చదవాలనుకున్నాడు. కాళ్లను చేతులుగా భావించి రాయడం అలవాటు చేసుకున్నాడు. కాళ్లతో రాస్తూ ఆర్‌డీఏటీ(రూరల్ డెవలెప్‌మెంట్ అండ్ అప్రాప్రియేట్ టెక్నాలజీ) పూర్తి చేశాడు. వల్లివేడులోని రాజా జ్యూస్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్‌గా 1998లో చేరాడు. వల్లివేడుకే చెందిన చాన్‌బాషా కూతురు జ్యోతి అదే ఫ్యాక్టరీలో రోజువారీ వేతనం కింద విధుల్లో చేరింది. అప్పటి నుంచి శ్రీబాబు, జ్యోతి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమదాకా వెళ్లింది. 1999లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి దినేష్, లోకేష్ కుమారులు ఉన్నారు. శ్రీబాబు పంటపల్లె కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మంచితనం చూసి శ్రీబాబును పెళ్లి చేసుకున్నానని చెబుతోంది జ్యోతి. పెళ్లయిన నాటి నుంచి అతనికి సేవ చేయడంలో ఆనందం ఉందని, ప్రతిరోజూ అన్నం తినిపిస్తానని చెప్పింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement