ఒక్క క్షణం ఆలోచించండి | Sakshi
Sakshi News home page

ఒక్క క్షణం ఆలోచించండి

Published Wed, Sep 10 2014 2:56 AM

Today is World Suicide Prevention Day

నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం

అనంతపురం కల్చరల్: కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటే కదా జీవితం అంటాడు ఓ కవి. జీవిత ప్రయాణాన్ని ముగించే మరణం సహజంగా ఉంటేనే ఆ జీవితానికి సార్థకత. అయితే, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక, చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూస్తూ భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుత పరిస్థితులో అధికమవుతున్నారు.  
 
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, జీవితంలో పెరిగిపోతున్న యాంత్రికత, తీవ్రమైన మానసిక ఒత్తిడి, న్యూనతా భావం ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని మానసిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్షణికావేశానికి గురైన వ్యక్తుల ఆలోచనలను కొద్ది సేపు మళ్లించగలిగితే మళ్లీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయరని చెబుతున్నారు. ఇలాంటి మానసిక బలహీనుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారిని మంచి మార్గంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.   ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ ఆత్మహత్యలను నివారించే మార్గాలను తెలియజేశారు.
 
వివరాలు ఆయన మాటల్లోనే...
‘ఆత్మహత్యలు చేసుకునేవారిలో  చాలా మంది డిప్రెషన్‌కు లోనైన వారే. సున్నిత మనస్కులు, హిస్టీరికల్ మనస్తత్వం ఉన్న వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జీవితంపై సానుకూల ధోరణిలో ఒక్క క్షణం ఆలోచించినా ఆత్మహత్యను నివారించడం సులభం. సమస్యలను, బాధలను సన్నిహితంగా ఉండే బంధువులు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆత్మహత్య భావన మదిలో కదలినపుడు ఒకసారి అలా బయటకు వెళ్లి ఏకాంతంగా గడపడం, శ్వాసపై ధ్యాస ఉంచి  ఓ పది నిముషాలు నెమ్మదిగా ఉండడం ఉపయోగపడుతుంది. బంధువులు, కుటుంబ సభ్యులు సైతం బలహీన మనస్తత్వమున్న వారిని ఒంటరిగా వదలడం మంచిది కాదు.
 
జీవితం పట్ల అనురక్తిని పెంచేలా మాట్లాడడం ఉదాహరణలుగా ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలే కాదు ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చు. మనల్ని నమ్ముకున్న వారికి కడుపు కోత పెట్టడం ఎంతటి పాపమో ఆలోచిస్తే తప్పకుండా మనసు మారుతుంది.  కళ్లు పోగొట్టుకున్న లూయీ బ్రెయిల్, కాళ్లు పోగొట్టుకున్న సుధాచంద్రన్ , అవిటి వాడైన సినీనటుడు నూతన్‌ప్రసాద్.. వీరందరూ సాధించిన చిరస్మరణీయ విజయాలను గుర్తుకు తెచ్చుకుంటే ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మళ్లీ బతకాలనే ఆశను చిగురింపజేస్తుంది.

Advertisement
Advertisement